గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Apr 17, 2020 , 23:31:36

స్ఫూర్తి కొనసాగాలె

స్ఫూర్తి కొనసాగాలె

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ కొనసాగుతుందంటూనే మార్గదర్శకాల పేరుతో కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ప్రకటించటం విస్మయం కలిగిస్తున్నది. వైరస్‌ నియంత్రణలో సామాజిక దిగ్బంధనలు సానుకూల ఫలితాలు ఇస్తున్న సమయంలో కేంద్ర నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యం. అభివృద్ధి చెందిన యూరప్‌ దేశాలతో పోలిస్తే, దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో వైరస్‌ వ్యాప్తి, మరణాలు తక్కు వ నమోదవుతున్నాయంటే అది లాక్‌డౌన్‌ మూలంగానే. అలాంటిది, ఈ సడలింపు సురక్షిత స్థితికి తూట్లు పొడిచేదిగా ఉన్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ లాంటి దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలనుకుంటున్న సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవటం అనుచితం. కోవిడ్‌-19 నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో మరింత పకడ్బందీగా, శాస్త్రీయంగా ఎలా వ్యవహరించాలో ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. ఉన్న ఒక్క ఆయుధమైన లాక్‌డౌన్‌ను నీరుగార్చటం ఏ విధంగా చూసినా ఆహ్వానించదగినది కాదు.  

దేశ ఆర్థిక పరిస్థితి, జీడీపీ దృష్టిలో పెట్టుకొని ఈ నెల 20 నుంచి లాక్‌డౌన్‌ లో మినహాయింపులు ప్రకటిస్తున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని నిపుణులు, మేధావులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఆంక్షల పాక్షిక ఎత్తివేత అయినా పరోక్షంగా వైరస్‌ విజృంభణకు ఊతమిచ్చేదిగా మారే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు, కరోనా కథ ఇప్పట్లో ముగిసేది కాదు, ముందున్న కాలమంతా ముప్పే అని వైద్య, ఆరోగ్యశాఖ నిష్ణాతులు అంటున్నారు. కనీసంగా ఏడాదిపాటు జాగ్రత్తలు అవసరమని హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం.. దేశంలో వైరస్‌ విస్తరణ ఇంకా ఉచ్ఛ స్థితికి చేరుకోలేదు. అలాంటి స్థితిలోనే దేశంలో రోజుకు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతూ గుబులు పుట్టిస్తున్నది. ఇప్పటిదాకా ప్రజలు చేసిన త్యాగాలు వృథా కాకుండా సంరక్షించటానికి కేంద్రం చేపట్టే చర్యలు దోహదపడాలి.  

ఈ విపత్కర స్థితిలో వైరస్‌పై దీర్ఘకాలిక పోరాటానికి సమాయత్తమవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ద్విముఖ వ్యూహాంతో ముందుకుపోవాలి. కోవిడ్‌ కట్టడికి ఏకైక అస్త్రంగా ఉన్న లాక్‌డౌన్‌ను నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా కొనసాగిస్తూనే, ప్రజాజీవనంలో సంక్షోభం తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. ఈ ఆపత్కాలంలో ప్రజలను ఆదుకోవటంలో యూరప్‌ దేశాలు మార్గం చూపాయి. ప్రైవేటు ఉద్యోగులకు కూడా ప్రభుత్వమే జీతభత్యాలను చెల్లించటంతో పాటు, నిరుద్యోగులకు, విద్యార్థులకు కూడా భృతిని ప్రకటించాయి. ఉత్పాదక రంగానికి ఉద్దీపనలతో ఊతమిస్తున్నాయి. దేశంలో కూడా చిన్న, మధ్యతరహా ఉత్పత్తిరంగాలకు దన్నుగా నిలువాల్సిన అవసరమున్నది. ముఖ్యంగా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన దినకూలీలు, ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలి.  ఈ పరిస్థితుల్లోనే ప్రధాని మోదీ కేంద్ర ఆర్థికమంత్రితో సమీక్ష సమావేశం జరుపటం గమనార్హం. గత నెల 1.7 లక్షల కోట్ల ఉద్దీపనలు ప్రకటించిన కేంద్రం రెండో దఫా ఉద్దీపనలతో ఉత్పత్తిరంగం తో పాటు, ప్రజలకు కూడా ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఆశిద్దాం. 


logo