ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Apr 14, 2020 , 23:03:59

ఆర్థిక సాంత్వన ఏదీ?

ఆర్థిక సాంత్వన ఏదీ?

దేశ ప్రజలనుద్దేశించి మంగళవారం ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించడం పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడం, విదేశాల్లో నెలకొన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు లాక్‌డౌన్‌ పొడిగింపు అవసరాన్ని గుర్తించారు. మిగతా రాష్ర్టాల సంగతెలా ఉన్నా తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా ముందే ప్రజలను  మానసికంగా సిద్ధం చేశారు. అయితే దేశం ఇప్పుడు రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. ఒకటి కరోనా వ్యాప్తి కాగా రెండవది ఆర్థిక సంక్షోభం. కరోనా వ్యాప్తికి ముందే దేశం మందగమనంలో ఉన్నది. ఇప్పుడు లాక్‌డౌన్‌ మూలంగా మరింతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కరోనా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ మృదువుగా మాట్లాడిన ప్రధాని ప్రజలను, పారిశ్రామిక వర్గాలను ఆర్థికంగా గట్టెక్కించే విషయం మాట్లాడకపోవడం తీవ్ర నిరాశను కలిగించింది.  

లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఉత్పత్తి రంగం స్తంభించి పోయింది. సేవల రంగానిదీ అదే పరిస్థితి. పరిశ్రమల రంగం రోజుకు నలభై వేల కోట్ల రూపాయల మేర నష్టపోతున్నదనేది ఒక అంచనా. ఈ లెక్కన లాక్‌డౌన్‌ను పొడిగించే కొద్దీ కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లుతూనే ఉంటుంది. పలు పరిశ్రమల్లో భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. చిన్నతరహా పరిశ్రమలు కూడా నిలదొక్కుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. తెలంగాణను మినహాయిస్తే, దేశంలోని పలు రాష్ర్టాలలో చాలాకాలం నుంచే గ్రామీణ ప్రాంతాలు సంక్షోభ భరితమై ఉన్నాయి. లాక్‌డౌన్‌ మూలంగా ఆర్థికాభివృద్ధి ఈ ఏడాదిలో శూన్యమని, వచ్చే ఏడాది కూడా 0.8 శాతం మేరనే ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. సమాజంలోకి భారీ ఎత్తున నగదును ప్రవహింప చేస్తేనే మళ్ళీ అన్ని రంగాలు నిలదొక్కుకుంటాయి. జీడీపీలో ఏడు శాతం మేర ఉద్దీపన పథకాన్ని ప్రకటిస్తే తప్ప ఆర్థిక రంగం గాడిలో పడలేదని నిపుణులు అంటున్నారు. 

ఆర్థిక రంగం దెబ్బతింటే ఆ ప్రభావం సమాజంపై కూడా తీవ్రంగా ఉంటుంది. మంగళవారం ముంబయిలో వలస కూలీలు స్వస్థలాలకు నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా స్వస్థలాలకు వెళ్ళడానికి భారీ ఎత్తున రోడ్లపైకి రావడం గమనార్హం. లాక్‌డౌన్‌ విధించిన మొదట్లో ఢిల్లీ నుంచి కూడా భారీ ఎత్తున గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళిపోయారు. దేశ విభజన తరువాత ఇంత భారీ వలసలు సాగడం ఇదేననే అభిప్రాయం ఉన్నది. అయితే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన వారికి అక్కడ కూడా ఉపాధి ఉండదు. పనులు దొరకనప్పుడు, నగరం కన్నా స్వస్థలమే వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ దీర్ఘకాలం పనులు లేకుండా ఉంటే ఎక్కడా ఉన్నా అనిశ్చితికి దారి తీస్తుంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోక ముందే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించడం మంచిది. కరోనాతో సతమతమవుతున్న యూరప్‌ దేశాలు, అమెరికా కూడా ప్యాకేజీలను ప్రకటించాయి. ఇప్పటికైనా సమాజంలోని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ ఒక సమగ్ర ప్యాకేజీని ప్రకటించడం తక్షణావసరం.


logo