ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Apr 19, 2020 , 23:19:57

ప్రణతి

ప్రణతి

కనిపించని ప్రాణాంతక జీవిపైన

సమరం సాగించినవాడే

నిలువరించి నిలిపినవాడె-నేడు 

వీరుడు ధీరుడు యోధుడు.

కునుకులేక కూడులేక

ప్రాణాలను పణమొడ్డి

శ్రమిస్తున్న భిషగ్వరులు-వారికి 

బాసటగా నిలిచిన

సహవర్తుల శిరసులపై

సంపెంగలు, సిరిమల్లెలు.


జనరక్షణ పర్వంలో

ప్రజావళిని ప్రబోధించి

మేమున్నామని 

మందు నిలిచి

శ్రమిస్తున్న రక్షక భటశ్రేణి

గుండెలపై గులాబీలు.


ప్రాణం కన్నా మిన్నగ

పైసాలో ఏముందని

వితరణగుణ చిత్తంతో

ముడి విప్పిన విత్తంతో 

ముందుకు దూకిన దాతల 

చరణావళి చేమంతులు.


ప్రభుత్వాలు ఏవైనా/ ప్రజా సేవ గొప్పదని 

ఆహరహం అలుపెరుగక/ కనురెప్పగ కాపాడి

ఊపిరి నిలిపిన ఉద్యోగుల / 

చేతులలో మందారాలు


భరతమాత బిడ్డలకు

ప్రాణహాని కలుగనీక 

కరుణారస నిర్భరులై

కృషిచేసిన బుషితుల్యులు

నాయకులు, గాయకులు,

సేవకులు పయనించేదారిలోన

పారిజాత సుమదళాలు.

డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డి , 94403 44972


logo