మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Apr 17, 2020 , 23:31:44

లాక్‌డౌన్‌తోనే బతుకు

లాక్‌డౌన్‌తోనే బతుకు

రాష్ట్రంలో గత మూడు వారాలుగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌ వల్ల కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా కనిపించలే దు. ఒక్క తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ర్టాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉండటం వల్ల కరోనా వైరస్‌ను అదుపులో ఉంచగలిగాం. కానీ మర్కజ్‌, ఢిల్లీ ఘటనల వల్ల ప్రభుత్వాలు జాగ్రత్త పడేలోపునే జరుగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ సందర్భంలో లాక్‌డౌన్‌ను సడలిస్తే మనం ఇంతకాలం పడిన శ్రమ వృథా అవుతుంది.

మానవజాతి తాత్త్విక మూలాలనే ప్రశ్నిస్తూ అస్తినాస్తి విచికిత్స వైపూ నెడుతూ మానవాళికి పెను విపత్తుగా ఎదురైన కరోనా కట్టడి విషయంలో భారతదేశం సరిగ్గానే ప్రతిస్పందిస్తున్నదని, ప్రతిభావంతంగా పోరాడుతున్నదని ఇతరదేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మెచ్చుకోలు అందించాయి. దాదాపు గత మూడువారాలుగా ప్రజలు నాలుగు గోడలకు పరిమితమయ్యారు. దేశమంతా స్తంభించింది. కానీ, ఇంతలోనే లాక్‌డౌన్‌ను సడలిస్తూ కేంద్రప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి.

లాక్‌డౌన్‌ సడలింపుల జాబితా చూస్తే మహాకవి పోతన గారి పద్యం.. ‘వారిజాక్షులందు వైవాహికములందు/ ప్రాణవిత్తమానభంగమందు/ చకిత గోకులాగ్రజన్మరక్షణమందు / బొంకవచ్చు నఘము వొందదధిప..’ అని శుక్రాచార్యుని శుక్రనీతి గుర్తుకు వస్తున్నది. దీన్ని అనుసరిస్తే ప్రధానమైన అన్ని అవసరాల కూ అబద్ధం ఆడవచ్చు. ఆడకుండా ఉండే అవసరాలే ఉండవు. అందుకే దీన్ని శుక్రనీతి అని చెప్పారు. దీని ప్రకారం- మన లాక్‌డౌన్‌ అనేది అర్థం లేకుండాపోతుంది. ఈ సడలింపులు ఇవ్వడం బడుగువర్గాల ఆకలిని దృష్టిలో పెట్టుకొని ఉండవచ్చు. ఆర్థికమైన ఒడిదుడుకులను తట్టుకునే ఉద్దేశం ఉండవచ్చు. కానీ ఇప్పటిదా కా మనం చెప్పిన ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదనే మాటను గుర్తుకుపెట్టుకుంటే ఈ సడలిం పు మంచిది కాదనే తెలుస్తుంది. ఇక్కడే కేసీఆర్‌ చెప్పిన మాట.. ‘ఆర్థికమాంద్యాన్ని తర్వాత రికవరీ చేసుకోవచ్చు, కానీ ప్రాణం పోతే రికవరీ చేసుకోలేమన్న’ది ఈ సందర్భంలో గుర్తుకుతెచ్చుకోవాలి. ప్రధాని మోదీ కూడా తుల్యమైన మాటే అన్నారు అప్పుడు. కానీ, ఈ సడలింపు వల్ల జరిగే పరిణామాలెలా ఉంటాయో కొన్ని చూద్దాం.

