గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Apr 25, 2020 , 00:02:00

ఆ నీళ్ల సప్పుడే గొప్ప సంగీతం!

ఆ నీళ్ల సప్పుడే గొప్ప సంగీతం!

నా చిన్నతనంల సిద్దిపేట నుంచి సైకిళ్ల మీద పోయి చంద్లాపురం గుట్ట చూసొచ్చేది. గుట్టమీద గుహలో వెలిసిన దైవం రంగనాయకస్వామి. ఆయన మిగతా ప్రాంతానికి పెద్దగా తెల్వదు. ఇవ్వాళ్ళ ఆ స్వామి పేరుమీదనే రంగనాయకసాగర్‌ నిర్మాణమయ్యింది.

సిద్దిపేటకు నీళ్లొచ్చినయి.. దుమ్మురేగిన భూములు దమ్మార దూప తీర్చుకుంటున్నయి. పంపుల నుంచి దుంకిన నీళ్లు మట్టిరంగు నింపుకొని నురగలతో తరగలతో రంగనాయకసాగర్‌ల పడుతున్న సప్పుడు వింటుంటే నా జన్మల నేను విన్న అత్యత్తమ సంగీతం ఇదే అనిపించింది. తరతరాల ఆర్తి తీరుతున్నదన్న సంబురం ఒక పక్క, దశాబ్దాల తరబడి అనుభవించిన గొడగొడ దుఃఖానికి సంబంధించిన జ్ఞాపకాలు ఇంకోపక్కా, రెండూ కలిసిన ఉద్వేగంతో  తీవ్ర భావసంచలనంతో నా కండ్లల్ల నీళ్లు తిరిగినయి. కరోనా పాడుగాను కాల్జేతులు కట్టేసింది, లేకుంటేనా! మన సిద్దిపేటకు, నెర్రెలిచ్చిన నంగునూరుకు, ఛిద్రమైపోయిన చిన్నకోడూరుకు, గోదావరి నీళ్లు తరలివచ్చినయని కనపడ్డ ప్రతి మనిషిని అల్ముకొని మరీ సంబురాన్ని పంచుకునేటోన్ని.

కేసీఆర్‌ సార్‌! నీకు కోటి దండాలు. నువ్వు నీ ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నవు. నిన్ను కన్న  సిద్దిపేట తల్లి రుణం తీర్చుకున్నవు. మేడిగడ్డ నుం చి నాలుగు వందల తొంభై మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసిన నీళ్లు భూమి కడుపుల జొచ్చి, ఉరికొచ్చి ఉరికొచ్చిన నీళ్లు రంగనాయకసాగర్‌ల దుంకుతుంటే చూసి చెప్పరాని సంబురంతో టి  చెమ్మగిల్లిన కళ్లతోటి చెప్తున్నా సార్‌! నువ్వు సిద్దిపేట రుణం తీర్చుకున్నవు గని,  మమ్ముల్ని నీ రుణంల పడేసినవ్‌.

నెత్తురు పారిన శప్త భూమి, కన్నీటి ధారలు ఇంకిన తప్తభూమి, ఇవ్వాళ గోదారి తల్లి పాదస్పర్శతో పులకరిస్తున్నది. తరరాలుగా ఏడ్చి ఏ డ్చి దమ్ముపట్టిన శిశువుల గొంతులలోకి జారుతున్న పాలధారలీ నీళ్లు. కండ్లల్ల ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్న మెట్టరైతుల జీవితాల్లో కురిసే అమృతధారలీ నీళ్లు. ఈ నీటి గలగలల చప్పుడులో, బత్కపోయిన బిడ్డల్ని పిలుస్తున్న కన్నపేగు పిలుపులున్నయి.

