గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Apr 19, 2020 , 10:31:52

కేసీఆర్ ఆయుధం ఇదే...

కేసీఆర్ ఆయుధం ఇదే...

‘కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం’భర్తృహరి శ్లోకమిది. కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వ రేడియోలో సంస్కృత పాఠానికి ముందు సిగ్నేచర్‌ ట్యూన్‌. ఆ శ్లోకానికి మన ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో చేసిన పద్యానువాదం ఇది..

‘భూషలు కావు మర్త్యునికి భూరి మయాంగద తార హారముల్‌ భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్‌ భూషలు కావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్‌ నశియించునన్నియున్‌'

మనిషికి భుజకీర్తులు, చంద్రహారాలు, పరిమళ ద్రవ్యాలతో స్నానాలు, పెర్ఫ్యూములు, పూలహారాలు, జుట్టు, నానా అలంకారాలు అసలు అలంకారాలే కాదు. మంచి వాక్కు ఒక్కటే గొప్ప అలంకారం. కృత్రిమంగా పెట్టుకునే అలంకారాలన్నీ ఒక పూటకో, ఒక రోజుకో, కొంతకాలానికో క్షీణిస్థాయి. మంచి వాక్కు ఒక్కటే మనిషికి ఎప్పటికీ క్షీణించని గొప్ప అలంకారం.

దాదాపు పదిహేను వందల సంవత్సరాల కిందటివాడు భర్తృహరి. అప్పట్లో స్త్రీ పురుషులు తల జుట్టు, పూలహారాలు, మెడలో ముత్యాల హారా లు వేసుకునేవారు. సంస్కృతంలో పురుషకార్యం అంటే మనుషులు చేయాల్సిన అని అర్థం. పురుషార్థాలు అన్నా మనుషులకు సంబంధించిన అనే అర్థం తప్ప మగవారికి మాత్రమే అని కానే కాదు. అలాగే ఈ శ్లోకంలో మనిషికి మాట ఒక్కటే అలంకారం అని గ్రహించాలి తప్ప పురుషులకు మాత్రమే ఇది అన్వయమని పప్పులో కాలేయకూడదు. చూడబోతే ఇప్పటికంటే అప్పుడే రోజువారీ మేకప్‌ ఎక్కువగా ఉన్నట్లుంది. మంచిమాటకు మించిన మేకప్‌ ఏముంటుంది? మంచిమాట ఒక పరిమళం. ఒక ఆకర్షణ. ఒక ఊరడింపు. ఒక ప్రోత్సాహం. ఒక ఉద్యమ నినాదం. ఒక తూటా. ఒక ఆత్మీయనేస్తం. ఒక జోల పాట. ఒక లక్ష్మణరేఖ. మెదడుకు మేత. ఒక మాట.. కర్తవ్య గీత. ప్రపంచంలో విన్‌స్టన్‌ చర్చి ల్‌ లాంటి గొప్పగొప్ప వక్తల గురించి కథలు కథలు గా చర్చ జరుగుతూనే ఉంది. మన దేశంలో గాంధీ, నెహ్రూ మొదలు ఇప్పటి శశిథరూర్‌ దాకా వారివా రి ఉపన్యాసశైలికి అభిమానులున్నారు. పీవీ, అటల్‌ బిహారీ వాజపేయిల సాహితీ సమ్మిళిత ఉపన్యాసాలను ఆసేతు హిమాచలం రాజకీయ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఆనందించింది.

తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉపన్యాసాలను విన్న వారె వరైనా ఆయన అభిమానులు కావాల్సిందే. అప్పటికి సినిమాల్లో, ఇతర వేదికల మీద ఎగతాళికి మాత్రమే పరిమితమైన తెలంగాణ మాండలికాన్ని ఆయన అలాగే ప్రయోగించి ముల్లును ముల్లుతోనే తీసేశారు. ఒక భాష, యాసలో ఉన్న అస్తిత్వ అంతర్మథనం ఎలా రాజుకుంటుందో ఆయన అప్పుడే పసిగట్టారు. వినగ వినగ ఇప్పుడు కేసీఆర్‌ అలా మాట్లాడితేనే వినాలనిపిస్తుంది. మీడి యా మాయలో చాలామంది కృతకమైన ప్రామాణికభాషలోకి వెళ్లిపోతారు. కాళోజీ ఎప్పుడో చెప్పా డు-ఒకటిన్నర జిల్లా భాష జనం భాష కాదని. ప్రామాణికభాష దానికదిగా అందరికీ అర్థమయ్యే ఒక భాష కావచ్చు కానీ, అందులో జీవం ఉండ దు. రంగు, రుచి, వాసన ఉండవు. అందం ఉండ దు. చెవికి ఇంపుగా ఉండదు. వింటే ప్రాణం లేచివచ్చినట్లు ఉండదు. కర్త, కర్మ, క్రియలతో రాసే సంపూర్ణ వాక్యాలు పుస్తకాలకు పనికివస్తాయి. మాట్లాడే భాష వ్యాకరణం వేరు. నిజానికి మాట్లాడే భాషకు వ్యాకరణం చాలదు. అందునా మాండలికాలను సూత్రీకరించడానికి ఉన్న వ్యాకరణానికి శక్తి చాలదు. సాహితీ విద్యార్థిగా కేసీఆర్‌కు ఈ ఒడుపు తెలుసు. వివిధ దశల్లో ఉద్యమాన్ని ఎలా నిర్మించాలో? ఎలా నిర్వహించాలో? అని ఆయన ఎంతగా ఆలోచించారో అంతకంటే ఎక్కువగా తను అనుకున్నది ఎలా చెప్పాలి? ఎంత చెప్పాలి? అని భాష, పరిభాష, మాండలికం, సామెతలు, నుడికారాలు, కొటేషన్లకు సంబంధిం చి ఆలోచించారు. అందుకే అంతటి బక్కపలుచని మనిషి మాటే ఉద్యమమయ్యింది. ఆయన మాటే ఒక రాషా ్ర్టన్ని సాధించింది. ఆయన మాటే ఒక రాష్ర్టాన్ని నిలబెట్టింది. ఆయన మాటే టీఆర్‌ఎస్‌ పార్టీని రెండుసార్లు ఎన్నిక ల్లో గెలిపించింది.

రాజకీయంగా కేసీఆర్‌తో విభేదించేవారు కూడా ఆయన మాటను, ఆ మాటలో దట్టించిన భావాన్ని, యాసను, ఆ మాటల పొందికను మాత్రం అభినందించకుండా ఉండలేరు. ఆయన అలవోకగా మాట్లాడినట్లు అనిపిస్తుంది కానీ, నిజానికి ఆయన అలవోకగా మాట్లాడరు. ఎత్తుగడ, ముగింపు, మాటల మధ్యలో చెప్పకుండానే చెప్పాల్సిన బిట్వీన్‌ ది లైన్స్‌ భావం అన్నీ ఒక పక్కా ప్రణాళికతో ఉంటాయి. చెబుతున్న బాడీ లాంగ్వేజ్‌ను బట్టి మనం అలా అనుకుంటాం కానీ, ఆయ న పేపర్‌ మీద రాసుకోకుండా మనసులో, మెదడులో రచించుకునే స్క్రిప్ట్‌ ప్రకారమే మాట్లాడుతారు. మాటతో నవ్విస్తా రు. మాటతో బెదిరిస్తారు. మాటతో ఓదారుస్తారు. మాటతో పరుగులు పెట్టిస్తా రు. మాటతో కూర్చోబెడతారు. పం డితుల మధ్య పోతన భాగవత పద్యం అందుకుంటారు. చాగంటి పక్కన ఆధ్యాత్మి క పరిభాష వాడతారు. చినజీయర్‌ పక్కన శిష్ట సంప్రదాయ భాష వాడతారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు పాఠం చెప్తారు. బాగా మాట్లాడాలంటే బాగా చదవాలి. బాగా వినాలి. చదివింది, విన్నది బాగా మననం చేయాలి. అప్పుడే సందర్భోచితంగా, చమత్కారంగా మాటలను దట్టించి ప్రయోగించగలరు. ఊళ్లో రచ్చబండ మీద సామాన్యులు మాట్లాడుకునే భాషలో తాను చెప్పదలుచుకున్న విషయాలను అనువదించి చెప్పడంలో కేసీ ఆర్‌ దిట్ట. ఉపన్యాసం ఎదుటిమనిషితో మాట్లాడుతున్నట్లుగా ఉంటేనే కోట్ల హృదయాలను గెలవగలరు. అలా తన భాషతో కోట్ల హృదయాలను గెలిచి చూపించారు కేసీఆర్‌.

