శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Apr 19, 2020 , 23:29:09

తెలంగాణ రూపకములు త్రివిక్రములు

తెలంగాణ రూపకములు త్రివిక్రములు

డాక్టర్‌ వడ్డేపల్లి కృష్ణ ఇటీవల వెలువరించిన సంగీత నృత్యరూపక సమాహారం ‘తెలంగాణ రూపకములు-  త్రివిక్రములు’ విశిష్టమైనది. తెలుగులో సంగీత నృత్యరూపకం, విలక్షణమైన ప్రక్రియ. సంగీతంతో పాటు, నృత్యం ద్వారా పాత్రల అభినయం ఆవిష్కృతమవుతుంది. ఈ ప్రక్రియకు మూలం తెలంగాణ గ్రామీణ సంస్కృతికి ప్రతీక అయిన యక్షగానాలని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

‘తెలంగాణ రూపకాలు  త్రివిక్రములు’ తెలంగాణ నేపథ్యం కలది. అంటే తెలంగాణ సాహిత్య, సాం స్కృతిక, చారిత్రక, రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మికల భూమిక మీద నిర్మించిన రూపకాలన్నమాట. తెలంగాణ వేదిక అయినప్పటికీ, వస్తు రూపాలను బట్టి ఈ గ్రంథం యావత్తు తెలుగు జాతిదే. ఇందులో మొదటి భాగంలో 16 నృత్య రూపకాలు, రెండో భాగంలో ముగ్గురు సామాజిక సంస్కర్తల గురించి రాసిన రూపకాలున్నాయి. మొత్తం మీద ఈ 19 రూపకాలు భాషాపరంగా, భావపరంగా, వస్తు, రూప, శిల్పపరంగా ఎంతో ప్రామాణికమైనవి.

వస్తువుపరంగా చూస్తే.. గోలుకొండ, కాకతీయ వైభవం, రమణీయ రామప్ప చారిత్రక నేపథ్యంగా; యాదాద్రి వైభవం, స్తంభాద్రి సంబరాలు స్థలపురాణాలకు సంబంధించినవిగా; ‘తెలంగాణ పుణ్యక్షేత్రా లు’ ఆధ్యాత్మిక భూమికపై; ‘బంగారు తెలంగాణ’  రాజకీయ ఉద్యమ నేపథ్యంగా రచించినవి. ‘తరతరా ల తెలంగాణ’, ‘తెలంగాణ తేజోమూర్తులు’, ‘తెలంగాణ వైభవం’  సాంస్కృతిక రంగం వేదికగా రూపొందించినవి. వీటితో పాటు, వినియోగదారుల విజయపథం, విత్తనాల విలువ ప్రకృతి పరిరక్షణ రూపకాలు సామాజిక చైతన్యం కోసం రాసినవి. 

‘తెలంగాణ వైభవం’  ఆధునిక తెలంగాణ రాష్ట్రానికి సాహితీ ముఖద్వారం వంటిది. ‘కమనీయం! కడు రమణీయం తెలంగాణ ప్రాంతాలన్నీ పర్యాటకులకు దర్శనీయం చారిత్రక ప్రదేశాలన్నీ’ అని మొదల య్యే ఈ రూపకం, తెలంగాణలోని పర్యాటక క్షేత్రాల ను, ఆదిలాబాద్‌ నుంచి అలంపురం వరకు గల శైవ, వైష్ణవ, శక్తి పీఠాలతో సహా చిత్రించారు. 

గోలుకొండ, సంగీత నృత్య రూపకంలో గోల్కొండే స్వయంగా తన గాథను చెప్పుకున్నట్లు రాశారు. గోలు అంటే వర్తులాకారం. గోల్కొండ కోట గుండ్రంగా ఉంటుందని గోల్కొండ శబ్ద వ్యుత్పత్తిని వివరించారు. ఇందులో మల్కిభరాం, కులీకుతుబ్‌షా, తానీషా, భాగమతి, రామదాసు పాత్రలు ప్రత్యక్షమై మనల్ని అలరిస్తాయి. 