నదులు తాకని నేల మాది. మా సిద్దిపేట వాసులకు వాగులే తప్ప నదులు తెల్వయి. మందపల్లి వాగు, అక్కనపల్లి వాగు వంటి చిన్నచిన్న వాగులు పారితేనే  లావు సంబురం మాకు. చెరువు మత్తడి దుంకితెనైతే కట్టమీద జాతరనే. సమైక్య రాష్ట్రంల ఆ సంతో షం కూడా ఆవిరైపొయింది. నిలిచి కురిసే వానలు మాయమైనయి. నేల తడుపు వాన పడితేనే పేపర్లల్ల వార్తలు రాసే వింత రోజులొచ్చినయి. చెరువు లు చిత్రవధకు గురైనయి. వరుస కరువులతోటి సిద్దిపేట వ్యవసాయం, ఇరుసు విరిగిన బండి తీర్గ అయిపోయింది.

సిద్ద్దిపేటల వానలు సరిగ్గా పడవు గని, ప్రతి ఎండకాలం వడగండ్లు మాత్రం తప్పకపడుత యి. ఎవరో చెప్పిన్రు, నీళ్లు లేని తావుల్నే వడగండ్లు ఎక్కువ పడుతయట. వేటగాడెవడో గురిచూసి కొట్టినట్టు పడే రాళ్లవాన దెబ్బలకు, వరి వెన్నులు విరిగిపోతయి. మామిండ్లు రాలిపోతయి. రైతు నోటికాడి బుక్క ఎగిరిపోతది. ఒగ బాధ గాదు, ఒగ దుఃఖం కాదు, వడగండ్ల కడగండ్లతోని బతుకులు కూలిపోయినయి.

మహాభారతంల చెప్పినట్టు కాల మొక్కరీతి సాగబోదు. కాలం మారింది. శాపగ్రస్థమైన సిద్దిపేటనే కాలాన్ని రగిలించింది. తెలంగాణ ఉద్యమానికి తిరుగులేని నాయకుణ్ణి అందించింది. ఉద్యమంలో ప్రతి కీలకమైన మలుపు లో పెట్టనికోటగా నిలిచింది. పోరాటానికి ఇరు సై వెయ్యేనుగుల బలమిచ్చింది. సిద్దిపేట రెయిన్‌ షాడో ఏరియా. ప్రపంచం కొట్కపోయినా మా దగ్గర చినుకు రాలదు. ఉద్యమకాలంల ఒకసారి కేసీఆర్‌తో కలిసి సిద్దిపేటకు వస్తున్న. దారంతా వర్షం పడుతున్నది. అదేం దో సిద్దిపేట సమీపానికి రాంగనే వర్షం జాడా, పత్త లేదు. ‘చూసిన్రా సార్‌! లోకమంతటా వాన పడుతుంది. మన సిద్దిపేటల మాత్రం  చినుకు లేదు’ అని బాధతో అన్న. ఆరోజు సార్‌ అన్న మాట నాకు బాగా యాదికున్నది. ‘సీను, నా బొందిల పానముండంగనే తప్పకుండా తెలంగాణ తెస్త. సిద్దిపేటకు నదీజలా లు రప్పిస్తా. అప్పటిదాకా తప్పకుండా బతి కుంట’ అని మస్తు  హిమ్మతుతోని చెప్పిండు. మళ్లా మొన్నటి ఎన్నికల సమయంల హెలీకాప్టర్‌ల నుంచి రంగనాయకసాగర్‌ కట్ట చూపి స్తూ... ‘సీనూ ఇగో! సిద్దిపేట కష్టాలు తీర్చే కల్పతరువు’ అని కళ్ళెగరేసిండు. నాకు అప్పు డు కేసీఆర్‌ను కన్నతల్లి గర్భంబు ధన్యంబు అని అనిపించింది.

