శనివారం 30 మే 2020
Editorial - Apr 07, 2020 , 23:24:54

ఔషధమూ, ఆయుధమూ!

ఔషధమూ, ఆయుధమూ!

కరోనా వైరస్‌ సోకిన వారి చికిత్సకు ఉపయుక్తమని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధ ఎగుమతులపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయాలన్న భారత్‌ నిర్ణయంతో పలు దేశాలు ఊరట చెందే అవకాశం ఉన్నది. కరోనా వైరస్‌ భీతిగొలుపుతున్న నేపథ్యంలో మార్చి 25న ఈ మందు ఎగుమతిపై భారత్‌ నిషేధం విధించింది. అమెరికా, బ్రెజిల్‌ మాత్రమే కాకుండా సార్క్‌, పశ్చిమాసియా తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు ముప్ఫై దేశాలు ఈ నిషేధాన్ని సడలించాలని భారత్‌ను కోరాయి. మనమీదే ఆధారపడిన ఇరుగుపొరుగు దేశాలకు ఎగుమతులను నిలిపివేయకూడదని, ఇదేవిధంగా తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్న దేశాలను కూడా ఆదుకోవాలని భారత్‌ మానవతా దృక్పథంతో నిర్ణయించింది. అమెరికా పరిస్థితి దారుణంగా ఉందనేది తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ ఎలాగూ దయతలచి నిషేధాన్ని సడలించేదే. కానీ ఈలోగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిషేధాన్ని ఎత్తివేయకపోతే ప్రతిచర్య తప్పదని పెళుసుగా మాట్లాడకపోవలసింది. అమెరికా వాణిజ్య ఆంక్షలకు భారత్‌ దీటుగా స్పందించి ఎంతోకాలం కాలేదు. ఈ అనుభవం ఉండి కూడా, అదీ కష్టకాలంలో, మిత్ర దేశంతో ఇంత దురుసుతనం పనికిరాదు.

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఉత్పత్తిలో మనదేశానిదే అగ్రస్థానం. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఆరోగ్య కార్యకర్తలు వ్యాధి నిరోధకంగా ఉపయోగించవచ్చునని భారతీయ వైద్య పరిశోధనా మండలి సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మందుపై పరిశోధనలు సాగుతున్నాయి. కోవిడ్‌-19 రోగులు సత్వరంగా కోలుకోవడానికి ఈ మందు దోహదపడిందని చైనా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఫ్రాన్స్‌లో ఈ మందుపై ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయి. యూరప్‌లో కూడా కరోనా రోగుల చికిత్సలో భాగంగా దీనిని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ దీనిపై ఇంకా పరిశోధనలు సాగించవలసి ఉన్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వైరస్‌ నాశినిగా కనుక ఈ మందు ధ్రువపడితే సంచలనాత్మకమవుతుంది. అందుకే ఈ మందును అమెరికాలో కోవిడ్‌-19 రోగులకు విస్తృతంగా వాడి చూడాలని, ఇది ‘గేమ్‌ చేంజర్‌' అవుతుందని దేశాధ్యక్షుడు ట్రంప్‌ అంటున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతి విషయంలో భారత్‌ ఆచితూచి వ్యవహరించడంలో తప్పేమీ లేదు.

కరోనా వైరస్‌ కథ ముగిసిన తర్వాత అంతర్జాతీయ రంగంలో ‘ఆహారం, ఔషధం’ కీలకమైన ఆయుధాలుగా మారుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే కెనడాకు, లాటిన్‌ అమెరికాకు వైద్య పరికరాలను ఎగుమతి చేయకుండా కొరియన్‌ యుద్ధకాలపు చట్టాన్ని అమెరికా ముందుకుతెచ్చింది. జర్మనీకి మాస్క్‌లను తీసుకుపోతున్న విమానాన్ని మధ్యలోనే వెనుకకు పిలిపించుకున్నది. యురోపియన్‌ దేశాలు ఔషధ, వైద్యపరికరాల ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడే మన బలాబలాలు గుర్తింపునకు నోచుకుంటాయి. కరోనా మహమ్మారి చెలరేగుతున్న నేపథ్యమే ‘ప్రపంచ ఔషధాలయం’గా భారత్‌ ప్రాముఖ్యాన్ని ముందుకుతెచ్చింది. 1960 దశకం నుంచి అనుసరించిన విధానాల వల్ల భారత్‌ ఔషధ ఉత్పత్తిలో అగ్రశ్రేణి దేశంగా నిలిచింది. దేశంలోని ఔషధ కేంద్రాలలో మన హైదరాబాద్‌ కూడా ఒకటి. ప్రపంచానికి చౌకగా జనరిక్‌ మందులను సరఫరా చేసే దేశం మనది. ఈ స్థానాన్ని కాపాడుకోవడం భవిష్యత్తులో మరింత అవసరం.  


logo