శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Apr 23, 2020 , 22:28:13

ఆర్థిక వృద్ధికి తక్షణ కార్యాచరణ

ఆర్థిక వృద్ధికి తక్షణ కార్యాచరణ

కరోనా కట్టడి కోసం పోరాడుతున్న వైద్య, భద్రత, పారిశుధ్య తదితర రంగాల సిబ్బందికి ఆత్మైస్థెర్యం కలిగించడానికి చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం అవసరమే. కానీ, కుప్పకూలుతున్న దేశ ఆర్థికవ్యవస్థను చక్కదిద్దడానికి తక్షణ చర్యలు కూడా అవసరమే. దేవుడి దయవల్ల 2008 నాటి ప్రపంచ ఆర్థికసంక్షోభం మన దేశానికి తాకలేదు. నేటి లాక్‌డౌన్‌ ఈ శతాబ్దంలో ఎన్నడూ చూడనంత కష్టాలను తెచ్చిపెట్టింది. అయినా బతుకుదెరువు కన్నా ప్రాణాలే ముఖ్యమని ప్రధాని, ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కరోనా కట్టడికి కేంద్ర ఆరోగ్యమంత్రి, కార్యదర్శి, రాష్ర్టాల ఆరోగ్యమంత్రులు, ప్రిన్సిపల్‌ ఆరోగ్య కార్యదర్శులతో కూడిన ఒక వ్యూహ బృందాన్ని ఏర్పాటుచేస్తే బాగుంటుంది. కరోనాను తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో, తక్కువ ప్రాణనష్టంతో కట్టడిచేయాలి.

కరోనా విపత్తు భారత్‌కు ఆర్థిక సునామీ వంటిదని గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. అయితే అమెరికా, యూరప్‌, ఆసియా-పసిఫిక్‌ దేశాల మాదిరిగా భారత్‌ సంక్షోభంలో పడకపోవచ్చు. భారత్‌ ఆర్థికంగా జాగ్రత్త పడటానికి ఈ లాక్‌డౌన్‌ కొంత వ్యవధిని ఇస్తున్నది. భారత్‌కు అపార మానవ వనరులున్నాయి. ఫార్మా, ఐటీఈఎస్‌ రంగాల్లో పట్టున్నది. వ్యవసాయోత్పత్తి భారీ గా జరిగింది. పరిశ్రమలు తక్కువ వ్యయంతో పనిచేయగలవు. కార్మిక వనరులు చౌకగా లభిస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ, వ్యాపార అనుకూల చట్టాలు మన దేశానికి అనుకూల అంశా లు. అందువల్ల చైనా ప్రతికూలతలను మనం అనుకూలంగా మార్చుకొని ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు సాధించాలి. 

ఆర్థికాభివృద్ధి చర్యలు చేపట్టడానికి ముం దు అవ్యవస్థీకృత రంగంలోని మన కార్మికుల ను ఆదుకోవడం అవసరం. ఆర్థిక పునరుజ్జీవనంలో కీలకపాత్ర పోషించవలసింది వీరే. ప్రధాని ‘గరీబ్‌ కళ్యాణ్‌ యోజన’ పేర 22 బిలియన్‌ డాలర్లతో ప్యాకేజీని ప్రకటించారు. కానీ ఇదే మాత్రం సరిపోదు. అమెరికా, సింగపూ ర్‌, తదితర దేశాలు జీడీపీలో 10 శాతం మేర ప్యాకేజీలు ప్రకటిస్తే, మన దేశం ప్రకటించింది ఒక శాతం మాత్రమే. ‘పీఎం కిసాన్‌' పథకం కింద ఇచ్చే రూ.6 వేలలో రూ. 2 వేలు ముందస్తుగా ఇస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఎకరానికి రూ. 10 వేలు ఇవ్వాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.  

ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు మూడు నెలల పాటు ఇవ్వడం మంచిదే. కానీ, దీనిని మరో ఐదారు నెలలకు పొడిగించాలి. రాజస్థాన్‌, తమిళనాడు, జార్ఖండ్‌ రాష్ర్టాలు నగర పేదలకు స్వచ్ఛంద సంస్థల ద్వారా వండిన ఆహా రం అందిస్తున్నాయి. గ్రామీణ ఉపా ధి హామీ పథకం కింద కుటుంబానికి అదనం గా 2 వేలు ఇవ్వడం ద్రవ్యోల్బణానికి  అనుగుణమైన సర్దుబాటే తప్ప అదనం కాదు. పైగా దీనిని వ్యవసాయంతో అనుసంధానం చేయ డం లేదు.

పునరుద్ధరణ వ్యూహం అంతా అతితక్కువ కాలంలో దీర్ఘకాలిక దృష్టితో జీడీపీని డబుల్‌ డిజిట్‌లో వృద్ధి చేసేదిగా ఉండాలి. కరోనా అనంతర పరిస్థితుల్లో లభించే అవకాశాలను ఉపయోగించుకోవాలి. మనం  చైనా దిగుమతులపై ఆధారపడకుండా దేశంలోనే అవసరమైన ఉత్పత్తిని పెంపొందించుకోవాలి.