నా చిన్నతనంల సిద్దిపేట నుంచి సైకిళ్ల మీద పోయి చంద్లాపురం గుట్ట చూసొచ్చేది. గుట్టమీద గుహలో వెలిసిన దైవం రంగనాయకస్వామి. ఆయన మిగతా ప్రాంతానికి పెద్దగా తెల్వదు. ఇవ్వాళ్ళ ఆ స్వామి పేరుమీదనే రంగనాయకసాగర్‌ నిర్మాణమయ్యింది. రంగనాయకసాగర్‌ నిర్మాణంలో విశేషమేందంటే ఊర్లు ముంపునకు గురికాలేదు. వ్యవసాయభూములు ముంపునకు గురైనచోట రైతుల సహకారం మరువలేనిది. సిద్దిపేట సౌభాగ్యం లో ఈ రైతుల సౌహార్దం ఎప్పుడూ పరిమళిస్తుంది. అందరినీ యాజ్జేసుకోవాలె. అర్ధరా త్రి, అపరాత్రి అని లేకుండా, తెల్లవార్లు గంట ల తరబడి రివ్యూలు నిర్వహించిన హరీశ్‌రావు కార్యదీక్షను యాజ్జేసుకోవాలె.

సిద్దిపేట నియోజకవర్గంలోని లక్షా పదివేల పైన ఎకరాలకు రంగనాయకసాగర్‌ ద్వారా సాగునీరు లభిస్తది. నియోజకవర్గంలోని చెరువులన్నీ ఏడాది పొడుగునా నిండి ఉంటయి. ప్రజల ఆర్థిక, సామాజిక జీవితంలో ఇది గొప్ప పరివర్తన. తీవ్ర దుర్భిక్షం తెచ్చిన దీన త్వం ఇక పూర్తిగా మటుమాయమైపోతుంది. ప్రతి రైతు మోము నీటిలో చంద్రబింబం వలె మెరుస్తుంది. ఒక్క పంటకే దిక్కులేని చోట, ఇకముందు గ్యారంటీగా రెండు, మూడు పం టలు పండుతయి. ఆత్మగౌరవంతో రైతు నిటారుగా నిలబడుతడు. నీటి కోసం పెట్టే పెట్టుబడి మిగలుతది, దిగుబడి, రాబడి పెరుగుతయి. రైతుల జీవితాల్లో నూతన వసంతం వికసిస్తది.

ఊరూరా ట్రాక్టర్లు పెరుగుతయి, మెకానిక్‌లకు చేతినిండా పని దొరుకుతది. ఆటోమోబై ల్‌ రంగంలో ఉపాధి వస్తది. అగ్వకు చేపలు దొరుకుతయి. పౌష్టికాహార లోపం ఉండదు. మత్సకారుల జీవన ప్రమాణాలు మారుత యి. పాడిపరిశ్రమ అభివృద్ధి అయితది. వ్యవసాయ అనుబంధ వృత్తులు మెరుగుపడుత యి. చెట్టూ చేమ పచ్చగా ఎదుగుతయి. వలసపోయిన మనుషులే కాదు, వలసపోయిన  పిట్టలు కూడా వాపసొస్తయి. నిండిన చెరువు లల్ల నీటి కోళ్లు, బుడుబుంగలు మునిగి ఆడుతయి. బోర్ల అవసరం తీరిపోతది. బావులల్ల ఊటలు ఉప్పొంగుతయి. పల్లె శైథిల్యానికి గుర్తుగా నిలిచినా మొం డిగోడల ఇండ్లు పోత యి. పునరుజ్జీవనానికి గుర్తుగా పల్లెల్లో మేడలు మిద్దెలొస్తయి. దిగూట్ల కొత్త దీపాలు వెలుగుతయి. పల్లె ఆటలు, పాటలు మళ్లా ప్రాణం పోసుకుంటయి. దేవుళ్లకు గూడా వైభోగం పెరుగుతది. రంగనాయకస్వామికి భోగం పెరిగితే అంతగిరి  పోచమ్మకు బోనాలు పెరుగుతయి. రంగనాయకసాగర్‌ ఆవిష్కరించే రేపటి దృశ్యం తలుచుకుంటేనే గుండె నిండుతున్నది.కేసీఆర్‌ సార్‌! థాంక్యూ వన్స్‌ అగైన్‌.

దేశపతి శ్రీనివాస్‌


logo