గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Apr 21, 2020 , 22:52:16

ఆర్థిక వృద్ధికి గండం!

ఆర్థిక వృద్ధికి గండం!

రోజురోజుకు ‘కరోనా’ వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశ పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ అన్న చందంగా మారింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం లాక్‌డౌన్‌ మాత్రమే. 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగినా, దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గలేదు. అందుకే కేంద్రం మే నెల 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది. ఆ తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోతే లాక్‌డౌన్‌ను పెంచే అవకాశం ఉన్నది. లేకపోతే వైరస్‌ మరింత ప్రబలే అవకాశం ఉన్నది. లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థకు ప్రమాదం పొంచి ఉన్నా ప్రజారోగ్యమా? లేక దేశ ఆర్థికమా? అంటే ప్రజారోగ్యమే ముఖ్యమని చెప్పకతప్పదు.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పరిస్థితి క్లిష్టంగా ఉన్నది. అలాగే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, వంటి నగరాలు కూడా ఇప్పుడు కరోనాతో అల్లాడుతున్నాయి. ఈ నగరాల్లో పరిసస్థితి తొందరగా అదుపులోకి రావడం కష్టమే

దేశంలో మన ఆర్థికవ్యవస్థకు సవాళ్లు కొత్తకాదు. క్లిష్ట సమయాల్లో ఒడిదుడుకులకు లోనై నా ఆర్థికవ్యవస్థ తిరిగి పట్టాలెక్కిన సందర్భాలెన్నో ఉన్నాయి. కానీ, ప్రజల ప్రాణాలు తిరిగి రానివి. అందుకే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌ను పొడిగించేందుకే మొగ్గుచూపారు. దీంతో ఇవ్వాళ కాకపోయినా కొన్నిరోజుల తర్వాతైనా కరోనా తగ్గుముఖం పట్టవచ్చు. ఇటలీ, స్పెయిన్‌, చైనా వంటి దేశా లే ఇందుకు నిదర్శనం. కాకపొతే, కరోనా వల్ల కుదేలైన దేశాల ఆర్థికవ్యవస్థలను గాడిలో పెట్టడానికి మరింత ఎక్కువ సమయమే పట్టేలా కనిపిస్తున్నది. నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ చెప్పినట్లు ‘యుద్ధం కన్నా యుద్ధానంతర పరిస్థితులే భయానకంగా ఉంటాయి’. 

దేశంలో లాక్‌డౌన్‌ కష్టాల నుంచి కోలుకొని ఆర్థిక వ్యవ స్థ పూర్తిస్థాయిలో పట్టాలెక్కడానికి కనీసం 6 నుంచి 12 నెలలు పట్టవచ్చు. అంతేకాదు, ఈ ఏడాది మైనస్‌ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉన్నది. ప్రపంచంలో దీర్ఘకాలం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న దేశం మనది. అత్యధిక కొనుగోలుశక్తి ఉన్న దేశాల్లో ఒకటి. అతిపెద్ద మార్కె ట్‌, అతిపెద్ద ఆర్థికవ్యవస్థలో ఐదవది. అలాం టి దేశంలో లాక్‌డౌన్‌వల్ల కలిగే నష్టాలు కూడా ఎక్కువే ఉండబోతున్నాయి. దేశంలో మొత్తం నలభై రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. దీంతో ప్రజా రవాణా ఆగిపోయింది. నిత్యావసరాలు తప్ప అన్నిరకాల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం, లాక్‌డౌన్‌ వల్ల కేంద్రానికి రోజుకు రూ.40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నది. ఇక లెక్కల్లోకి రాని అసంఘటిత రంగాన్ని కలుపుకొంటే ఈ నష్టం రోజుకు సుమారుగా రూ.75 వేల కోట్లు. కేంద్రం, రేటింగ్‌ ఏజెన్సీల లెక్కల ప్రకా రం 21 రోజుల లాక్‌డౌన్‌ వల్ల రూ.9 లక్షల కోట్ల నష్టం వచ్చింది. 

ఇక లాక్‌డౌన్‌ మరో 19 రోజుల పాటు పెరిగింది. తద్వారా మరో రూ. 8 లక్షల కోట్ల మేర నష్టపోయే అవకాశం ఉన్న ది. మొత్తంగా నలభై రోజుల లాక్‌డౌన్‌ వల్ల సుమారుగా రూ.17 లక్షల కోట్ల నష్టం వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ మే 3 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసినా వెంటనే ఆర్థికవ్యవస్థ పుంజుకోవడం కష్టమే. దశలవారీగా లాక్‌డౌన్‌ తొలగించినా గతంలోని పరిస్థితికి చేరుకోవడానికి ఎక్కువ కాలమే పడుతుంది. లాక్‌డౌన్‌ సడలించినా కొన్ని ఆంక్షలు అమల్లో ఉంటా యి కాబట్టి పరిమిత సంఖ్యలో ఆర్థిక కార్యకలాపాలు మాత్రమే జరుగుతాయి. ఒకవేళ కనీ సం యాభై శాతం ఆర్థిక కార్యకలాపాలు జరిగినా, ప్రస్తుత లెక్కల ప్రకారం మొత్తం రూ.20 వేల కోట్ల మేర మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. ఆ లెక్కన, లాక్‌డౌన్‌ సడలించిన తర్వాతి 6 నెల ల కాలంలో సుమారుగా రూ.36 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. 