ఎక్కడ ఎలా మాట్లాడాలో? ఏమి మాట్లాడా లో? ఎంత మాట్లాడాలో తెలియడం ఒక కళ. గొప్ప విద్య. హనుమంతుడు వాక్‌ నిపుణుడని రామాయణం చెబుతుంది. మాండలికాన్ని అధికారికంగా వాడింది హనుమ. విన్నది సీతమ్మ. దాన్ని రికార్డు చేసినవాడు వాల్మీకి. అంతకుముందు తమ తో తొలి పరిచయంలోనే హనుమ ఎంత అందం గా, అర్థవంతంగా, స్పష్టంగా, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడని లక్ష్మణుడితో రాముడు పొంగిపోయి చెప్పాడు.

ఏ సందర్భానికి తగినట్లు ఆ పరిభాషను, ఆ ప్రజంటేషన్‌ పద్ధతిని ఎంచుకుంటారు కేసీఆర్‌. పదే పదే కాగితాలు చూస్తూ, మాటలు తడబడుతూ, మాటలు వెతుక్కుంటూ, నీళ్లు నములుతూ మాట్లా డటం ఆయన నిఘంటువులో ఉండదు. బరాబర్‌ కుల్లం కుల్ల మాట్లాడతారు. మాట్లాడటానికి ముం దు చాలా అధ్యయనం చేస్తారు. గంట, రెండు గం టలు ఏకధాటిగా మాట్లాడినా పునరుక్తి లేకుండా, బోర్‌ కొట్టకుండా, సుత్తిలేకుండా, సూటిగా చెప్తారు. టీవీ చానెళ్లకు, సామాజిక మాధ్యమాలకు ఆయన మాటలు పంచ్‌ డైలాగులు. ఎక్కువ వ్యూయర్‌ షిప్‌ సాధించిపెట్టే ఆడియో, వీడియో క్లిప్పులు. ప్రతిపక్షాలకు సింహస్వప్నాలు.

మాండలికంలో తెలంగాణ మురిసిపోయే భాష ను ఉపయోగించే కేసీఆర్‌ సందర్భం వచ్చిన ప్రతిసారీ కవితాత్మక పదబంధాలను కూడా ప్రయోగిస్తుంటారు. సంఘీభావ సంకేతం లాంటి మాటల ను ఆయన ఒడుపుగా వాడతారు. ఇక ఆయన మాటల వాడుకలో మన్నూ మశానం లాంటి వాడుక మాటలు లెక్కలేనన్ని.

ముందు విషయం మీద లోతైన అవగాహన ఉండాలి. ఒక సొంత అభిప్రాయం ఉండాలి. ఆ అవగాహనతో ఏర్పడిన అభిప్రాయాన్ని ఎదుటివారికి అంగీకారయోగ్యంగా చెప్పడానికి భాషకు పదు నుపెట్టాలి. మాటలను సెలెక్టివ్‌గా ఉపయోగించుకోవాలి. మొదటిమాట నుంచి చివరి వాక్యం వరకు దండలో దారంలా ఒక అంతఃసూత్రం ఉండాలి. ఒక మాటకు ఇంకో మాటకు గొలుసు ఉండాలి. ఇదంతా రాస్తే ఒక వచన శిల్పం కావాలి.

