శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Apr 10, 2020 , 23:16:40

కరోనాపై విజయం ఖాయం

కరోనాపై విజయం ఖాయం

వివిధ దేశాల్లో, వివిధ పరిశోధనాసంస్థల్లో కరోనా విషక్రిమి రూపురేఖలపై, దాని వినాశకర స్వభావంపై ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒక అదృశ్య, భయంకర, వినాశకశక్తిని నిర్మూలించడానికి ఈరోజు మానవాళి పోరాడుతున్నది.

‘కరో యా మరో’ (Do or Die) భారత స్వాతంత్య్ర, జాతీయ ఉద్యమాల మహాసారథి గాంధీజీ ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన, నిర్ణయాత్మకమైన, చివరి నినాదం ఇది. చరిత్రాత్మకమైన, మహత్తరమైన ‘క్విట్‌ ఇండియా’ నినాదంతో గాఢంగా, అవిభాజ్యంగా పెనవేసుకున్న నినాదం ‘కరో యా మరో’.190 ఏండ్లు నిరంతరంగా బంగారు పిచ్చుక వంటి ఈ దేశాన్ని పీల్చి పిప్పిచేసిన బ్రిటిష్‌ పాలకులు ఇక ముళ్లె మూటా సర్దుకొని భారతభూమిని వదిలివెళ్లిపోవాలని గాంధీజీ ఈ రెండు నినాదాలు ఇచ్చారు. ప్రపం చ ప్రఖ్యాత పత్రికా రచయిత లూయీ ఫిషర్‌ 1942 జూన్‌లో జరిపిన ఇంటర్వ్యూలో గాంధీజీ ‘నా ఓపిక నశించింది’ అని అన్నారు.

రెండవ ప్రపంచయుద్ధం క్లిష్టదశకు చేరిన సమయం అది. హిట్లర్‌ నాయకత్వంలోని ఫాసిస్టు శక్తులపై మిత్రపక్షాలు (బ్రిటన్‌, యూ ఎస్‌ఏ తదితర దేశాలు) విజయం సాధించబోతున్న ఆ సమయంలో గాంధీజీ ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా ‘కరో యా మరో’ నినాదం తో ‘క్విట్‌ ఇండియా’ పిలుపునివ్వడం కొందరు భారత జాతీయ కాంగ్రెస్‌ అగ్ర నాయకులకు ఇష్టం లేదు. 1942 జూలైలో గాంధీజీ వార్ధా ఆశ్రమంలో ‘క్విట్‌ ఇండియా’ తీర్మానాన్ని స్వయంగా రాశారు. వార్ధాలోనే భారత జాతీ య కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమై గాంధీజీ ‘క్విట్‌ ఇండియా’ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. 1942 ఆగస్టు 8న అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ముంబైలో గాంధీజీ తీర్మానాన్ని ఆమోదించి ‘క్విట్‌ ఇండి యా’ పిలుపునిచ్చింది. మరునాడే ఆగస్టు 9న దేశమంతటా క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలైంది. దేశ ప్రజలు లక్షల సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రె స్‌ తనవెంట వచ్చినా, రాకపోయినా దేశ ప్రజ ల సహకారంతో ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభిస్తానని లూ యీ ఫిషర్‌ ఇంటర్వ్యూలో గాంధీజీ స్పష్టం చేశారు. పేరు ప్రతిష్ఠల కోసం తాపత్రయపడకుండా అవసరమైనప్పుడు దేశం కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం కఠిన నిర్ణయాలు చేయడం లో గాంధీజీ ఘటికుడు. ‘క్విట్‌ ఇండియా’ అనగానే బ్రిటిష్‌ పాలకులు పారిపోరని గాంధీజీకి బాగా తెలుసు. అందువల్లనే ‘కరో యా మరో’ అని గాంధీజీ అంతిమ నినాదం ఇచ్చారు. ఆ దెబ్బ తో బ్రిటిష్‌ దయ్యం వదిలింది. క్రిప్స్‌ మిషన్‌ వచ్చిం ది. చర్చిల్‌ తర్వాత ప్రధాని అయిన లేబర్‌ పార్టీ నాయకుడు అట్లీ స్వయంగా భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వబోతున్నట్లు బ్రిటిష్‌ పార్లమెంట్‌లో ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమకాలం నుంచి గాంధేయమార్గంలో ఉద్యమిస్తున్న కేసీఆర్‌కు తెలు సు ‘కరోనా వెళ్లిపో’ అనగానే తాటకి, పూతకి కరో నా వెళ్లిపోదని. అందుకే కేసీఆర్‌ కఠిన నిర్ణయాలకు అసాధారణరీతిలో సాహసిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో కేంద్ర నాయకులు, ఇతర రాష్ర్టాల నాయకులు స్ఫూర్తిపొందడం విశేషం.