నలభై రోజుల లాక్‌డౌన్‌ వల్ల రూ.17 లక్షల కోట్లు, తర్వాత 6 నెలల కాలంలో వచ్చే నష్టం రూ.36 లక్షల కోట్లు. మొత్తంగా కలిపితే రూ. 53 లక్షల కోట్ల మేర మన ఆర్థికవ్యవస్థ నష్టపోయే అవకాశం ఉన్నది. ‘వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ’ అనే అమెరికా సంస్థ నివేదిక ప్రకా రం.. భారత ఆర్థికవ్యవస్థ పరిమాణం ఏటా రూ.209.62 లక్షల కోట్లు. లాక్‌డౌన్‌ తర్వాతి పరిస్థితుల వల్ల తిరిగి ఆర్థికవ్యవస్థ గాడిన పడేంతవరకు వచ్చే నష్టాలు సుమారు రూ.53 లక్షల కోట్లు. అంటే మొత్తం 209 కోట్లలో ఇది నాలుగింట ఒక వంతు. అదికూడా 6 నెలల్లో పరిస్థితి చక్కబడితేనే అంతమేర నష్టం. సమ యం ఎక్కువైతే నష్టం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. అంటే మన దేశ ఆర్థికవ్యవస్థలో సుమారు 30 శాతం వరకు నష్టపోయే అవకాశం ఉన్నది. ఇక అసంఘటితరంగంలో జరిగే ఆర్థిక కార్యకలాపాల విలువ మొత్తం ఆర్థికవ్యవస్థలో 25 శాతం అనుకున్నా రోజుకు రూ.10 వేల కోట్ల మేర, 40 రోజులకు రూ.4 లక్షల కోట్లు, మిగిలిన 6 నెలలకు రూ.16 లక్ష ల కోట్ల నష్టం వాటిళ్లుతుంది. మొత్తంగా చూస్తే మన ఆర్థికవ్యవస్థకు సుమారుగా రూ. 70 లక్షల కోట్ల మేర నష్టం ఏర్పడే అవకాశం ఉన్నది. 

ఈ లెక్కన ఏటా ఆర్థికవృద్ధిని అంచనా వేయటం నీటి మీద బుడగ వంటిదే. ముఖ్యం గా, దేశ ఆర్థికవ్యవస్థలో నగరాలు, పట్టణాల వాటా 60 శాతం కంటే ఎక్కువ. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పరిస్థితి క్లిష్టంగా ఉన్నది. అలాగే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, వంటి నగరాలు కూడా ఇప్పుడు కరోనాతో అల్లాడుతున్నాయి. ఈ నగరాల్లో పరిసస్థితి తొందరగా అదుపులోకి రావడం కష్టమే. ఇక లాక్‌డౌన్‌ వల్ల దేశంలో ప్రైవేట్‌ రవాణాకు సుమారు రూ.లక్ష కోట్ల వరకు, రిటైల్‌ రంగానికి సుమారు రూ.15 లక్షల కోట్ల వరకు, చిల్ల ర వర్తకరంగానికి  రూ.23 లక్షల కోట్ల వరకు నష్టాలు ఎదుర్కోనున్నాయనే అంచనాలు వస్తున్నాయి. దిగ్బంధం వల్ల భారత పారిశ్రామికరంగం రూ.23 లక్షల కోట్లు నష్టపోనున్న ది. అంతేగాక లాక్‌డౌన్‌ తర్వాత ప్రజల కొనుగోలుశక్తి భారీగా పడిపోయే అవకాశం ఉన్నది. ఆ ప్రభావం ఉత్పాదక, బ్యాంకింగ్‌ రంగాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యం గా, 21 రోజుల లాక్‌డౌన్‌కే దేశంలో 40 కోట్ల మంది పేదరికంలోకి కూరుకుపోనున్నారని ‘ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజషన్‌' పేర్కొన్న ది. ఇక మే 3వ తేదీ వరకు ఇది రూ.50 కోట్ల కు చేరుకోనున్నది. అందుకే, తిరిగి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కనీసం ఏడాది పడుతుందంటున్నారు. 

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు వృద్ధిరేటును 7 శాతం వరకు అంచ నా వేసింది. లాక్‌డౌన్‌ అమలు తర్వాత 1.8 శాతం ఉంటుందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈ ఏడాది వృద్ధిరేటు మైనస్‌లోకి చేరే పరిస్థితే కనిపిస్తున్నది. అయితే, ఈ సమస్య కేవలం ఒక్క మన దేశానిదే కాదు. ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభంలో మనం ఎలా నిలదొక్కుకుంటామన్నదే అతిపెద్ద సవాల్‌.

(వ్యాసకర్త: యూజీసీ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో, కామర్స్‌ విభాగం, ఓయూ)


logo