మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Apr 10, 2020 , 23:20:22

సైద్ధాంతిక మోహరింపు

సైద్ధాంతిక మోహరింపు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వానికి సాగుతున్న పోటీ నుంచి బెర్నీ శాండర్స్‌ తప్పుకోవడంతో, రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేసే దేశాధ్యక్షుడు ట్రంప్‌ను ఢీకొనేది జో బిడెన్‌ అనేది ధ్రువపడ్డది. యువకులను, కార్మికులను  బెర్నీ శాండర్స్‌ సంక్షేమ అజెండా విశేషంగా ఆకర్షించింది. కానీ మధ్యేవాదియైన బిడెన్‌వైపు డెమొక్రాటిక్‌ పార్టీ ‘నాయకత్వం’ మొగ్గుచూ పింది. పార్టీ అంతర్గతపోటీలో బిడెన్‌ కన్నా శాండర్స్‌ క్రమంగా వెనుకబడిపోయారు. దీంతో పోటీ నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు. కరో నా పరిస్థితి కూడా ఆయన నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. శాండర్స్‌ నిర్ణయం తీసుకున్న సమయం కీలకమైనది. అధ్యక్ష ఎన్నికకు ఇంకా ఏడు నెలల వ్యవధి ఉన్నది. పార్టీలో పరస్పరం పోటీపడటం వల్ల కాలహరణమే తప్ప ప్రయోజనం లేదు. శాండర్స్‌ వైదొలగడం వల్ల డెమొక్రాటిక్‌ పార్టీ తన శక్తినంతా ట్రంప్‌ పాల నా వైఫల్యాలను ఎత్తిచూపడంపైనే కేం ద్రీకరించవచ్చు. కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్‌ విఫలమయ్యారనే అభిప్రాయం ఇప్పటికే బలంగా ఉంది. 

శాండర్స్‌ వైదొలగినంతనే ఆయన అనుకూల ఓట్లన్నీ గంపగుత్తగా తనకు బదిలీ అవుతాయని బిడెన్‌ కూడా నమ్మడం లేదు. నిరుద్యోగులకు, కార్మికుల కు, ఇతర పేదవర్గాలకు అనుకూలమైన పథకాలను శాండర్స్‌ చర్చనీయాంశం చేశారు. ఆయన అజెండాను కొంత మేర అయినా అమలుచేయడానికి  బిడెన్‌ సిద్ధపడవలసి ఉంటుంది. వైద్య సహాయ పథకాన్ని విస్తృత పరుస్తామని, కొంత మేర పేద విద్యార్థుల విద్యా రుణాలు రద్దుచేస్తామని బిడెన్‌ ప్రకటించారు. అయితే ఈ తక్షణ ప్రకటన తాను శాండర్స్‌ అజెండా వైపు మొగ్గినట్టు ఇచ్చే సం కేతం మాత్రమే. శాండర్స్‌ అజెండాను బిడెన్‌ ఎంత మేరకు స్వీకరిస్తారనేది కొన్ని వారాల పాటు సాగే చర్చల్లో తేలుతుంది. శాండర్స్‌ 2016లో కూడా డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు. ఈసారి కూడా అభ్యర్థిత్వం పొందడంలో విఫలమైనప్పటికీ, అమెరికా రాజకీయాలను మలుపు తిప్పడంలో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనే కాదు, తర్వాతి ఎన్నికల్లో నూ శాండర్స్‌ సైద్ధాంతిక ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. 

1980 దశకం నుంచి అమెరికా రాజకీయాల్లో నయా ఉదారవాద భావజాలానిదే పైచేయిగా సాగుతున్నది. రెండు పార్టీల అజెండాలో పెద్దగా తేడా లేని పరిస్థితి ఉండేది. సంక్షేమ పథకాల్లో కోత, కార్పొరేట్‌ సంస్థల ఆధిపత్యం మొదలైన విధానాల ప్రభావం అమెరికా ప్రజల అనుభవానికి రావడానికి కొంతకా లం పట్టింది. పర్యావరణ విధ్వంసం, ఆర్థిక అసమానతలు, వినియోగ సంస్కృ తి, కార్పొరేట్‌శక్తుల ఆధిపత్యం పట్ల అమెరికా ప్రజల్లో వ్యతిరేకభావన పెరిగిపోతున్నది. ఒక దశలో సంపన్నవర్గానికి వ్యతిరేకంగా ‘వి ఆర్‌ 99 పర్సంట్‌' నినాదం మార్మోగింది, ‘ఆక్యుపై వాల్‌ స్ట్రీట్‌' ఉద్యమమూ సాగింది. ఇప్పుడు ఈ ప్రగతిశీల భావజాలం ఎన్నికల రాజకీయంలో స్పష్టమైన రూపుదిద్దుకున్నది. 1930 దశకంలో మహామాంద్యం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను ‘న్యూడీల్‌' అంటారు. ఇప్పుడు వాతావరణ మార్పు, ఆర్థిక అసమానత అనే రెండు పోకడలను అరికట్టడానికి ‘గ్రీన్‌ న్యూడీ ల్‌' అనే ప్రతిపాదన ప్రధానాంశంగా ముందుకురావడం విశేషం.


logo