బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Apr 19, 2020 , 23:25:17

తెలుగు సినిమా తెలంగాణ యాస

తెలుగు సినిమా తెలంగాణ యాస

ప్రపంచీకరణ యుగంలో భాషలన్నింటినీ ఇంగ్లిష్‌ కబళిస్తున్నది. ఈ సంక్లిష్ట కాలంలో తెలుగు వంటి ప్రాంతీయ భాషలు బతికిబట్టకడుతున్నది కేవలం గ్రామీణ ప్రజలు, సినిమాలు, పత్రికల వల్ల మాత్రమేననేది వాస్తవం. 1931లో అర్దేష్‌ ఇరానీ నిర్మాత గా ‘భక్త ప్రహ్లాద’ తొలి తెలుగు సినిమా విడుదలైంది. 1931 నుంచి నేటివరకు ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమా భాష క్రమంగా సరళ గ్రాంథికం, శిష్టవ్యావహారికం, వివిధ ప్రాంతాల తెలుగు వైవిధ్యాన్ని కలుపుకుం టూ నేడు తెలంగాణ తెలుగును, యాసను నాయికా నాయక పాత్రలకు ప్రయోగించే స్థితిని అందుకున్నది.

తెలంగాణ సీమాంధ్ర వలసపాలనలో ప్రాంతీయ వివక్ష, అణిచివేతలు, ఆర్థిక దోపిడీతో పాటు సాంస్కృతిక, భాషావివక్షలకు గురైంది. ఈ క్రమం లో తెలంగాణ భాషా సంస్కృతులు తీవ్ర వివక్ష, వక్రీకరణలకు బలైంది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణానంతర తెలుగు సినిమాల్లో ముఖ్యం గా 1980ల్లో వివిధ ప్రాంతాల తెలుగును/మాండలికాన్ని అధమస్థాయి పాత్రలకు వాడటం మొదలైంది. సినిమాల్లో ప్రధానంగా నాయికా, నాయకులకు కోస్తాంధ్రలోని శిష్టవ్యావహారిక భాషను వాడుతూ, తక్కువస్థాయి పాత్రలకు, ప్రతినాయక, హాస్య, పని మని షి పాత్రలకు మిగతా తెలుగు ప్రాంతాల తెలుగును ప్రయోగించారు. ఈ ప్రయోగాల్లో వివిధ ప్రాంతాల తెలుగును చులకనగా చూపేలా ప్రయత్నించారనేది వాస్తవం. దీన్ని వ్యతిరేకి స్తూ తెలంగాణ ఉద్యమం జరిగి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకోవడం కళ్లముందరి చరిత్ర. తెలంగాణీయులు మరొక అడుగు ముందుకేసి తెలుగు భాష వేరు, ఆంధ్ర భాషవేరనే స్థితి వచ్చింది. 

అస్తిత్వ ఉద్యమాల ప్రభావం తెలుగు సినిమాపై పడింది. తెలుగు సినిమా వస్తువులోనూ, సంభాషణల్లోనూ, పాటల్లో నూ ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ సామాజిక జీవితం, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టోద్యమం తెలుగు సినిమాపై గణనీయమైన ప్రభావాన్ని వేశాయి. ఇక్కడి కమ్యూనిస్టు ఉద్యమాలు సినిమాకు కొత్త వస్తువును అందించాయి. ఆ వస్తువుతో పాటే ఆ జీవితాలను ఆశ్రయించి ఉన్న భాష, సంస్కృతులు సినిమాలోకి ప్రవేశించాయి. తెలంగాణ అంశం రాజకీయరూపాన్ని తీసుకున్న 1996 తర్వాత మరింత వేగవంతమైంది. కానీ, అంతకుముందే 1975లో మాధవరావు దర్శకత్వం వహించిన ‘చిళ్ళర దేవుళ్ళు’, 1980లో వచ్చిన ‘మా భూమి’ సినిమాలు తెలంగాణ వాతావరణాన్ని, తెలంగా ణ తెలుగు, భాషాసంస్కృతులను పూర్తిస్థాయి నిడివిలో చిత్రించిన సినిమాలు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ‘మా భూమి’ సినిమా అందించిన భాషా స్ఫూర్తిని ఆ తర్వాత కాలంలోని తెలుగు సినిమా అందిపుచ్చుకోలేకపోయింది. కారణాలు సుస్పష్టమే. తెలుగు సినిమారంగంలో ఉన్నవాళ్లంతా కోస్తాంధ్రులు కావడం ఒక కారణమైతే, ఇక్క డి భాష, సంస్కృతులపై చిన్నచూపు ఉండటం కూడా మరో కారణం. ఉద్యమ నేపథ్యంతో వచ్చిన ‘ఒసేయ్‌ రాములమ్మ’, ‘కుబుసం’, ‘బతుకమ్మ’, ‘వీర తెలంగాణ’, ‘కొమురం భీం’, ‘పోరు తెలంగాణ’ లాంటి సినిమాల్లో తెలంగాణ తెలుగు నాయక పాత్రలకు ఉపయోగించబడటం గొప్ప పరిణామం. 