వివిధ దేశాల్లో, వివిధ పరిశోధనా సంస్థల్లో కరోనా విషక్రిమి రూపురేఖలపై, దాని వినాశకర స్వభావంపై ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒక అదృశ్య, భయంకర, వినాశకశక్తిని నిర్మూలించడానికి ఈరోజు మానవాళి పోరాడుతున్నది. మానవాళి అస్తిత్వానికి విఘాతం కలిగిస్తున్న ఈ విధ్వంసినిని జూలుపట్టి అరికట్టగలమన్న ప్రబల విశ్వాసంతో మానవుడు పోరాడుతున్నాడు. విశ్వాసం లేకపోతే విజయం సాధ్యం కాదు. ఉప్పుతో ఏం సాధిస్తామని కొందరు అవహేళన చేశారు. అయినా, గాంధీజీ తన శాసనోల్లంఘన ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా 1930, మార్చి 12న అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో కలిసి కాలినడకన దండియాత్ర ప్రారంభించారు. 24 రోజుల్లో 360 కి.మీ. నడిచి గాంధీ జీ, ఆయన అనుచరులు గుజరాత్‌ సముద్రతీరాన దండి గ్రామం చేరారు ఏప్రిల్‌ 5న. మరునాడు ఏప్రిల్‌ 6న దండి తీరంలో గాంధీ జీ ఉప్పు తీసి శాసనోల్లంఘన జరిపారు. అంతటితో శాసనోల్లంఘన ఆగలేదు. దేశమంతటా విస్తరించింది. చివరికి విజయం సాధించారు. స్వాతంత్య్రం సాధించగలమన్న విశ్వాసం లేకపోతే గాంధీజీ విజయం సాధించేవాడు కాదు. విముక్తి పొందగలమన్న విశ్వాసంతో రంగంలోకి దిగారు గనుకనే కేసీఆర్‌ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించగలిగారు. కరోనా రక్కసిని కూల్చివేయగలమన్న, కాల్చివేయగలమన్న దృఢవిశ్వాసంతో ఈరోజు మానవాళి కంకణధారణ చేసింది.

ఎన్ని త్యాగాలు చేయవలసి వచ్చినా, ఎన్ని కష్టాలు అనుభవించవలసి వచ్చినా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా మానవాళి ప్రకటించిన యుద్ధం ఆగేది కాదు. ఏటా ఎన్నో అమూల్య ప్రాణాలను బలిగొంటున్న క్యాన్స ర్‌ వ్యాధి నిరోధానికి, చికిత్సకు మానవుడి పరిశోధనా కృషి ఆగడం లేదు. ఎయిడ్స్‌ వ్యాధి వెలుగులోకి వచ్చినప్పుడు అదీ కరోనా వలెనే భయపెట్టింది. ఎయిడ్స్‌ వ్యాధి మెడవంచే ప్ర యత్నాన్ని మానవుడు కొనసాగిస్తున్నాడు. జవహర్‌లాల్‌ నెహ్రూ అర్ధాంగి కమలా నెహ్రూ క్షయవ్యాధితో అకాల మరణం పాలయ్యారు. కొన్నేండ్ల కిందట ప్రసిద్ధ పారిశ్రామికవేత్త జి.డి.బిర్లా సతీమణి ఇదే వ్యాధితో మరణించారు. క్షయ వ్యాధి నిర్మూలన ప్రయత్నాలను మానవుడు నిలిపివేయలేదు. కొన్నాళ్లు టైఫాయిడ్‌ మానవ ఆరోగ్యానికి విపరీత నష్టం కలిగించింది. టైఫాయిడ్‌కు గురై వినికిడిని, మాటను శాశ్వతంగా కోల్పోయిన మిత్రుడు ఒకతను డిగ్రీలు లేకపోయినా స్వయంకృషితో రచయితగా, చిత్రలేఖన కళాకారుడిగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా తెలుగు సారస్వతరంగంలో ప్రసిద్ధి పొందా డు. టైఫాయిడ్‌ క్రూరత్వానికి గురైన వారు ఎందరో. మశూచి, ప్లేగు, పోలియో వంటి భయంకర వ్యాధులను శాశ్వతంగా నిర్మూలించిన మానవుడు ఇతర వ్యాధుల మృత్యు గహ్వరం నుంచి విముక్తి పొందడం అసా ధ్యం కాదు. మానవాళి తన పరిణామ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందంజ వేయగలుగుతున్నది- అంతరిక్షం లోకి సైతం అడుగువేయగలుగుతున్నది. ప్రకృ తి వైపరీత్యాలు, మానవకల్పిత యుద్ధాలు, దాడులు, దండయాత్రలు, రక్తపాతాలు, రణరంగాలు, ఆకలి, అజ్ఞానం, అనారోగ్యం వంటి ఎన్నింటినో అధిగమించగలిగింది. కరోనా కరాళ, కంకాళ నృత్యాన్ని, వికటాట్టహాసా న్ని కూడా తట్టుకొని దరిచేరగలుగుతుంది.

-దేవులపల్లి ప్రభాకరరావు


logo