శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Apr 17, 2020 , 23:25:40

ఆధునిక యుద్ధగీతిక

ఆధునిక యుద్ధగీతిక

అనాదిగ నువ్వు పెట్టిన అణచివేతకు

పచ్చని ప్రకృతి కంటతడి పెట్టింది

నువ్వు ఒట్టి నీటిబొట్టే అనుకున్నవు

మనిషీ..

అది విశ్వవ్యాపిత విషపు చుక్క !

మంత్రనగరిల రూపుదిద్దుకున్నదో

మహాయోధుని అస్థికల అవశేషమో

పాచికలు ఎవ్వరేసినా

పోయింది ద్రౌపది మానాలే

దోచింది అమాయకుల ప్రాణాలే..!

అధికార ఆధిపత్య అహంకారానిదో

చెట్టుచాటు సోదర దొంగదెబ్బదో

విడిచిన శరమెవరిదైనా

ఒరిగినది నిస్సహాయ నిరాయుధులే!

పునరుత్థానం ఒక పచ్చి అబద్ధం

ఇప్పుడు శిలువ మీద తలలు తెగిపడేది

దొడ్డిదూకిన వేనవేల వెర్రి గొర్రెలదే..!

రూపమే లేని నువ్వు

రూపంలేని ఈ శత్రువు నుంచి

        ఏ కాందిశీకుల కాయగలవు?

కఫన్‌ల కింద పోగుపడుతున్న 

        ఎన్ని కళేబరాలను ఆపగలవు?

దేవుళ్ళని నిలదీసి, శిలువేసి

ఆధునికతని వెక్కిరించి

శాస్త్రీయతను ధిక్కరించి

కరతాళ ధ్వనుల మధ్య 

కరాళ మృత్యుగీతం పాడుతున్న కరోనా..!

దారిపొడుగునా 

నెత్తుర్లు చిమ్ముకుంటూ..

కన్నీటితో 

బాధల గాయాలు కడుగుకుంటూ..

తెగిన అవయవాల 

దారపు కండెను ముడివేసుకుంటూ..

అఖండ అసమాన సృష్టికి 

ప్రతిసృష్టి చేసుకుంటూ..

కాలం పొడుగుతా 

యుద్ధాలు గెలిచిన చరిత్ర మాది

విశ్వరహస్యాలు ఛేదించి

చంద్ర మండలం మీద జెండా నాటిన జ్ఞానం మాది..!

ఇవ్వాళ్ళ, 

ఒకడుగు వెనకకు పడిందంటే

ఓటమిని ఒప్పుకుంటున్నట్టు కాదు

శాస్త్ర అస్ర్తాలు సంధించి

ద్విగణీకృత శక్తితో 

తిరిగి లంఘించడానికే..

చరిత్ర పుటమీద 

గెలుపు సంతకం చేయడానికే.. ...

-డాక్టర్‌ కాసుల లింగారెడ్డి, 99489 00691


logo