గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Apr 17, 2020 , 23:29:21

మనతో మనం దిగ్బంధం

మనతో మనం దిగ్బంధం

ప్లేగు, ఎబోలా, హెచ్‌1ఎన్‌1, హెచ్‌ఐవీ ఎయిడ్స్‌, కలరా, మశూచి వంటి వ్యాధులు ప్రబలినప్పుడు, ప్రాణనష్టం జరిగింది. కానీ కరోనా నేపథ్యంలో ప్రపంచదేశాలన్నీ ఒక్క తాటిపైకి రావడం సంతోషకరమైన పరిణామం. కొత్త మందు కనిపెట్టి, కొత్త వ్యాక్సిన్‌ వేసుకోవడం చేసి చేతులు దులుపుకొంటే మళ్లీ తప్పు చేస్తున్నట్టే.

కరోనా లాక్‌డౌన్‌ సమయం ఇంకా పొడిగించే అవకాశం ఉన్న సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చర్చించుకోవాలి. పజిల్స్‌, బోర్డ్‌ గేమ్స్‌ ఆడుకొని కాలక్షేపం చేశాం. టీవీలో వార్తలు, కరోనా వ్యాప్తి గణాంకాలు చూసి, ఆశ-నిరాశల భావోద్వేగాలకు లోనయ్యాం. ఎన్నడూ లేనివిధంగా నాయకులంతా సామాన్యునితో మాట్లాడారు. దేశాల మధ్య పరస్పర సహకారం విస్తృత పరిధికి పెరుగుతున్నది. ఇంతగా మానవులందరినీ ప్రభావం చేసిందేమిటి? రోగం కాదు, మరణమంటే భయం. జీవితంపై ఆశ.

జీవ పరిణామక్రమంలో జంతువులన్నింటిలో మకుటాయమానంగా భూమ్మీద అవతరించిన మానవుడు, కాలం-దూరమనే ఈ రెండింటినీ సమన్వయపరుచుకుంటూ పురోగమించాడు. ఎన్నో ఆవిష్కరణలను సాధించా డు. అమూర్తభావనలను ఊహగా మలిచి, సైన్స్‌తో సత్యాలను కనుగొని ప్రకృతిని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు. కానీ ఒక సూక్ష్మజీవి ప్రకృతి వైపు నిలబడి జరిగినదంతా సబబేనా? అని ప్రశ్నిస్తున్నదిప్పుడు!

దూరం అనే ఒక మితిని (డైమన్షన్‌), లాక్‌డౌన్‌ రద్దుచేసింది. ఎక్కడి వారక్కడే గప్‌చుప్‌ అయ్యాం. ఇక, ఇప్పుడు మన చేతిలో ఉన్నది సమయమే. అస్సలు టైం దొరుకడం లేదు, అనే మాట ఆధునిక యుగంలో తరచుగా విం టూ ఉంటాం. అలాంటి ఈ నవీన సమాజానికి లాక్‌డౌన్‌ ఒక వరం. ఛాలెంజ్‌ అని కూడా చెప్పాలి. విరామం లేని, విశ్రాంతి ఇవ్వని ప్రతిరోజు పరుగు పందెం లేని జీవితాన్ని రుచి చూపించిన విస్మయపరిచే సమయం ఇది.

నిజం చెప్పాలంటే.. ‘డిజిటల్‌ ఇండియా’ దీన్ని ముందుగానే పసిగట్టి, ఇబ్బంది లేని రెం డో ప్రపంచాన్ని సృష్టించుకున్నది. దేశమంత టా మార్చి 25న లాక్‌డౌన్‌ ప్రకటించగా, అప్పటికి సుమారు వారం ముందునుంచే ‘వర్క్‌ ఫ్రం హోమ్‌' ప్రకటించి అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా యి. అదేవిధంగా లాక్‌డౌన్‌ పూర్తిగా అమలుచేసిన మూడు, నాలుగు రోజుల్లోనే పేరొందిన పాఠశాలలు, కళాశాలలు ‘డిజిటల్‌ క్లాసులు’ మొదలుపెట్టాయి. ఇప్పుడు వైద్య కళాశాలలు, కొన్ని విశ్వవిద్యాలయాలు ఇదే బాట పట్టా యి. గూగుల్‌ పే, ఫోన్‌ పే సౌకర్యాలతో చిరువ్యాపారులంతా తమ ఆర్థిక లావాదేవీలను కొనసాగించుకుంటున్నారు.

