ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Apr 12, 2020 , 22:36:55

దూరం.. దూరమయ్యే రోజుకోసం!

దూరం.. దూరమయ్యే రోజుకోసం!

చిన్నప్పుడు లెక్కల్లో ‘కాలము-దూరము’ అనే పాఠ్యాంశం ఉండేది. చిన్నప్పటి ‘కాలము- దూరము’ లెక్క పెద్దయ్యాక మారకపోయినా దాని అర్థం తాత్త్వికంగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా.. ‘కరోనా కాలం; కరోనా దూరం’ అని కొత్త కాలప్రమాణాలు, కొత్త దూరం లెక్కలు వాడుకలోకి వచ్చాయి. మానసిక శాస్త్రంలో వెలితి, శూన్యం, ఒంటరితనం, వైరాగ్యం, నిరాశ, నిస్పృహల లెక్కలు, దూరాలు మొదట మనసు, తర్వాత శరీరం, చివర సమాజంతో ముడిపడి ఉంటాయి. కరోనా శాస్త్రం దీనికి రివర్సు. కరోనా దూరాలు మొదట సమాజం, తర్వాత శరీరం, చివర మనసుతో ముడిపడకుండా ఉండాలి.

‘సోషల్‌ డిస్టెన్స్‌' అనే ఇంగ్లిష్‌ మాటకు సామాజిక దూరం అన్న అనువాదం కరక్టే. కానీ సామాజిక దూరం అన్న భావన కరోనా దెబ్బకు దూరదూరంగా ఉండటమంత చిన్న విషయం కాదు. దాని భావం, అర్థ విస్తృతి పెద్దది. అసలే మన నిచ్చెన మెట్ల సమాజంలో, శతాబ్దాలుగా అంటరాని దురాచారం రాజ్యమేలిన దేశంలో సామాజిక దూరం అనగానే ఏవేవో గాయాలు గుర్తొస్తాయి, గుచ్చుకుంటాయి, బాధపెడుతాయి. సామాజిక దూరం మాటకంటే భౌతిక దూరం మాట బెటరని కొందరి వాద న. ఏ తమిళులో అయితే వారి సొంతమైన భాషలో అప్పటికప్పుడు పారిభాషిక పదాలను సృష్టించుకుంటారు. వాటిని ఉపయోగిస్తారు. తెలుగులో మనకేదైనా ఇదివరకు సంస్కృతంలో చెప్తే కానీ అర్థమై చచ్చేదికాదు. ఇప్పుడు ఇంగ్లిష్‌లో చెబితే తప్ప అర్థం కాదు. చక్కగా తెలుగులో.. మనిషికి మనిషికి మధ్య దూరం; ఒకరొకరికి మధ్య ఎడం; దూరం- దూరం.. ఇలా ఎన్ని మాటలనైనా సామాజిక దూరానికి బదులు వాడవచ్చు. కానీ ఎక్కడో అంతరాంతరాల్లో మనకు అచ్చ తెలుగు మాటలు వాడ టం నామోషీ, సిగ్గు, చులకన. అదే సంస్కృతమో, ఇంగ్లిషో వాడితే గాంభీర్యం, మర్యాద, హోదా, పెద్దరికం, బాగా చదువుకున్నట్టు. అందుకే తెలుగు, తెలుగు మాండలికాలు, వాటి అందాలు చదువుకున్నవారికంటే చదువుకోని గ్రామీణుల్లోనే సజీవంగా ఉంటాయని ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి సూత్రీకరించారు.

ప్రపంచానికి కరోనా నేర్పిన-నేర్పుతున్న పాఠా లు చాలా ఉన్నాయి. నేర్పబోయే పాఠాలు కూడా చాలా ఉండబోతాయి. కరోనాకు ప్రస్తుతానికి మం దుల్లేవు, జాగ్రత్తలు తప్ప. ఒకరికొకరికి దూరం, సమూహాలకు దూరం, స్వీయ గృహనిర్బంధం, పరిశుభ్రతలే ప్రస్తుతానికి మందులు. భౌతికదూరం మాట సామాజికదూరంతో పోలిస్తే నయమే కానీ, అర్థంలో దోషం లేకపోయినా ‘భౌతిక’ చాలా బరువైన మాట. అసలే కనిపించని కరోనా సూక్ష్మ క్రిమి తో సమాజం చస్తుంటే, ఈ సంధి సమాసాల సూక్ష్మదృష్టి అవసరమా?

కరోనాకు విరుగుడుగా సామాజిక/భౌతిక దూరం పాటించాలి. మనుషుల మధ్య మానసిక దూరాలు తగ్గాలి, తగ్గుతున్నట్లున్నాయి. లేకపోతే ఎక్కడి ఇటలీ? ఎక్కడి స్పెయిన్‌? ఎక్కడి భారత్‌? భూగోళంలో ఎక్కడెక్కడి కరోనా విషాదాలకు మనం బాధపడుతున్నాం. గుండెలను బరువెక్కించుకుంటున్నాం. పుడమికి కరోనా పీడ త్వరగా విరగడకావాలని కోరుకుంటున్నాం.

సామాజిక దూరం.. ఇప్పుడు మన సమాజ ఆరోగ్యానికి... భౌతిక దూరం.. ఇప్పుడు మన శరీర ఆరోగ్యానికి... మనసులు దగ్గరవడం.. ఇప్పుడు మనుషుల ఆరోగ్యానికి... భాషదేముంది? కరోనాకు భాష లేదు. వైరస్‌కు నోరు లేదు. కన్నీళ్లకు భాష లేదు.

చావుకు భాష లేదు. ఈ దూరాలు తగ్గి మళ్లీ మనిషి మనిషి కలిసిమెలిసి తిరిగే కాలం త్వరలోనే రావాలి. ఒకరికొకరు తెలియకపోయినా సమూహంలో ఉన్న బలం మళ్లీ బలపడే కాలం త్వరలోనే రావాలి. మోడుగా బోసిపోయిన దారులన్నీ మళ్లీ జనం పాదాలను, జగతి రథచక్రాలను మోసి మోసులెత్తే కాలం త్వరలోనే రావాలి.

- పమిడికాల్వ మధుసూదన్‌, 99890 90018


logo