కరోనా దాడి నేపథ్యంలో పలు రాష్ర్టాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. తెలంగాణ రాష్ర్టానికి నెలవారీ పన్ను, పన్నేతర ఆదాయం రూ.4 వేల కోట్ల మేర వచ్చేది. కానీ, ఏప్రిల్‌లో మొదటి పదిరోజులు వచ్చిన ఆదాయం వంద కోట్లు మాత్రమే. ఏప్రిల్‌ నెల మొత్తం లాక్‌డౌ న్‌ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 3,700 కోట్లు కోల్పోతుంది. ఏపీ ప్రభుత్వం ఏప్రిల్‌లో 4,500 కోట్లు కోల్పోవ చ్చు. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా వ్యవహరించవలసి ఉన్నది. 

పునరుద్ధరణ వ్యూహం అంతా అతితక్కువ కాలంలో దీర్ఘకాలిక దృష్టితో జీడీపీని డబుల్‌ డిజిట్‌లో వృద్ధి చేసేదిగా ఉండాలి. కరోనా అనంతర పరిస్థితుల్లో లభించే అవకాశాలను ఉపయోగించుకోవాలి. మనం  చైనా దిగుమతులపై ఆధారపడకుండా దేశంలోనే అవసరమైన ఉత్పత్తిని పెంపొందించుకోవాలి. కాలం మించిపోతు న్నందువల్ల కేంద్రం ఇంకా వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తే ప్రమాదకరం. అందు కు కేంద్రం ఈ చర్యలను చేపట్టాలి. మొదటగా-అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు  పలు కేంద్రీయ బ్యాంకుల మాదిరిగా మనం కూడా ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌' ద్వారా  మాంద్యాన్ని తిప్పికొట్టాలి. రెండవ చర్య-ఇప్పుడున్న స్థాయి నుంచి 150-200 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీని సరళీకరించాలి. ‘ఎంఎస్‌ఎంఈ’లకు వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం ఆర్థిక సంస్థలు రుణాలివ్వాలి. నగదు ఉన్నప్పటికీ బ్యాంకులు రుణాలివ్వడానికి ముందుకురావడం లేదు. రివర్స్‌ రెపోను శూన్యానికి దింపి ఆర్థిక సంస్థల ద్వారా ‘ఎంఎస్‌ఎంఈ’ రంగాన్ని పునరుజ్జీవింపజేయాలి. మూడవది-ప్రజలు ఖర్చుచేయడానికి వీలుగా వారిచేతిలో మరికొంత డబ్బు పెట్టాలి. 20 లక్షలకు పైగా పన్ను చెల్లించేవారి చేతిలో ఎక్కువ నగదు ఉంటే, వారు అధికంగా వ్యయం చేస్తారని డైరెక్ట్‌ టాక్స్‌ కోడ్‌ కమిటీ సూచించింది. నాలుగవది-జీఎస్టీ రేట్ల ను తగ్గించాలి. ఆర్‌బీఐ ఈఎంఐ మారటోరి యం ప్రకటించింది. కానీ, వడ్డీని రద్దుచేయ డం తక్షణావసరం. ఐదవది-ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయవలసిందిగా ఆర్‌బిఐని ఆదేశించాలి. 

ఆరవది-ఆర్‌బీఐ దగ్గర రూ.9 లక్షల కోట్ల నిల్వలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 16 శాతం నిల్వలుంటే ఆర్‌బీఐకి మాత్రం తమ ఆస్తుల్లో 26.5 శాతం నిల్వలున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ఆర్‌బీఐ తొమ్మిది లక్షల కోట్లను ప్రభుత్వానికి ఇవ్వాలి. ఏడవది-కేంద్ర ప్రభుత్వం పదేండ్ల ‘లాక్‌ ఇన్‌ పీరియడ్‌'లో ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ బాండ్స్‌ విడుదల చేయాలి. దీనివల్ల మార్కెట్లో ధనం ఏర్పడుతుంది. ఎనిమిదవది-తీవ్ర ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంబీఎఫ్‌సీ, హౌజింగ్‌ ఫైనా న్స్‌, కార్పొరేషన్‌, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ మొదలైనవాటికి తోడ్పాటునివ్వాలి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమ అయిన పౌల్ట్రీరంగం తప్పుడు ప్రచారం మూలంగా నష్టాల పాలై 70 లక్షల మంది కార్మికులు రోడ్డునపడ్డారు. ఇలాంటి రంగాలను ఆదుకోవాలి. చివరగా.. ఇటువం టి అసాధారణ, అనూహ్య లాక్‌డౌన్‌ పరిస్థితు ల్లో ఆర్థికలోటు పరిమితి, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను పట్టుకువేలాడటం మంచిదికాదు. ఆర్థికలోటును 3 నుంచి 6 శాతానికి పెంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అయితే రేటింగ్‌ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్స్‌ ను కూడా పట్టించుకోవాలి. ఇన్వెస్టర్లు వీటినే నమ్ముతారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సమతుల్యం పాటించాలి. ఈ విధంగా అభివృ ద్ధి దృక్కోణంతో వ్యవహరిస్తే భారత్‌ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. 

(వ్యాసకర్త: చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యులు)


logo