130 కోట్ల ప్రజలున్న భారతదేశం, కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమే. ‘కరోనాకు ముందు-కరోనాకు తర్వాత’ అని చెప్పుకునేలా, కనీవినీ ఎరుగని రీతిలో రహదారులు, రైల్వేలు, విమాన సర్వీసులు అన్నింటినీ ఆపివేయడం, మాల్స్‌, వ్యాపారాలు, హోటళ్లు మూసివేయడం మనం చూస్తున్నాం. అయితే లాక్‌డౌన్‌ వల్ల ఎందరో వలస కూలీలు ఉపాధి కోల్పోయి, సొంతూరికి తిరిగిపోవటం చారిత్రక విషాదం. ఆర్థిక, సామాజిక కార్యకలాపాల్లో వచ్చే ఇబ్బందుల కన్నా వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు, హాస్టల్‌ నుంచి వెనుకకు పంపబడిన విద్యార్థుల అసౌకర్యం, అశాం తి అసాధారణమైనవి.

ఇక లాక్‌డౌన్‌ పర్యవసానాలు చూస్తే.. వాతావరణ కాలుష్యం 76 శాతం తగ్గిందని, వాయు, ధ్వని కాలుష్యాలు తగ్గాయని, గంగా, యమున, గోదావరి, పెన్నా వంటి నదులన్నీ చాలా తేటపడటమే కాదు, రోడ్డు ప్రమాదాలు దాదాపు లేవ ని గణాంకాలు చెబుతున్నాయి. నేరాల సంఖ్య 26 శాతం తగ్గినట్లు నమోదైంది.

చమురు, విద్యుత్‌ వినియోగం తగ్గింది. కానీ, వలసకూలీల కష్టాలు, వైద్య సౌకర్యాల కొరత గమనించినప్పుడు కరోనా వంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్నది మనల్ని సవాల్‌ చేస్తున్నది. ఒక ప్రాంతంలోనే కాకుండా దేశం నలుదిశలా విస్తృతంగా జరుగాల్సిన మార్పుల ఆవశ్యకత ఇపుడిప్పుడే తెలుస్తున్నది.

డబ్భు ఏండ్ల స్వతంత్ర భారతదేశ బడ్జెట్‌ను పరిశీలిస్తే విద్య, వైద్యం, పరిశోధనారంగాలకు చాలా తక్కువ నిధులు కేటాయించడం చేదు నిజం. అందుకే మరిన్ని నిధులను కేటాయిం చి, నిర్మాణాత్మక మార్పులను తీసుకొచ్చి, భవిష్యత్‌ ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉన్నది. రోగులకు వ్యాధుల పట్ల అవగాహన పెంచాలి. వైద్య పనిముట్లు, పరికరాల తయారీ పెరిగేటట్లు చూడాల్సిన ఆవశ్యకత ఉన్నది. వారానికి రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించి,ఆన్‌లైన్‌ బోధన ప్రారం భించాలి. నగరాల్లో నెలకో రోజు సంపూర్ణ ట్రాఫిక్‌ నిషేధం, పెద్ద నగరాల్లో కొన్ని ప్రదేశాలను ‘సైకిల్‌ జోన్‌'గా ప్రకటించి, వాహనాల నియంత్రణ చేయడం కొన్ని ప్రతిపాదనలు.

