బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Apr 25, 2020 , 00:05:06

సిద్దిపేటను చేరిన గోదావరి

సిద్దిపేటను చేరిన గోదావరి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక అయిన కాళేశ్వరం బృహత్పథకంలో మరో అడుగు ముందుకుపడినది. సిద్దిపేటతో పాటు పలు ఇతర జిల్లాల్లోని పొలాలకు సాగునీరు అందించే రంగనాయకసాగర్‌ జలాశయంలోకి శుక్రవారం నీటిని విడుదల చేయడం ఒక అద్భుతమైన దృశ్యం. ఎక్కడి కాళేశ్వరం, ఎక్కడి సిద్దిపేట? మేడిగడ్డ ఉన్నది సముద్ర మట్టానికి సుమారు 90 మీటర్ల ఎత్తున. రంగనాయకసాగర్‌ నెలకొన్నది 490 మీటర్ల ఎత్తున. మేడిగడ్డ నుంచి గోదావ రి జలాలు సుమారు 170 కిలోమీటర్లు- కొండలు కోనలు దాటుతూ, కాలువలూ సొరంగాల ద్వారా పరవళ్ళు తొక్కుతూ, వందలాది మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతూ వచ్చి, రంగనాయకసాగర్‌లో నొకింత బడలిక తీర్చుకొని, బీడుభూములను ముద్దాడి స్వర్ణమయం చేయడం కేసీఆర్‌ దార్శనికత, కార్యనిరతితోనే సాధ్యమవుతున్నది. ఒక్క మల్లన్నసాగర్‌ మాత్రమే కాదు, ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలన్నీ గోదావరి జలాలతో మిలమిలలాడబోతున్నాయి.

తెలంగాణ లక్ష్యసిద్ధికి కీలక భూమిక పోషించినది సిద్దిపేట. తెలంగాణ గరిమనాభి వంటి సిద్దిపేట అభివృద్ధి రాష్ట్ర పురోగతికి సూచిక. సిద్దిపేట శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినప్పుడే కేసీఆర్‌ ఇంటింటికి మంచినీరు అందించే పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఈ ప్రయోగమే నేడు తెలంగాణ అంతటా మిషన్‌ భగీరథ పేర అమలవుతున్నది. నాడు కేసీఆర్‌ మం చినీరు అందించిన జ్ఞాపకంతోనే, కాళేశ్వరం నీరు ఎక్కడికి రాకున్నా మాకు మాత్రం రావడం ఖాయం అంటూ ఇంతకాలం సిద్దిపేట జనం ధీమాగా ఉన్నా రు. మంత్రి హరీశ్‌రావు అన్నట్టు సిద్దిపేటవాసుల ఆకాంక్షల మేరకు జిల్లా ఏర్పడటమే కాకుండా నీళ్లు కూడా వచ్చాయి. త్వరలో రైలు కూత కూడా వినబోతున్నారు. ఇక సత్వర పారిశ్రామికాభివృద్ధి జరుపాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. వలస పాలనలో ఒక్క ఎకరం కూడా నీరు తడవని జిల్లా సిద్దిపేట. అటువంటిది ఇప్పు డు రంగనాయకసాగర్‌తో లక్షా పదివేల ఎకరాలకు నీరందించడమే కాదు, మల్ల న్నసాగర్‌, కొండమ్మ పోచమ్మ జలాశయాలతో నీటిని దోసిలిపట్టి నలుచెరుగులా దూపతీర్చబోతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత.

ప్రాచీన నాగరికతలన్నీ నదీ తీరాలలో వెల్లివిరిసినవే. భారత ఉపఖండంలో గంగ, సింధు నదుల తరువాత అతి పెద్ద నీటిపారుదల వ్యవస్థగా గోదావరికి గుర్తింపు ఉన్నది. ఈ నదీజలాలు తెలంగాణ అంతటా అల్లుకొని పోవడం వల్ల పాడి పంటలే కాకుండా పర్యాటకం, రవాణా వంటి పలు రంగాలు అభివృద్ధి చెందుతాయి. పారిశ్రామికాభివృద్ధికి పాదులు పడుతాయి. మంత్రి కేటీఆర్‌ అన్నట్టు తెలంగాణ నాలుగు విప్లవాలను చవి చూడబోతున్నది. హరిత విప్లవంతో పాటు నీలి (మత్స్య), శ్వేత (క్షీర), గులాబీ (మాంసోత్పత్తి) విప్లవాలు తెలంగాణ సమాజంలో భారీ పరివర్తన తీసుకురావడం ఖాయం. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా సమతుల అభివృద్ధిని సాధించబోతున్నాయి. పరస్పర కలహాలు, ప్రతికూల ఆలోచనావిధానాలను విడనాడి తెలంగాణలోని అన్నివర్గాలు ఈ నిర్మాణాత్మక అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. కేసీఆర్‌ కాంక్షిస్తున్న బంగారు తెలంగాణను సాకారం చేసుకోవాలి.


logo