పల్లెల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకోవచ్చని చెప్పారు. కానీ, ఉపాధి హామీ పనులు ఎలా జరుగుతుంటాయో తెలిస్తే దీని వల్ల జరిగే నష్టమేమిటో తెలుస్తుంది. ఈ పథ కం కింద పనిచేసే కూలీలు మాస్కు కట్టుకు న్నా వారు కలిసిపనిచేయాలి. ఒకరు తవ్వుతుంటే మరొకరు పక్కనే ఉండి పారతో తట్టలోనికి ఎత్తాలి. దాన్ని ఇంకొకరు తలపైకి ఎత్తా లి. కోతలైనా, నాట్లయినా కలిసిపనిచేయాలి. భౌతికదూరం పాటిస్తే ఈ పనులు చేయడానికి కుదరనే కుదరదు. దీనవల్ల కరోనా వైరస్‌ వ్యాప్తిని ఆపడం సాధ్యం కాదు. ఇప్పటిదాకా గ్రామసీమలు క్షేమంగా ఉన్నాయి. కరోనా రోగులు అధిక శాతం నగరాల్లోనే ఉన్నారు. ఈ సడలింపు వల్ల గ్రామాలకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉన్నది. హరిత ప్రాంతాలుగా కొన్నింటిని చెప్పడం వల్ల అక్కడివారు వేరేచోటికి రావడం వల్ల కూడా కరోనా వ్యాప్తి ఉధృత మవుతుంది. ఇక నగరాల్లో భవన నిర్మాణ పనులకు అనుమతులిచ్చారు. ఈ పనుల్లో వలస కూలీలే ఎక్కువమంది ఉన్నారు. వారికి కాస్త ఉపాధి లభిస్తుంది కానీ, ఇదే సందర్భం లో వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశాలుంటాయి. కొన్నిచోట్లలోనే కార్మికులకు పని నివాస ప్రాం తంలోనే ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇది కుదరదు. వ్యవసాయ పనులకు వెసులుబాటు ఇచ్చారు. ఆహారధాన్యాల కొరత లేకుండా చూడటానికి ఇది అవసరమే. పొలంలో దున్న డం యంత్రాలతో కోయడం తక్కువ మంది తో పనులు చేయించడంతో కొంత జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ వ్యవసాయాధారిత పరిశ్రమలకు, ఇంకా కొన్ని పరిశ్రమలకు సడలింపు ఇచ్చారు. కార్మికులు కలిసి పనిచేసేటప్పుడు పైన చెప్పిన సమస్యలే ఇక్కడ కూడా వస్తాయి.

ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పరిశ్రమలు పనిచేయటానికి అనుమతి ఉన్నది. ఇక్కడ కూడా వేల సంఖ్యలో కార్మికులు పనిచేయవలసి ఉం టుంది. వైరస్‌ వ్యాప్తి విషయంలో ఎంత ప్రచా రం చేసినా కార్మికులు పాటించడం సాధ్యం కాదు. అంతేకాదు, వీరికి రవాణా సదుపాయాన్ని కూడా అందించవచ్చని సడలింపు ఇచ్చారు. ఇక బస్సు ప్రయాణాల్లో వ్యాప్తి జరుగకుండా పాటించడం ఎంత కష్టమో చెప్పవలసిన పనిలేదు. ఇటుక  బట్టీలు, ఐటీ హార్డ్‌వేర్‌ పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమల్లో 50 శాతం హాజరు, కలెక్టర్‌ అనుమతితో వివాహాలు చేసుకోవచ్చన్నారు.ఈ అనుమతులన్నీ కూడా ప్రజ లను దగ్గర చేసేవే. దీనివల్ల వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం సాధ్యమయ్యే పనికాదు.

రాష్ట్రంలో గత మూడు వారాలుగా అమలు లో ఉన్న లాక్‌డౌన్‌ వల్ల కరోనా వైరస్‌ ప్రభా వం ఎక్కువగా కనిపించలేదు. ఒక్క తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ర్టాల్లో లాక్‌డౌన్‌ అమ ల్లో ఉండటం వల్ల కరోనా వైరస్‌ను అదుపులో ఉంచగలిగాం. కానీ మర్కజ్‌, ఢిల్లీ ఘటనల వల్ల ప్రభుత్వాలు జాగ్రత్త పడేలోపునే జరుగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ సందర్భం లో లాక్‌డౌన్‌ను సడలిస్తే మనం ఇంతకాలం పడిన శ్రమ వృథా అవుతుంది. జరిగిన నష్టం ఎట్లాగూ జరిగింది. కాబట్టి లాక్‌డౌన్‌ను మరొ క రెండువారాలు కొనసాగిస్తే వైరస్‌ను పూర్తిగా కట్టడిచేసి అవకాశం ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్ని వదలుకొని సడలింపులు ఇవ్వడం అర్థంలేని పని. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలి. అంతర్జాతీయంగా ఇతర దేశాలు చేస్తున్న పనిని గమనించినా తెలుస్తుంది. చైనా వూహాన్‌లో మూడు నెలలు లాక్‌డౌన్‌ అమలుజరిగింది. బ్రిటన్‌ లాక్‌డౌన్‌ మూడు వారాలు పొడిగించింది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. దీనికి ప్రజలందరూ సహకరించి స్వీయ నిర్బంధం పాటి స్తే అందరికీ క్షేమం. అయితే వలస, స్థానిక కూలీలు, బడుగు జీవులకు బతుకు దుర్భరమవుతుంది. వీరికోసం ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. ఆర్థిక పరిస్థితి అధ్వాన్నమవుతుంది. కానీ దానికి కూడా అవసరమైన భవిష్యత్‌ ప్రణాళికలు రచించుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన ‘ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు’ మాట జ్ఞప్తి కి తెచ్చుకొని లాక్‌డౌన్‌ కొనసాగించడమే జాతి క్షేమానికి అవసరం.

-డాక్టర్‌ పులికొండ సుబ్బాచారి


logo