సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Apr 21, 2020 , 22:53:27

విపత్తు రాజకీయం

విపత్తు రాజకీయం

కరోనా వైరస్‌తో పెను ముప్పు పొంచి ఉన్నదని కేంద్ర ఆరోగ్య, కటుంబ సంక్షేమశాఖ హెచ్చరిస్తున్న సమయంలోనే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహ రిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. అందరూ చేయిచేయి కలిపి పోరాడాల్సి న ఆపద సమయంలో నిర్లక్ష్యపు నీడలు, సంకుచిత రాజకీయాలు బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. ఈ నెల 20 నుంచి ప్రకటించిన సడలింపుల సాకుతో రాష్ర్టాలు వ్యవహరించిన తీరుపై కేంద్రం ఆగ్రహించింది. కొవిడ్‌ కట్టడికి అనుసరించాల్సిన విధివిధానాలతో తాజాగా విస్పష్ట ఆదేశాలు జారీచేయాల్సి వచ్చింది. చాపకింది నీరులా విస్తరిస్తున్న వైరస్‌ విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రామన్‌ ఆర్‌.గంగఖేద్కర్‌ ప్రకారం.. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం మందిలో వ్యాధి లక్షణాలు కనిపించటం లేదు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్‌ను గుర్తించటం అసాధ్యమే గాక, రాబోయే ముప్పుకు అదే కారణం కూడా!

అభివృద్ధి చెందిన యూరప్‌, అమెరికా, ఇంగ్లండ్‌ దేశాలతో పోలిస్తే వైరస్‌ వ్యాప్తి, మరణాల సంఖ్య భారత్‌లో తక్కువ. ఈ గణాంకాలను చూసి నిర్లక్ష్యం, అతి విశ్వాసం పనికిరాదు. మిగతా ఆసియా దేశాలు జపాన్‌, ఇండోనేషియా, పాకిస్థాన్‌తో పోలిస్తే మన దేశంలో వైరస్‌ విస్తరణ గ్రాఫ్‌ క్రమంగా పెరుగుతున్న తీరు ప్రమాద సంకేతమే. గత రెండు రోజుల్లో దేశంలో వైరస్‌ బాధితుల సంఖ్య 16 శాతం పెరిగింది. ఇలా ప్రతి రెండు రోజులకు 16 శాతం పెరుగదల రేటు ఉంటున్నది. కరోనా పీడితుల సంఖ్య ఇట్లాగే పెరిగితే వారం రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య 30 వేలు దాటవచ్చని వైద్య ఆరోగ్య నిపుణుల అంచనా. ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలతో వైరస్‌ను నిలువరించటం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకుపోవాలి. కానీ కేం ద్ర సడలింపులతో కేరళ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించుకొని చిన్న, మధ్యతరహా పరిశ్రమలను, ప్రజా రవాణాను ప్రారంభించింది. దీన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవటంతో కేరళ తమను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆరోపించింది. కేంద్ర నిపుణుల బృం దం సీఆర్‌పీఎఫ్‌ సాయంతో తమ రాష్ట్రంలో పర్యటించటాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసిస్తూ కేంద్రానికి లేఖాస్త్రం సంధించి రాజకీయాలకు తెరతీయటం గర్హనీయం.

పది కోట్ల మంది ప్రాణాలను బలిగొన్న 1918 నాటి స్పానిష్‌ ఫ్లూ మాదిరిగా కరోనా ప్రబలుతున్నదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధన మ్‌ గేబ్రియోసస్‌ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది వైరస్‌ బారినపడి, 2 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయిన దుస్థితిలో రాజకీయాలు తెరమీదికి రావటం విషాదం. అమెరికా, న్యూయార్క్‌లో లాక్‌డౌన్‌ ఎత్తేయాల ని కొంతమంది ఏకంగా సాయుధ ప్రదర్శన చేయటం విడ్డూరం. ఇలాగే అమెరికాలోని పలు రాష్ర్టాల్లో దిగ్బంధన వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. వీటివెనుక ట్రంప్‌ హస్తమున్నదని పలు రాష్ర్టాల గవర్నర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కరోనా కోరలు పీకేందుకు కలిసికట్టుగా నడువాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇది గతానుభవాలు చెబుతున్న పాఠం. తప్పక నేర్చుకోవాల్సిన గుణపాఠం.


logo