బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Apr 20, 2020 , 23:07:17

మన భద్రత కోసం..

మన భద్రత కోసం..

ప్రజాభీష్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను వచ్చే నెల ఏడు వరకు పొడిగించింది. ఇప్పటిలాగానే లౌక్‌డౌన్‌ సమయంలో ప్రజా కదలికలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతూనే, రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా కొనసాగించేందుకు నిర్ణయించింది. కొవిడ్‌ మహమ్మారిని నిలువరించేందుకు లాక్‌డౌన్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చెబుతూ, ఆపత్కాలంలో ప్రజలు మరింత నిబద్ధతతో వ్యవహరించాలని పిలుపునిచ్చింది. ఈ నిర్ణయానికి ముం దు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో లోతైన అధ్యయనం చేసింది. ప్రభుత్వం స్వయంగా వివిధ పాలనాయంత్రాంగాల ద్వారా చేసిన సర్వేలో 95 శాతం మంది లాక్‌డౌన్‌ను కొనసాగించాలన్నారు. ప్రైవేట్‌ మీడియా, టీవీ సంస్థల సర్వేలో కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రాణం కన్నా మరేదీ ముఖ్యం కాదన్న సీఎం కేసీఆర్‌ పిలుపునకు ఇది ప్రజామోదంగా భావించాలి. క్లిష్టపరిస్థితులేవైనా తమ నాయకుని మాటను జవదాటకుండా అమలుచేస్తామన్న దానికి ప్రతీక ఇది. కొన్ని సడలింపులతో మాత్రమే లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం అంటున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత పకడ్బందీగా అమలుచేసేందుకు నిశ్చయించటం గమనార్హం.

దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి, మరణాల సంఖ్య చాలా తక్కువ. అయినా సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ విషయంలో తీసుకుంటున్న చర్యలు ‘అతి’ అనుకునే అవకాశమున్నది. దేశీయంగా చూస్తే కరోనా మరణాల రేటు 3.22 ఉంటే, తెలంగాణలో 2.44 మాత్రమే. దేశంలో ప్రతి పది లక్షల మందిలో 254 మందికి పరీక్షలు నిర్వహిస్తుండగా, తెలంగాణలో 375 మందికి పరీక్షలు చేస్తున్నారు. వైరస్‌ విషయంలో చిన్నపాటి ఏమరుపాటు తగదనే దృఢ నిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకుపోతున్నది. అమెరికా మొదలు యూరప్‌ దేశాలు మొదట్లో చేసిన నిర్లక్ష్యానికి ఎంత భారీ మూల్యం చెల్లిస్తున్నాయో కండ్లముందు కనిపిస్తూనే ఉన్నది. కొవిడ్‌ కారుమబ్బులా కమ్మేసిన తర్వాత ఏ చర్యలు తీసుకున్నా లాభం ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించటం ఆహ్వానించదగిన పరిణామం.

ఎంతటి కష్టపరిస్థితుల్లోనైనా.. తల్లి కన్నబిడ్డ కడుపు చూస్తుందంటారు. కరో నా విపత్కాలంలోనూ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్‌ తల్లిప్రేమతో కడుపున దాచుకుంటున్నారు. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వలస కార్మికులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడటం మొదలు అన్నివర్గాల ప్రజలను అనేకరూపాల్లో ఆదుకుంటున్నారు. కరోనా కట్టడిలో అహర్నిశలు పనిచేస్తున్న పోలీసులు, వ్యాధిగ్రస్తులకు ప్రాణా లు కాపాడటానికి వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి, త్యాగాలకు పది శాతం వేతనం అదనంగా ఇచ్చి గౌరవించటం ముదావహం. విద్యుత్‌ సిబ్బంది కృషిని కొనియాడుతూ వారి జీతభత్యాలను పూర్తిగా చెల్లించేలా నిర్దేశించారు. కిరాయి ఇండ్లల్లో ఉండేవారికి అద్దె భారం లేకుండా ప్రత్యేక నిర్ణయం తీసుకోవటంతో లక్షలాది కుటుంబాల వెతలు తీరాయి. ఆపత్కాలంలో వివిధ వర్గాల సేవలను త్యాగాలను ఎత్తిపడుతూ, గౌరవిస్తూనే, సకల ప్రజల సంక్షే మం, రక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చరిత్రాత్మకం.


logo