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో విడుదలైన సినిమా ‘జై బోలో తెలంగాణ’ (2011). ఈ సినిమా ఉద్యమ ఆకాంక్షను కళాత్మకంగా చిత్రించింది. ‘రాజన్న’, ‘కందిరీగ’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫు ల్‌' ‘జై తెలంగాణ’ ‘బాద్‌షా’ వంటి సినిమాల్లో తెలంగాణ తెలుగుకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ భాషపై అమలైన వివక్ష ను తెలంగాణ ఉద్యమం ప్రశ్నిచింది. టీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షతో  ఊపందుకున్న తెలంగాణ ఉద్యమం నుంచి, రాష్ట్రం ఆవిర్భవించేంత వరకు ఉన్న ఉద్య మ స్థితిని తెలుగు సినిమారంగం ప్రతిఫలించే ప్రయత్నం చేసింది. అలాంటి ఒక అనివార్యమైన పరిణామంలోకి తెలు గు సినిమా రంగం ప్రవేశించింది. ఈ అనివార్యత తెలంగాణ భాషను ప్రతినాయక పాత్రలకు వాడటం దగ్గరి నుంచి నాయిక/నాయక పాత్రలకు కూడా వాడే ప్రాముఖ్యాన్ని సాధించుకున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావనంతరం తెలంగాణ తెలుగును సినిమాల్లో వాడటం అమాంతం పెరిగింది. ఇతర తెలు గు ప్రాంతాల్లో ఆదరణ కూడా వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే సమ్మతి కూడా లభించింది. ‘బొమ్మల రామారం’ మొదలుకొని ఇటీవలి ‘మల్లేశం’, ‘దొరసాని’, ‘ఇస్మార్ట్‌ శంక ర్‌' వరకు విడుదలైన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తెలంగాణ తెలుగు ఒకరకంగా ‘కమర్షియల్‌' స్థాయి ని అందుకున్నది. ఈ స్థాయివల్ల తెలంగాణ తెలుగుకు మేలు జరుగుతుందా లేదా అనే ప్రశ్నకు ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేకపోయినా, అవమానించబడిన చోటే ఆత్మగౌరవ పతాకను ఎగురవేసిందనేది కాదనలేని వాస్తవం.

తెలంగాణ రాష్ర్టావిర్భావం స్ఫూర్తితో కోస్తాంధ్ర, రాయలసీమల తెలుగుకు కూడా సినిమాల్లో ప్రాధాన్యం పెరిగింది. 2015లో విడుదలైన ‘కేరింత’ సినిమాలో ఉత్తరాంధ్ర తెలుగులో నూకరాజు వ్యక్తీకరణల తీరు అందరినీ ఆకట్టుకున్నది. ఉత్తరాంధ్రలో ఉండే అమాయకత్వానికి భాషారూపాన్నివ్వడం ఈ సినిమా ప్రత్యేకత. తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘అరవింద సమేత’లో రాయలసీమ తెలుగు, నవీన్‌ పోలిశెట్టి హీరోగా నటించిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’లో హీరోకు నెల్లూరు తెలుగు ప్రయోగించబడింది. ముఖ్యంగా ఆయా ప్రాంతాలకు చెందిన జానపద కళాకారులను, జానపద బాణీలను పాటలకు వాడుకోవడం మరో మంచి పరిణామం. ఇది తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధితో పాటు ప్రాంతాల మధ్య ఐక్యతను పెంచుతుంది. తెలుగువారి మధ్య పరస్పర సమారాధనను ఏర్పరుస్తుంది. మరుగున పడిన భాషా వ్యక్తీకరణలకు జీవంపోసి ప్రధాన స్రవంతి లో భాగం చేయడానికి దోహదపడుతుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది.తెలంగాణ తెలుగులోని సహజత్వాన్ని ఇటీవల విడుదలై విజయాన్ని అందుకున్న ‘మల్లేశం’, ‘దొరసాని’ సినిమాలు ప్రతిబింబించాయి. ఇలా నేడు విడుదలవుతున్న సినిమాల్లో తెలంగాణ భాష ప్రస్తావన లేకుండా తెలుగు సినిమాలు రావడం లేదు. ఇది తెలుగు భాషాభివృద్ధికి అనుకూలించే పరిణా మం. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర భావన మారుమూల ప్రాంతాల తెలుగు వైవిధ్యపు సజీవత్వాన్ని మళ్లీ ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే బాధ్యతను తీసుకొని విజయవంతంగా ముందుకువెళ్తున్నది. తెలుగు ప్రేక్షకులు ఈ పరిణామాన్ని బతికించుకోవాలి. 

- డాక్టర్‌ చంద్రయ్య శివన్న, 99637 09032


logo