అనేక ప్రపంచ నగరాల్లో ‘నైట్‌ లైఫ్‌' పరిపా టి. సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే వ్యాధులు ఆరోగ్యానికి పెద్ద సవాలు విసిరేది ఇలాంటి చోటే. అంతేగాక, నేరాలు-ఘోరాలు, చీకటి వ్యాపారాలు, గన్‌కల్చర్‌, మాఫియా, మద్యం, మాద కద్రవ్యాల విస్తృత వినియోగం లాంటి వాటి తో సామాన్య పౌరజీవనానికి సమాంతర దుష్టశక్తిగా రూపాంతరం చెందిందని చెప్పుకోవాలి. వీటిని రద్దుచేయడం ప్రభుత్వాలకు వీలుకాకపోయినా, కట్టడి చేయడం వల్ల నేరాలను నియంత్రించవచ్చు.

ఇక వ్యక్తిగతస్థాయిలో ఏం చేయవచ్చో ఆలోచిద్దాం.. ప్రసిద్ధ శాస్త్రవేత్త సర్‌ ఇసాక్‌ న్యూటన్‌ 1665లో ప్లేగు వ్యాధి ప్రబలిన కాలంలో క్వారంటైన్‌ సమయంలోనే ‘గురుత్వాకర్షణ’ను, ‘తెల్లనికాంతిలో సప్త వర్ణాల’నుకనిపెట్టాడు. బాలగంగాధర తిలక్‌ ‘గీతారహస్యం’, జవహర్‌లాల్‌ నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’, గాంధీజీ, నెల్సన్‌ మండేలా తమ ఆత్మకథలను జైలు జీవితం గడుపుతూనే రాశా రు. ఉన్నవ లక్ష్మీనారాయణ, దాశరథి కృష్ణమాచార్య, రావిశాస్త్రి చెరసాల జీవితంలోనే గొప్ప రచనలు చేశారు. సమయాన్ని నిర్మాణాత్మకం గా గడిపేందుకు పైవన్నీ మంచి ఉదాహరణ లు. పుస్తక పఠనం, ధ్యానం, శారీరక వ్యాయా మం, ప్రశాంత జీవనసరళి ఇవన్నీ అనుసరణీయమే. ప్రజలు స్వచ్ఛందంగా పర్యావరణ రక్ష ణ కోసం ‘గ్రీన్‌ ఛాలెంజ్‌' కార్యక్రమాలను చేయవచ్చు. నడక, మొక్కల పెంపకం, సౌరశ క్తి వినియోగం, ప్లాస్టిక్‌ నిషేధం, సేంద్రీయ ఎరువుల వాడకం లాటివన్నీ భూతాపాన్ని తగ్గించేవే. పెళ్లి, పుట్టినరోజువంటి వ్యక్తిగత సం బురాల కోసం పెట్టే ఖర్చును బట్టి, పన్ను విధించడం ఇప్పటికే ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి. కాబట్టి దాన్ని వెంటనే అమలుచేయాలి.

రోగ నిరోధకశక్తి పెంచుకోవడం పూర్తిగా వ్యక్తిగత బాధ్యత. శరీర శుభ్రత, రక్షిత మంచినీటి వాడకం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన డం, మాస్క్‌ ధరించటం రాబోయేకాలంలో ప్రతి ఒక్కరు పాటించాల్సిన కనీస సూత్రాలు. ‘క్యూ’ పద్ధతి పాటించడం ఇప్పటికీ అలవర్చు కోకపోతే ఏం చేయలేం. ఇక జటిలమైన సమస్యలను గురించి కూడా చర్చ అవసరం. భవ న నిర్మాణ కార్యక్రమాలు గత రెండు దశాబ్దాలుగా అవసరంలేని పెట్టుబడిగా తయారయ్యా యి. రియల్‌ ఎస్టేట్‌ రంగం చూస్తే.. ఆక్యుపెన్సీ లేకుండానే ఇళ్ల సముదాయాలు, ఆకాశ హర్మ్యాలు కట్టడం వల్ల నగరానికి పక్కనే మురికివాడలను పెంచిపోషించడం అవుతున్నదనడంలో అతిశయోక్తి లేదు.

