బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Apr 16, 2020 , 00:03:03

చల్లని మాట

చల్లని మాట

మండుటెండలో ఎడారి మధ్యన ప్రయాణిస్తున్నప్పుడు ఒక సెలయేరు కనిపిస్తే ప్రాణం లేచొస్తుంది. ప్రపంచమంతా కరోనా వైరస్‌ కబళిస్తున్న విషాద వార్తలే వినబడుతున్నప్పుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మన పంట దిగుబడి గురించి చెప్పిన నాలుగు చల్లని మాటలు ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్నివ్వటమే కాదు, కొండంత ధైర్యాన్నిచ్చాయి. కేసీఆర్‌ అన్నట్టు- కరోనా బాధ వచ్చిపడ్డది కానీ, లేకపోతే తెలంగాణ సమాజమంతా సంబురాలు జరుపుకొనే సందర్భం ఇది. గతంలో అయితే కరువు కాటకాలు, కరంటు కోతలతో పండిన ఆ కాస్త పంట కూడా ‘అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి’ అన్న చందంగా ఉండేది. కానీ మునుపెన్నడూ లేనిస్థాయిలో పంటలు పండి చేతికిరావడమే కాకుండా, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనడానికి ముందుకురావడం రాష్ట్రంలో రైతురా జ్యం నెలకొన్నదనడానికి నిదర్శనం.  

హరిత విప్లవం అంటే ఏమిటో గానీ, తెలంగాణలో ధాన్యలక్ష్మి కొలువై ఉన్నదనిపిస్తున్నది. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారడంతో పాటు కరెంటు కోత లేకపోవడంతో కొత్త ఆయకట్టు గణనీయంగా పెరిగి సుమారుగా నలభై లక్షల ఎకరాలు సాగయ్యింది. గతంలో ఎన్నడూ 17లక్షల ఎకరాలకు దాటిన సందర్భాల్లేవు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎంత లేదన్నా కోటి 5 లక్షల టన్నుల వరి దిగుబడి రావడం అబ్బురం. కరోనా కట్టడిలోనూ రైతులు ఆందోళన పడటానికి ఆస్కారం లేకుండా అన్నివిధాలుగా అండగా నిలుస్తానని చెప్పటం విశేషం. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి 30 వేల కోట్లను విడుదల చేయడంతో పాటు దాదాపు ఏడువందల కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రైతులు వరి అమ్మకం ద్వారా రమారమి 20 వేల కోట్ల ఆదాయాన్ని పొందనుండటం చరిత్రాత్మకం. ఇటీవలికాలంలో భూగర్భ జలమట్టం కూడా పెరిగింది. బోరుబావులు నీళ్లను వెళ్లగక్కుతున్నా యి. వ్యవసాయ అనుబంధ పంటలు కూడా విస్తారంగా పెరిగాయి. 14 లక్షల టన్నుల మక్కలతో పాటు లక్షలాది టన్నుల మేర పల్లి, కందులు, పసుపు తదితర పంటల దిగుబడి పెరుగడం కేసీఆర్‌ అభివృద్ధి వ్యూహానికి సూచిక. 

రాష్ట్ర సాధన తర్వాత  స్వీయపాలనా మాధుర్యాన్ని తెలంగాణ సమాజం చవిచూస్తున్నది. బంగారు తెలంగాణ అంటే ఏమిటో ఇవాళ తెలంగాణ పల్లెల్లోని రైతులను అడిగితే చెబుతారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ర్టాలకు బియ్యాన్ని సరఫరా చేస్తూ తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారుబోతున్న శుభతరుణం ఇది. కరోనా వైరస్‌ బలహీనులనే బలిగొంటుంది తప్ప ఆరోగ్యవంతులను ఏమీ చేయలేదు. ఇదే సూత్రాన్ని సమాజానికీ వర్తింపజేయవచ్చు. కరోనా వ్యాప్తికి ముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ సమాజాన్ని ఆర్థికాది అనేక రంగాల్లో బలోపేతం చేసి పెట్టారు. తెలంగాణ సమాజం కరోనానే కాదు, మరే సంక్షోభం వచ్చినా తట్టుకొని నిలబడే జవసత్తాలను సంతరించుకున్నది. ఇంత గడ్డు పరిస్థితుల్లోనూ వ్యవసా య కార్యకలాపాలకు ఆటంకం కలుగకపోవడం ఇందుకు నిదర్శనం. కరోనా తెరిపి ఇవ్వగానే ముఖ్యమంత్రి మార్గదర్శనంలో తెలంగాణ అన్నిరంగాల్లో పుంజుకుంటుందనడంలో సందేహం లేదు.  


logo