సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Apr 23, 2020 , 22:23:31

డియర్‌ మదర్‌

డియర్‌ మదర్‌

ఇంతకు మునుపు 

నువ్వు నాకు గానీ ప్రపంచానికి గానీ

పరిచయం లేని సామాన్యురాలివి!

అటు నీవూ.. ఇటు నేనూ..

అఖండమైన భారతావనిలో

అణువంత మాత్రమే!

వైరాలజీ అధ్యయనంలో నీవు

విధి నిర్వహణలో నేనూ

అప్రమత్తులం..!

మాతృత్వం ఆస్వాదించే సమయం

దగ్గర పడుతున్నా

ఎక్కడో ఒక కలవరం

మాతృదాత్రిని కంటికి కనిపించని

అణువంత జీవి మృత్యు ముఖం వేసుకొని

కబళించడానికి తిరుగుతున్నదని

మనవైపే వస్తున్నదని తెలిసి

నీకు తక్షణ కర్తవ్యం గుర్తుకొచ్చింది!

మూర్తీభవించిన మానవత్వానికి

నిలువెత్తు రూపంగా

నడిసంద్రంలో చిక్కుకున్న మానవుడికి

దొరికిన చిన్న ఆధారంగా కనిపించావు

సరిహద్దుల్లోని సైనికుడిలా 

యుద్ధానికి సిద్ధమై

వద్దని నీవాళ్లు వారించినా..

ఒంటరిపోరాటం మొదలుపెట్టావు!

అనుకున్నది సాధిస్తాననే

నమ్మకం సన్నగిల్లుతున్నా

ఒక మూల నీపై నీకు

చిగురంత చిన్ని ఆశ!

గమ్యం చేరాలంటే..

ఒక్క అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది

అదే నీకు స్ఫూర్తి

‘మైల్యాబ్‌ డిస్కవరీ’ని నివాసంగా చేసుకొని

దగ్గర పడుతున్న పురిటినొప్పులను లెక్కచేయక

నేను సైతం భరతమాతకు అంటూ

నిద్రాహారాలు మాని కృషిచేసి

చివరికి విజయం సాధించావు!

ఎవరికైనా జీవితంలో

జననం.. మరణం.. రెండే దారులు

కానీ.. నీవు మాత్రం

రెండు మృత్యుముఖాల నడుమ

ఒక జీవతీగను పట్టుకొని

చావో రేవో అంటూ

నీకు నీవే సవాల్‌ విసురుకొని

అణువంత జీవిని కనిపెట్టే మంత్రపెట్టెను కనుగొని

జాతికి అంకితం చేశావు!

బిడ్డకు జన్మనిచ్చి.. బతుకు బరోసా ఇచ్చావు 

ఒకేసారి రెండు విజయాలు!!

నీ నిస్వార్థ శ్రమ ముందు

స్వార్థం చిన్నబోయింది

నీ సంకల్పశక్తి ముందు

అపజయం నిరాశ చెందింది

నీ కీర్తి భరతావనిలోనే కాదు

ఖండాంతరాలకు వ్యాపించి

ఆజన్మాంతం నీ పేరును స్మరిస్తుంది!

ఇప్పుడు,

నీవు ప్రపంచానికి కాగడా వెలుగువు

మహిళలందరికీ స్ఫూర్తివి

నేను స్తంభించిన ప్రపంచంలో

రక్షణ వలయాన్ని గీసుకున్న గృహంలో

నన్ను నేను ఖైదు చేసుకొన్న సబలను...

(అతి తక్కువ సమయంలో కరోనా వైరస్‌ టెస్ట్‌ కిట్‌ కనుగొని స్ఫూర్తి నింపిన ‘మినాల్‌ దఖావే బోస్లే’కు వందనాలతో)


logo