బుధవారం 03 జూన్ 2020
Editorial - Apr 09, 2020 , 23:09:41

వ్యాధి మూలాన్ని గుర్తించే వైద్యం

వ్యాధి మూలాన్ని గుర్తించే వైద్యం

రోగి, రోగం, ఔషధం.. అన్న మూడు అంశాలకు హోమియోపతిలో ప్రత్యే క ప్రాధాన్యం ఉన్నది. స్వస్థత, అస్వస్థత, వ్యాధి.. ఈ అంశాలను రోగ పరంగా కాకుండా ఒక రోగి పరంగా విశ్లేషించాలన్నది హోమియో వైద్యం మౌలిక సూత్రం.

సూక్ష్మమైన హోమియో గుళికతో అనితర సాధ్యమైన క్యాన్సర్‌ లాంటి వ్యాధుల నుంచి సైతం మోక్షం కల్పించవచ్చు. దాదాపు రెండున్నర శతాబ్దాల కిందట జర్మనీలో పుట్టిన డాక్ట ర్‌ శామ్యూల్‌ హానిమన్‌ కృషి ఫలితంగా పురుడుపోసుకొని ప్రపంచవ్యాప్త ఆదరణ పొందిం ది. మనిషిని కేవలం ఒక రోగిగా చూస్తూ ఐదా రు నిమిషాల్లో చీటీ రాసిచ్చేయడం కాకుండా, మనిషి తత్త్వాన్ని, వ్యక్తిత్వాన్ని, మనిషి శరీరం లో తలెత్తిన సంక్షోభాన్ని సానుకూలంగా అర్థం చేసుకొని దాన్నిబట్టి చికిత్స చేయడం ఇందులోని మౌలికాంశం. హోమియోపతిలో ప్రతి వ్యక్తి భిన్నమే. వ్యాధితో పాటు వ్యక్తిత్వం కూడా ముఖ్యమే. ఉదాహరణకు అందరికీ సమస్య ఉబ్బసం (ఆస్తమా) కావచ్చు.. కానీ దాని వెనుక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటిని గుర్తించి, అర్థం చేసుకొని దాని ఆధారంగా వ్యాధిని సమూలంగా నయం చేయ డం హోమియో ప్రత్యేకత. తన సమస్యను తానే నయం చేసుకునేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది హోమియోపతి. ఆ నయం చేసుకునే శక్తి మనందరిలో ఉంటుంది.

ఇతర వైద్య విధానాలు వ్యాధి లక్షణాలను పోగొట్టడానికి ప్రాధాన్యం ఇస్తాయి. మళ్లీ మనిషిని తిరిగి సమస్థితిలోకి తీసుకురావడం, మన శారీరక శక్తిని ప్రేరేపించడం హోమియో చికిత్స ముఖ్య ఉద్దేశం. వీటిగురించి పట్టించుకోకుండా వ్యాధి లక్షణాలను పోగొట్టేందుకు వ్యతిరేక మందులు ఇవ్వడం లేదా శరీరం తయారుచేసుకోలేకపోతున్న హార్మోన్ల వంటి వాటిని బయటి నుంచి ఇవ్వడం చేస్తారు. కానీ హోమియో చికిత్సలో ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో శరీరానికి ఈ వైద్యం దారి చూపిస్తుంది.

ప్రతి మనిషికి ప్రాణశక్తి ఉంటుంది, వ్యాధి వచ్చినప్పుడు ఆ ప్రాణశక్తి కుంగిపోతుంది. ఆ ప్రాణశక్తిని ఉత్తేజపరిస్తే వ్యాధి తగ్గుతుంది. ప్రాణశక్తి భౌతికమైనది కాదు కాబట్టి దానిని సరిచేసే మందు కూడా శక్తి స్వరూపంలో అం టే.. అతి సూక్ష్మంగా ఉండాలని ప్రతిపాదించి, ఆ రకంగానే మందులను తయారుచేసి వ్యాధి నివారణలు కలిగించి అద్భుత ఫలితాలు చూపించారు హానిమన్‌. ఔషధాల వల్ల దుష్ఫలితాలు తలెత్తకుండా ఉండేందుకు వాటిని ప్రత్యేక పద్ధతిలో పల్చనచేసి (పోటెంటైజేష న్‌) వాడటం మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ ద్వారా రస, విష, పాషాణాలను సైతం అమృ త తుల్యమైన ఔషధాలుగా మార్చి, దుష్ప్రభావాల బాధ లేకుండా ఔషధాన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన మోతాదుల్లో వాడటం కీలకం. ప్రతి పదార్థానికి భౌతిక, రసాయనిక ధర్మాలే కాకుండా వైద్య ధర్మాలూ ఉంటాయి. దాని ఆధారంగానే ఎందుకూ పనికిరానిదిగా భావించే ఇసుక నుంచి  వచ్చిన సైలీషియా మం దు హోమియోలో సర్జన్‌గా పనిచేస్తుంది.

ఒక ఔషధం ఆరోగ్యవంతునిలో ఏ వ్యాధి లక్షణాలను సృష్టిస్తుందో, ఆ లక్షణాలు గల రోగికి అదే ఔషధాన్ని ఇచ్చినట్లయితే స్వస్థత చేకూరుతుంది. దీని ఆధారంగానే likes cures likes అన్నదాన్ని ప్రకృతి సిద్ధ నియమంగా నిర్ధారించారు. చికిత్స నియమాల ఆవిష్కారానికి ఈ విధానం కొత్త ద్వారాలు తెరిచింది. గ్రీకు భాషలో హోమియోపతి అన గా అదే విధమైన బాధ అని అర్థం. శరీరానికి ఏ విధమైన బాధ ఉన్నదో, అదేవిధమైన బాధ ను శరీరంలోకి మందుల ద్వారా చొప్పించ డం వల్ల, అసలు బాధను నిర్మూలించడం. ఇది మన పురాణాల్లో ఉన్న ఉష్ణం-ఉష్ణేణ-శీతలంను పోలి ఉన్నది.

యూరప్‌లో క్రూప్‌, జర్మనీలో స్కార్లెట్‌ ఫీవర్‌, రష్యాలో కలరా సోకినప్పుడు లక్షలాది మందిని రక్షించిన చరిత్ర హోమియోపతిది. మెదడువాపు, చికెన్‌గున్యా, స్వైన్‌ఫ్లూ విషయంలో హోమియో సాధించిన విజయం గొప్పది. 158 దేశాల్లో హోమియో వైద్యం ద్వారా అధికారికంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, దవాఖానలు నిరంతర సేవలందిస్తున్నాయి. దేశంలో సుమారు 180 వైద్య కళాశాలలు, 40 పీజీ వైద్య కళాశాలల్లో సుమారు 3 లక్షల మంది శిక్షణ పొందిన వైద్యులు సేవలందిస్తున్నారు.

(నేడు హోమియోపతి పితామహుడు శామ్యూల్‌ హానిమన్‌ జయంతి, ప్రపంచ హోమియోపతి దినం)

-డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌


logo