దీనికి విరుగుడుగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో ఉన్న శ్రామికుల జాబితాను ఓటరు జాబితా పద్ధతిలో తయారుచేసుకొని, వారికి ఏటా 200పైగా పనిదినాలు, రోజుకు 8-10 పని గంటలుండేలా సరికొత్త పథకాన్ని అమలుచేయవచ్చు. ఇందుకు ప్రాంతీయ పరిశ్రమ ల ప్రోత్సాహం అవసరం. ఇన్నాళ్లు శ్రామికశక్తి కి జరుగవలసిన న్యాయం జరుగనే లేదు. మహాత్మాగాంధీ చెప్పినట్టు అధిక దిగుబడి కాదు, అధికులచే దిగుబడి అవసరం.

ప్రతి ఊళ్లో ఉద్యోగం కోసం విదేశం వెళ్తున్నవారి గణాంకాలు సేకరించాలి. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ కేంద్రం, అమెరికా వంటి సంపన్న దేశాలకు చదువు, ఉపాధి కోసం వెళ్లేవారి హెల్ప్‌లైన్‌ తరహాలో ప్రతి ఊరులో ఒక నమో దు కేంద్రం నెలకొల్పాలి. ఈ నమోదు కార్యక్రమాలను సింగిల్‌విండోతో చేయవచ్చు.

నిరుద్యోగ సమస్యకు నిర్మాణాత్మక కార్యక్రమాలే సరైన ప్రత్యామ్నాయం. ప్రజారోగ్యం, సర్వజన సంక్షేమ విధానాలు అంటే కేవలం ఆరోగ్యబీమా, ఉచిత పథకాలు కాదు. ప్రాం తీయంగా స్థానికులు నిర్మించే వస్తువుల వాడ కం, ఎగుమతులకు ప్రాధాన్యమివ్వాలి. ఈ సంక్లిష్ట సమయంలో ఉప్పాడ సమీపంలో మూలపేట వద్ద బొమ్మల తయారీ కర్మాగారం లో, కరోనా నుంచి రక్షణనిచ్చే వ్యక్తిగత రక్షణ కవచం తయారీ, దీనికి విశిష్టమైన ఉదాహర ణ. విశాఖలో వెంటిలేటర్లు, కరోనా పరీక్షల కిట్స్‌ తయారీ స్వాగతించవలసిన పరిణామం.

కరోనా కష్టకాలంలో ఒక వ్యక్తి చేయలేనిది ఒక సంఘం చేయగలదనే గొప్ప సత్యాన్ని పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు, ప్రభుత్వోద్యోగులు, జర్నలిస్టులు నిరూపించా రు. ఇదే సంయమనం, ముందుచూపుతో అం తా ముందడుగు వేయాలి. రాజకీయ ప్రయోజనాలు, వాదప్రతివాదాలకు అతీతంగా చేయవలసిన సమైక్య పోరాటం ఇది.

ప్లేగు, ఎబోలా, హెచ్‌1ఎన్‌1, హెచ్‌ఐవీ ఎయి డ్స్‌, కలరా, మశూచి వంటి వ్యాధులు ప్రబలినప్పుడు, ప్రాణనష్టం జరిగింది. కానీ కరోనా నేప థ్యంలో ప్రపంచదేశాలన్నీ ఒక్క తాటిపైకి రావ డం సంతోషకరమైన పరిణామం. కొత్త మందు కనిపెట్టి, కొత్త వ్యాక్సిన్‌ వేసుకోవడం చేసి చేతు లు దులుపుకొంటే మళ్లీ తప్పు చేస్తున్నట్టే. పర్యావరణ సమతుల్యత కోసం నిజమైన మార్పును ఆహ్వానించాలి.  ‘వర్క్‌ హార్డ్‌ కాదు వర్క్‌ స్మార్ట్‌'. ‘కష్టంగా కాదు ఇష్టంతో, తెలివితో పనిచేయాలి’ అని చెప్పుకునే ఈ తరం అలాంటి ముందడుగు వేస్తుందని ఆశిద్దాం. 

నాగసూరి వేణుగోపాల్‌, కాళ్ళకూరి శైలజ


logo