శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Apr 19, 2020 , 23:17:06

తాక(రా)ని సందేశం

తాక(రా)ని సందేశం

ఇప్పుడెవరికీ..

‘బి పాజిటివ్‌' అని సందేశించలేను

‘నెగిటివ్‌'లోనే అసలంతా నిబిడీకృతమై ఉండటం తెలీదా!

డార్క్‌రూమ్‌లో నెగిటివ్‌ను కడిగినపుడే

అందమైన ఫొటోలు వచ్చే కాలమే బాగుండేది మరి!

నీడలే నయం-

చెట్టుది చల్లదనం ఇస్తే, తనది తనకు తోడన్నట్లుంటుంది.

ఇప్పుడు- ‘నేలతో నీడ అన్నది..

నను తాకరాదని’!

అందుకనే వీధిలోకి వెళ్లకూడదు ఎవరమూ!

ఇంటిపట్టున కుటుంబపు చల్లని నీడలోనే ఉనికి

పరుగుల జీవితానికి ఈ నిర్బంధపు కళ్లెం

మానవీయతకు పట్టే హారతి పళ్లెం

కాలు గడపదాటకుండా-

పాలు, కూరలు, నిత్యావసర సరుకులు

రాజసంగా అందుకున్న కాలం అయితేనేం

ఏమొచ్చింది కష్టం? నీకేం రోగం?

ఇంటిపట్టున ఉండక రోడ్లమ్మట బలాదూర్‌ తిరిగేందుకు.

సఫాయివాలా, ఆస్పత్రి నర్సూ, డాక్టరూ, రక్షకభటుడూ

తమ ప్రాణాలను పణంపెట్టి

ఈ కష్టకాలంలో నిస్వార్థ సేవ చేస్తున్నారు.

వారి శ్రమను గుర్తించైనా

నువ్వు ఇంటనే సురక్షితంగా విశ్రమించు.

ఇది నిన్నటిదాకా నువ్వెగబడిన చైనా బజారు సరుకు కాదు

అక్కడి నుండే ఉత్పత్తిచెందిన ఉత్సాతం

దానికి అంటరానివారెవరూ లేరు 

అందుకే దిగబడుతోంది అంతటా!

అంతర్జాతీ విస్తరణతో అది ‘ప్రపంచీకరోనా’యే!

కరోనాను కట్టడిచేయడం ఎలాగో తెలీక తలలు పట్టుకుని

కాళ్లు చేతులు ఆడటం లేని స్థితిలో-

కాలు కుదపకపోవడమే కాగల కార్యం!

చేతులు శుభ్రం చేసుకుంటుండటమే చేయగల్గిన చేత!

భౌతికదూరం పాటించడమే నేటి సార్వభౌమత్వం.

పురుగును చూసినట్లు తేలికగా చూస్తే-

అగ్రరాజ్యాన్నయినా క్రిమియే కబళిస్తుంది.

చెయ్యిచాచి కలపడం కాదు, 

చేతులు ముడిచి నమస్కరించడమే మనస్కరిస్తుంది దానికి.

ఇప్పుడు క్రిమిసంహారమే అందరి 

ముందున్న యుద్ధ క్రతువు

ఏకాంతమే ఎదురులేని ఆయుధం

స్వీయనియంత్రణమే సురక్షా పథకం.

ఇల్లే ఈ ‘యిల్‌'(రోగా)న్ని 

అంతమొందించగల రణవ్యూహం.

నువ్వు చప్పట్లు కొట్టినా, దీపం పెట్టినా

అది శత్రువుపై రణదుందుభి 

మ్రోగించే విజయ శంఖారావమే!

ఇప్పుడు ‘నెగిటివ్‌'యే అసలు 

బ్రతుకుకు పాజిటివ్‌ భావన సుమా!

జాగ్రత్త పడటం కర్తవ్యం

సమష్టి దీక్షయే కర్తవ్యం

కరోనాను కట్టడిచేసి కడ తేర్చి

భావిజీవనానందం పొందడమే ప్రపంచ మానవాళికి

ఇక అవశ్యమనుభోక్తవ్యం! ఈ సందేశమే సవ్యం! దివ్యం!!

- సుధామ, 98492 97958


logo