గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Apr 23, 2020 , 22:30:08

స్వచ్ఛ జీవనం

స్వచ్ఛ జీవనం

కరోనా వైరస్‌ను అరికట్టడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో కొన్ని అనూహ్య సంభ్రమాశ్చర్యకర ఫలితాలు కనిపిస్తున్నాయి. గంగానదిలోని నీరు తాగడానికి ఉపయుక్తమైనంత స్వచ్ఛంగా మారిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. లీటరు నీటిలో ఏడు మిల్లీగ్రాముల ఆక్సిజన్‌ మోతాదు ఉంటే స్వచ్ఛజలంగా గుర్తిస్తారు. ఆక్సిజన్‌ మోతాదు గంగానది ఎగువభాగంలో 8.9, దిగువ న 8.3 మిల్లీ గ్రాములు ఉన్నది. హరిద్వార్‌ మొదలుకొని కాన్పూర్‌, ప్రయాగరాజ్‌, వారణాసి తదితర ప్రాంతాల్లో ఎక్కడచూసినా గంగానది తన సహజ స్వచ్ఛతతో ప్రవహిస్తున్నది. ఇంతకాలం గంగానదిని చేతులారా కలుషితం చేసుకున్నామనేది తెలిసిందే. మురికినీళ్ళను వదలడం, పరిశ్రమల కాలుష్యాన్ని విడువడం, చెత్తా చెదారం పారేయడం మొదలైన కారణాల వల్ల గంగానది కలుషితమైపోయింది. గంగ మాత్రమే కాదు, యమున తదితర నదులు కూడా ఇప్పుడు స్వచ్ఛమైన జలంతో తళతళలాడుతున్నాయి.

దాదాపు యాభై కోట్ల మందికి జలాన్ని, జీవనాన్ని ప్రసాదించే గంగానదికి ప్రపంచంలో మరే నదీ సాటిరాదు. పదకొండు రాష్ర్టాల్లో అనేక ఉపనదులతో కూడిన ఈ నదీ వ్యవస్థ మానవులకు, చెట్టుచేమలకు ప్రాణాధారం. ఇంతటి గొప్ప జీవనదిని ప్రపంచంలోని అత్యంత కలుషితనదుల్లో ఒకటిగా మార్చుకు న్న ఘనత మనది. పుండు ఒకచోట అయితే మందు మరోచోట పెట్టినట్టు గంగానదీ ప్రక్షాళన పేర దశాబ్దాలుగా వేల కోట్లు కుమ్మరిస్తున్నాం. గంగ మాదిరిగానే దేశంలోని పలు నదులు కలుషితమయ్యాయి. వాటి ప్రక్షాళనకూ పథకాలు చేపడుతున్నాం. కానీ ఒక్క పైసా లేకుండా ప్రక్షాళన చేయడం ఎలాగో కరోనా వైరస్‌ మూలంగా తెలిసివచ్చింది! ఇంతకాలం ఈ విషయం తెలువదా? తెలిసీ ఆత్మవంచనకు పాల్పడ్డామా అనేది ఆలోచించుకోవలసిన సందర్భమిది. నదీ మాతలను మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. అవి సహజంగా స్వచ్ఛంగానే ఉంటాయి. మనం కలుషితం చేయకుండా ఉంటే చాలు.

ఒక్క నదులే కాదు, భూగోళం యావత్తూ మానవులు సృష్టించిన కాలుష్యం తో నిండిపోయింది. అందుకే కరోనా గండం గట్టెక్కడంతో సరిపోదని, అంతకన్నా ప్రమాదకరమైన ‘వాతావరణ మార్పు’ విపత్తు ఉండనే ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పు కొవిడ్‌ కన్నా ప్రమాదకరమైనది. భూగోళంపై సకల జీవరాశులను హరించివేస్తుంది. కరోనా కట్టడి తర్వాత పరిశ్రమలను ఆదుకోవడానికి పలు దేశాలు ఉద్దీపనలను ప్రకటిస్తున్నాయి. కానీ ఈ ఉద్దీపనల వల్ల లబ్ధి పొందే పరిశ్రమలు మానవాళిని నాశనం చేసేవిగా ఉండకూడదు. ఉద్దీపనలు హరిత పథకాలై ఉండాలంటూ ఇటీవల ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ సూచించ డం గమనార్హం. ఇక ఇప్పటినుంచి పర్యావరణహితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేపట్టడం మంచిది. వాతావరణ మార్పును అరికట్టే లక్ష్యాలకు అనుగుణంగా నే, తమ పథకాలుంటాయని గతవారం రోజుల్లో జర్మనీ, ఫ్రాన్స్‌తోపాటు ఇతర ఈయూ దేశాలు ప్రకటించాయి. ఇతరదేశాలూ ఇదేదారిలో నడిస్తే బాగుంటుం ది. పరిశ్రమలు మారినంత మాత్రాన సరిపోదు. ప్రజల జీవనవిధానాలూ పర్యావరణానికి ముప్పు కలిగించనిరీతిలో ఉంటేనే మానవాళి మనుగడ సాధ్యం.


logo