కేసీఆర్‌ ఉపన్యాసం వింటున్నప్పుడు మనంకూడా మాట్లాడవచ్చు అనిపించేంత సరళంగా, సహజంగా ఉంటుంది. అలా మాట్లాడటం అందరికీ సాధ్యమైతే ఇక ఆయన గొప్పేముంది? అంద రూ అలాగే మాట్లాడితే అందరూ కేసీఆర్‌లే అయ్యేవారు. కానీ, కేసీఆర్‌ ఒక్కడే ఉంటాడు. తెలుగు ప్రేమికులకు, తెలంగాణ మాండలికం ప్రేమికులకు కేసీఆర్‌ మాటలు వీనుల విందు. రాజకీయమంటే అహోబిల మఠం కాదన్నది కూడా కేసీఆర్‌ డైలాగే. రాజకీయం రాజకీయం లాగే చేస్తానని బాజాప్తా ఒక నుడికారంతో చెప్పడం ఆయనకే చెల్లు. తెలుగుకు తోడు ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్‌ కూడా అనర్గళంగా మాట్లాడగలగడం ఆయనకు అదనపు సౌక ర్యం. ఒక సంక్షోభ సమయంలో మాటే ఒక పరిష్కారమవుతుంది. కనిపించని కరోనా ప్రపంచాన్ని కట్టి ఇళ్లల్లో పడేసింది. కరోనా లాక్‌డౌన్‌లో కేసీఆర్‌ మాటలను ఆచితూచి ప్రయోగిస్తున్నారు. ఈ సమయంలో భారత ప్రభుత్వానికి, ప్రధానికి నిర్నిబంధమైన మద్దతు తెలపడంలో కూడా ఆయన భాష ప్రత్యేకంగా ఉంది. హుందాగా ఉంది. మాటకు సం దర్భాన్ని బట్టి, ఎవరు మాట్లాడుతున్నారన్న దాన్ని బట్టి అర్థాలు మారుతుతుంటాయి. ఎంతటి సంక్లిష్టమైన విషయాన్నయినా అతి తేలిక పదాలతో, తెలంగాణ మాండలికంలో చెప్పడం కేసీఆర్‌ ప్రత్యేకత. అదే ఆయన ఆయుధం. ఆ ఆయుధం ధాటికి ప్రత్యర్థులు విలవిలాడుతుంటారు. అదేదో సినిమా లో డైలాగ్‌లా ఎవరైనా కసితో కొడతారు. కోపంతో కొడతారు. కేసీఆర్‌ భాషతో కొడతారు. పాతకాలంలో చిన్నప్పుడు బడుల్లో..

తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్‌ బూనితిన్‌ నీవు నా

యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్‌ సుశబ్దమ్ము శో

భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్‌ జగన్మోహినీ

ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!-

 అని పోతన పద్యం పొద్దున్నే ప్రార్థనలో ఉండే ది. ఇందులో ఎదుటివారు మెచ్చుకునేలా మంచిమాటలు ఒక ఫౌంటైన్‌లా నా లోపలి నుంచి బయటికి తీసుకురా తల్లీ! అని రిక్వెస్టు. 

ప్రార్థన అందరూ చేస్తారు. కానీ సరస్వతి మా త్రం అందరినీ కరుణించదు కదా? వాక్కు వశం కావాలంటే వాక్కు మీద అభిమానం ఉండాలి. వాక్కును ధ్యానించాలి. వాక్కు కోసం తపించాలి. వివిధ రూపాల్లో ఉన్న మంచి సాహిత్యం చదవాలి. సాధన ఉండాలి. కేసీ ఆర్‌ వాక్కు బాగుందంటే దానివెనుక ఇన్ని ఉన్నాయని గ్రహించాలి.


logo