తెలంగాణ శిల్పానికి ప్రతీకగా నిలిచిన రామప్పగుడి గురించి రచించిన ‘రమణీయ రామప్ప’ వడ్డేపల్లి అక్షరశిల్పానికి నిదర్శనం. కాకతీయుల కాలంలో క్రీ.శ.12వ శతాబ్దిలో జాయపసేనాని రచించిన ‘నృత్త రత్నావళి’కే బోధగా, చరితార్థ గాథగా నిల్చిన రామప్ప గురించి రచయిత మలచిన తీరు ప్రశంసనీ యం. ‘తెలంగాణ పుణ్యక్షేత్రాలు’ శీర్షికన రచించిన రూపకంలో బాసర మొదలు భద్రాద్రి వరకు విలసిల్లి న సకల క్షేత్రాలను దర్శింపజేశారు. ‘తరతరాల తెలంగాణ’ శీర్షికన రూపొందించిన సంగీత నృత్యరూపకం లో శాతవాహన వైభవాన్ని ప్రత్యేకంగా చెప్పారు. ‘తర తరాల తెలంగాణ’ కథా వస్తువుకు కొనసాగింపుగా రాసిన నృత్యరూపకమే ‘బంగారు తెలంగాణ’. కాకతీయుల స్ఫూర్తితో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తీరు, భవిష్యత్తరాలకు ఓ పాఠ్యాంశం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం మొదలు ‘మిలియన్‌ మార్చ్‌', ‘సాగరహారం’ ఎలా విజయవంతమయ్యాయో చెప్పారు. కేసీఆర్‌ను పగ టి సూర్యునిలా పోల్చటం విశేషం.

‘తెలంగాణ తేజోమూర్తులు’ శీర్షికన వేములవాడ భీమకవి, భక్తకవి పోతన, పాల్కుర్కి సోమన, కంచె ర్ల గోపన్నలతో పాటు ఆధునిక కాలంలో, సురవరం, పీవీ నరసింహారావు, కాళోజీ, జయశంకర్‌ ప్రభృతు ల వరకు సాగిన ఆయా మహనీయుల జీవన చిత్రాల దర్శిని. 

‘యాదాద్రి వైభవం’లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక, కేసీఆర్‌ ఈ క్షేత్రాన్ని మరో తిరుమల వలె ఎలా తీర్చిదిద్దారో, తెలియజేస్తూ స్థల పురాణగాథను కూడా వివరించారు. 

ఈ గ్రంథం రెండవ భాగంలోని సంగీత నృత్యరూపకాలు ‘త్రివిక్రములు’ ఎంతో ప్రాధాన్యమైనవి. ఇందులో ముగ్గురు సామాజిక సంస్కర్తలు  మహాత్మజ్యోతిభా పూలే, అంబేద్కర్‌, భాగ్యరెడ్డివర్మల గురిం చి విలక్షణంగా చిత్రించారు.

ఇవన్నీ ఒకెత్తు. కమనీయ కావ్యసౌందర్య మూల్యాలతో పద పరిమళ మాలికగా అల్లిన ‘పుష్పవిలాసం’ ఒకెత్తు. నాడు ‘కరుణశ్రీ’ పుష్పవిలాపాన్ని పద్యాలలో కరుణ రసాత్మకంగా అందించినట్లే, వడ్డేపల్లి గారు ‘పుష్పవిలాసాన్ని’ లలిత రసాల మకరంద మాధురీభరితంగా విరచించారు.ఈ పందొమ్మిది రూపకాలు.. వస్తువులో, రూపంలో, శిల్పంలో, సౌందర్యంలో అన్నీ సాహితీ విలువలతో ప్రామాణికంగా రచింపబడినవనటంలో సందేహం లేదు. 

- డాక్టర్‌ వి.వి.రామారావు , 98492 37663


logo