మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Apr 09, 2020 , 23:09:32

నాటక నారాయణుడు

నాటక నారాయణుడు

కరీంనగర్‌ నాటకరంగానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన కళాకారు డు శ్రీరాముల సత్యనారాయణ. నాటక రచయితగా, దర్శకునిగా, నటునిగా పలువురి ప్రశంసలు పొందారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో 1952, జనవరి 6న జన్మించిన సత్యనారాయణ బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తిచేసి వ్యవసాయాధికారిగా సేవలందిస్తూనే నాటకరంగానికి ఎనలేని సేవ చేశారు. 1970లో ‘పదవి కోసం’ అనే నాటికలో నటించిన సత్యనారాయణ, ఆ తర్వాత అనేక నాటకాల్లో నటించారు. 1980లో పద్మ కళానికేతన్‌ రాష్ట్రస్థాయి నాటక పోటీలు నిర్వహించినప్పుడు సంస్థ కార్యదర్శిగా కీలకపాత్ర పోషించారు.

1985, మే 1న కునమల్ల రమేష్‌, బండారి శ్రీరాములు, తిప్పర్తి ప్రభాకర్‌, బండారి రవీందర్‌లతో కలిసి ‘చైతన్య కళాభారతి’ నాటక సంస్థను స్థాపించా రు. ‘నటనా జ్యోతి’ కార్యక్రమం ఏర్పాటుచేసి ప్రతి నెలా కరీంనగర్‌ కళాభారతిలో ఒక నాటికను ప్రదర్శించారు. సత్యనారాయణ 1981లో విద్యార్థు లు, విద్యావిధానం ఇతివృత్తంగా తీసుకొని ‘ఈ తరం మారాలి’ అనే నాటికను రచించారు. ఆ తర్వాత ‘పామరు లు’, ‘శివమెత్తిన సత్యం’, ‘ఆకలి వేట’, ‘ప్రేమ పిచ్చోళ్ళు’, ‘మనిషి’, ‘ఆడది అబల కాదు’, ‘నిరసన’, ‘కాలచక్రం’, ‘నేను పట్నం బోతనే’, ‘రైతు రాజ్యం’, ‘చదవరా’, ‘ఆశాపాశం’, ‘అగ్ని పరీక్ష’, ‘మలిసంధ్య’ లాంటి నాటకాలు రచిం చి ఉత్తమ రచయితగా ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. ఎన్నో ఏండ్లు చైతన్య కళాభారతి పక్షాన తెలంగాణస్థాయి నాటక పోటీలు నిర్వహించి కరీంనగర్‌ ప్రజలు పలు ఉత్తమ నాటకాలను చూసే అవకాశాన్ని కల్పించారు. కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం-అక్షర ఉజ్వల కోసం చాలా గ్రామాలలో నాటకాలను ప్రదర్శించి నిరక్షరాస్యులలో చదువుకోవాలనే ఉత్సాహాన్ని కలిగించారు. ప్రముఖ దర్శకులు స్వర్గీయ  దేవదాస్‌ కనకాల దర్శకత్వం వహించిన ఒక చిత్రంలో ప్రముఖ పాత్రను కూడా పోషించారు.

ఊరుమ్మడి బతుకులు, నిమజ్జనం లాంటి అవార్డు చిత్రాలకు దర్శకత్వం వహించిన బీఎస్‌ నారాయణ దర్శకత్వంలో నిర్మించబడిన ‘మార్గదర్శి’ సినిమాకు సామాజిక న్యాయం ఇతివృత్తం గా కథ, సంభాషణలు అందించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలూ చేపట్టా రు. ఈ చిత్రంలో ఆయన ఒక  పాత్రను కూడా పోషించారు. ఈ సినిమా 1993 లో జాతీయ సమైక్యత నంది పురస్కారాన్ని గెలుచుకున్నది. ‘మిషన్‌ కాకతీయ’ పథకంలో భాగంగా ఏర్పాటుచేసి న వ్యవసాయాధికారుల సమావేశంలో శ్రీరాముల సత్యనారాయణ రైతు సమస్యలపై రూపొందించి నటించిన లఘు చిత్రాన్ని చూసి మంత్రి తన్నీరు హరీశ్‌ రావు కంట నీరు పెట్టారు. నటన, రచన, దర్శకత్వం, నిర్మాణంలో అలుపెరుగని కృషిచేసిన శ్రీరాముల సత్యనా రాయణ 2020, ఏప్రిల్‌ 9 రోజున పరమపదించారు. ఆయన మరణం నాటకరంగానికి తీరని లోటు.

- మాడిశెట్టి గోపాల్‌


logo