శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Apr 26, 2020 , 22:51:10

పాటే బావుటా!

పాటే బావుటా!

మేధావులను, ఉద్యోగులను, రైతులను, కూలీలను, ప్రభుత్వాలను తెలంగాణలోని సమస్త ప్రజలను ఒక్కతాటిపై నడిపి ఉద్యమ ఆంకాక్షను నెరవేర్చిన ఏకైక నాయకుడు కేసీఆర్‌.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాట ప్రవాహమై ప్రజల ఆకాంక్షల బావుటా ఎగురవేసింది. ఊరూ, వాడా రాష్ట్రసాధన కోసం కదిలింది. ఉద్యమంలో కవులు, కళాకారులకు రాత్రి పగలయ్యేది, పగలు రాత్రయ్యేది. ఒక్కో కళాకారుడు ఆడుతుంటే, పాడుతుంటే తెలంగాణ ప్రజల హృదయాంతరాలు బద్ధలయ్యేవి. ప్రతి ఊరూ ధూంధాంతో మార్మోగేది.

తెలంగాణ కోసంపాట పాడి, ఆట ఆడిన కవులూ కళాకారుల కృషి ఎనలేనిది. ఇందులో.. పొడుస్తున్న పొద్దు మీద.. గద్దర్‌; వానమ్మ వానమ్మ/ఇంకేం మిగిలిందిరా.. జయరాజు; రాజిగ ఒరి రాజిగ/ అవ్వొడివా నువ్వు అయ్యోడివా.. గూడ అంజయ్య; జయజయహే తెలంగాణ.. అందెశ్రీ;  జిల్లేలమ్మ జిట్ట/ఇద్దరం విడిపోతే.. గోరేటి వెంకన్న; గారడి జేస్తుండ్రు.. కేసీఆర్‌; నాగేటి సాలల్లో నా తెలంగాణ.. నందిని సిధారెడ్డి; రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా..  మిట్టపల్లి సురేందర్‌; అస్సయ్‌ దులా హారతి.. కోదాటి శ్రీనివాస్‌; ఉస్మానియా క్యాంపస్‌లో.. అభినయ శ్రీనివాస్‌; ఎట్లుండెనే నా పల్లె.. నేర్నాల కిషోర్‌/రమాదేవి; రేలదూలా తాలెల్లాడే నేల... నిస్సార్‌; వీరులారా వందనం.. దరువు ఎల్లన్న; జైజై బోలో తెలంగాణ.. యశ్‌పాల్‌; ఆడుదాం డప్పుల్లా.. మిత్ర ఇలా ఎందరో కవులూ కళాకారులు ఉద్యమ ఆకాంక్షలకు ప్రతీకలయ్యారు.  

ఈఉద్యమ క్రమంలోనే ఊరూరా వందలాది మంది కవులూ, గాయకులూ తయారయ్యారు. తమ ఆకాంక్షలన్నీ  ప్రజలు పాటలతోనే చెప్పారు. ‘అవ్వోడివా.. అయ్యోడివా.. తెలంగాణకు నువ్వు పాలోడివా’ అని ప్రశ్నించారు. ‘ఇద్దరం ఒక్కటైతే భూమి బద్ధలవుతుందా’ అని నినదించారు. కండ్లల్లో గోదారి పారుతున్నా, మా కాళ్లలో కృష్ణమ్మ కదుతులున్నా, మా గుండెల్లో దాహాలు తీరవాయే.. మా గుడిసెల్లో దీపాలు ఎలుగవాయే. ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ, జిల్లేడు మొలిసిందిరా.. ఇంకేమి మిగిలిందిరా, తెలంగాణ పల్లేరు కాసిందిరా అని కన్నీరు మున్నీరయ్యారు. ఇసుంట రమ్మంటు ఇల్లంత నాదంటు తిన్నింటి వాసాలు లెక్కేస్తివా. భాగ్యనగరానికి ముగ్గు పోసినవా..పొలిమెర్ల బొడ్రాయి పెట్టినవా, చార్మినార్‌కు సున్నమేసినవా, గోల్కొండకు రాయి మోసినవా ఇలా ప్రశ్నల వర్షాలు కురిపించారు.  ఈ పాటలతో ఊర్లన్నీ హోరెత్తాయి. ఇది మన తరం, మన తెలంగాణ సాగించిన అపూర్వ స్వాతంత్య్రోద్యమం. దీనికి ఓ గాంధీలా వెన్నంటి ఉండి మేధావులను, ఉద్యోగులను, రైతులను, కూలీలను, ప్రభుత్వాలను తెలంగాణలోని సమస్త ప్రజలను ఒక్కతాటిపై నడిపి ఉద్యమ ఆంకాక్షను నెరవేర్చిన ఏకైక నాయకుడు కేసీఆర్‌. తెలంగాణ కవులను, కళాకారులను ఉద్యమ నాయకుడైన కేసిఆర్‌ తల్లి కోడిలాగా చూశారు. ఉద్యమంలో వచ్చే ప్రతి పాటనూ సందర్భోచితంగా ప్రజాచైతన్యం కోసం ఓ ఆయుధంగా ఉపయోగించారు. ఉద్యమంలో పాటే బావుటాగా ఉద్యమానికి ముందుసాగింది. ఇలాంటి కవుల, కళాకారుల కన్న తెలంగాణ నిజంగా కోటి రతనాల వీణ.

- జయరాజ్‌, 9866160035


logo