గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Apr 08, 2020 , 22:12:02

వుహాన్‌ విజయం

వుహాన్‌ విజయం

మృత్యువు కోరల్లో చిక్కి విలవిలలాడిన వుహాన్‌ నగరం 76 రోజుల లాక్‌డౌన్‌ తరువాత మళ్ళీ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నది! కొద్ది రోజులుగా దశలవారిగా నిర్బంధాన్ని సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం కొత్త కేసులేవీ లేకపోవడంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సుదీర్ఘ లాక్‌డౌన్‌ కాలంలో వుహాన్‌ సమాజం ఎన్నో కష్టనష్టాలకోర్చి నిబ్బరంగా నిలిచింది. సుమారు 50 వేల మంది వ్యాధిగ్రస్తులు కాగా, రెండున్నవేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. లాక్‌డౌన్‌ మధ్యలో, మార్చి పదవ తేదీ నాడు దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ వుహాన్‌ వచ్చి ప్రజల ధీరత్వాన్ని ప్రశంసించి మనోబలాన్ని ఇవ్వవలసి వచ్చింది. వుహాన్‌ నుంచి వ్యాపించిన వైరస్‌ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటిన్నర మందికి సోకింది. దాదాపు ఎనభై వేల మంది ప్రాణాలను హరించింది. ఈ విషాదఘట్టంలో వైరస్‌పై వుహాన్‌ సమాజం సాధించిన విజయాన్ని కీర్తించడం సబబుగా తోచకపోవచ్చు. కానీ వుహాన్‌ గెలుపు, వైరస్‌పై మనం సాగిస్తున్న పోరాటానికి స్ఫూర్తినిస్తుంది. ఈ వైరస్‌ను జయించడం సాధ్యమేననే ధైర్యాన్ని కలిగిస్తున్నది. 

కరోనా వైరస్‌ పుట్టుకకు, వ్యాప్తికి కారకులెవరనేది తరువాత తేల్చుకోవచ్చు. దేశాల మధ్య విభేదాలకు సమయం కాదిది. ఇప్పుడు కరోనా వైరస్‌ కట్టడికి చైనా అనుసరించిన మార్గాలేమిటి అనేది తెలుసుకోవడమే ప్రధానం. వుహాన్‌లో ఆ తరువాత హుబెయి రాష్ట్రంలోని ఇతర నగరాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆర్థిక, సామాజిక కోణాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కోటీ పది లక్షల జనాభా గల వుహాన్‌ నగరం రవాణా మార్గాలకు కూడలిగా, చైనా దేశపు షికాగో నగరంగా ప్రసిద్ధికెక్కింది. అక్కడ విధించిన లాక్‌డౌన్‌ ఆర్థికంగా నగరానికే కాదు, దేశానికీ ఇబ్బందికరం. అయినా రోజుకు వేలాది మందిని వైరస్‌ కమ్ముకుంటున్న తరుణంలో చైనా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదు. ఇప్పుడు కరోనా కట్టడికి లాక్‌డౌనే తగిన విధానమని ధ్రువపడ్డది. ఈ ప్రయోగాన్నే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అనుసరిస్తున్నాయి. 

వుహాన్‌ నగరం మృత్యువు కోరల్లో చిక్కిన నాటితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులమనే భావించవచ్చు. ఆనాడు ఆ వ్యాధి ఏమిటో, కారకమేమిటో, చికిత్స ఏ విధంగానో తెలియని అయోమయం. ఇప్పటికల్లా మనం వివిధ దేశాల అనుభవాలను చూడగలిగాం. మనకు వైరస్‌ జన్మ రహస్యమూ తెలుసు, మరణ రహస్యమూ తెలుసు. శత్రువును తుదముట్టించే గెలుపు వ్యూహమూ తెలుసు. మనం అన్ని హంగులూ సమకూర్చుకొని సర్వ సన్నద్ధమై ఉన్నాం. ఈ లాక్‌డౌన్‌ ఎంతకాలం ఉంటుంది, ఈలోగా వైరస్‌ ఎన్ని ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుంది అనే భయసందేహాలు పెట్టుకోవద్దు. ఇది భయపడవలసిన సందర్భం కాదు, జాగ్రత్త పడవలసిన సందర్భం. వుహాన్‌ అనుభవం నుంచి మనం నేర్చుకోవలసిన ప్రధానాంశం-కష్టాలు ఎప్పటికీ ఉండవు. మృత్యువుదే ఎప్పటికీ పైచేయి కాదు. తలుపు తట్టిన శత్రువు తలవంచి నిష్క్రమించే రోజు తప్పక వస్తుంది. అప్పటి వరకు నిబ్బరంగా ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనలను సరిహద్దులో ప్రాణాలు ఒడ్డి నిలబడమనడం లేదు. కొండలు పగుల గొట్టమనడం లేదు. ఇంటిపట్టున ఉల్లాసంగా ఉండమంటున్నారు. ఈ సూచనను పాటిస్తే చాలు. మనం బతికి బయటపడతాం.


logo