బుధవారం 03 జూన్ 2020
Editorial - Apr 07, 2020 , 23:23:07

అబద్ధాలు రాజేసిన విద్వేషాలు

అబద్ధాలు రాజేసిన విద్వేషాలు

మనం ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్లను ఎన్నటికీ అర్థం చేసుకోం. ఆ ప్రయత్నం అసలు చేయలేం.ఆ అవివేకతే జాతి వైషమ్యాలకు మూలస్తంభమవుతుందని అమెరికా రచయిత జేమ్స్‌ రసెల్‌ ఓవెల్‌ అంటాడు. ద్వేషం బయటికి కనిపించని రక్కసి. మనసుల్లో గూడుకట్టుకొని మనుషుల మధ్య విభజ న రేఖ గీస్తుంది. చిచ్చురేపి సంఘర్షణలకు ఆజ్యం పోస్తుంది. కొన్నిసార్లు ఆ ద్వేషాలకు బలమైన కారణాలేవీ ఉండవు. ఎవరివో వ్యాఖ్యలను ఏ హేతువూ లేకుండా విజ్ఞులు కూడా నిజమేనని నమ్మి వాటిని వ్యాప్తి చేయడం సమాజంలో నేడు చోటుచేసుకుంటున్న దురదృష్టకర పరిణామం.

కరోనా విషక్రిమి ప్రకటించిన యుద్ధానికి విశ్వ జీవన గమనమంతా ఒక్కసారిగా స్థాణు వై అన్నిదేశాల్లోనూ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా కరోనా క్రిమి ముందు సాగిలపడింది. ఎలా బయటపడాలో తెలియక దిక్కుతోచక దిక్కులు చూస్తున్నది. ప్రపంచమంతా ప్రాణభీతితో అల్లాడిపోతున్నది. ఇంతటి కష్టకాలం లో వైరస్‌తో సమాంతరంగా అబద్ధాలూ రాజ్యమేలుతున్నాయి. మనసులను కలుషి తం చేసి విద్వేషాన్ని తోడి కరోనా కన్నా వేగం గా విస్తరింపజేస్తున్నాయి. ఈ అబద్ధమనే వైర స్‌ ధాటికి అందరికన్నా ఎక్కువగా నష్టపోతున్నది ముస్లింలు.

సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఎవరికై నా ఏ అంశంపైనైనా స్వేచ్ఛగా వ్యాఖ్యానించే అవకాశం లభించింది. కానీ చాలా మటుకు వ్యాఖ్యల్లో వాస్తవాల రూఢీ, విచక్షణ లోపించడంతో అవి కాస్తా ద్వేష వ్యాఖ్యలుగా మారుతున్నాయి. అన్నింటికన్నా ఎక్కువగా వ్యాప్తి చెందిన అబద్ధాలను ఓసారి పరిశీలిద్దాం. కరోనాను వ్యాప్తి చేసేందుకు ఓ వ్యక్తి పోలీసు వ్యానులో పోలీసులపై ఉమ్మేశాడనేది బాగా ప్రచారమైన పెద్ద అబద్ధం. వాస్తవానికి మార్చి 2న ముంబైలో జరిగిన ఘటన అది. జైల్లో ఉన్న తనకు కుటుంబసభ్యులు తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించలేదని ఓ ఖైదీ పోలీసులతో గొడవ పడుతున్న దృశ్యాన్ని వార్తగా ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ అదేరోజు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. అప్పటికి కరోనా నియంత్రణకు భారతదేశం తీసుకుంటున్న చర్యలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. 

ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆ వీడియో అప్‌లోడ్‌ తేదీ, నేపథ్యం అన్నీ ఆ లింకు కిందే స్పష్టంగా ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పేర్కొన్నప్పటికీ అదే వీడియో కింద ఇప్పటికీ ద్వేషపూరితమైన వ్యాఖ్యలు వరదలా ప్రవహిస్తూనే ఉన్నా యి. మర్కజ్‌ నుంచి వచ్చినవారే అలా ఉమ్మేస్తున్నారని ఆ లింకు కింద కామెంట్లు వస్తూనే ఉండటం వారి అజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటిదే మరొకటి. గట్టిగా తుమ్మేలా, చీదేలా ఓ మసీదులో అభ్యసన చేయిస్తూ వైర స్‌ వ్యాప్తికి శిక్షణ ఇస్తున్నారని ఎవరో ఫేస్‌బుక్‌ లో పోస్టు పెట్టారు. తీరా దాని మూలాలు శోధి స్తే అది జనవరి నెలాఖరులో పాకిస్థాన్‌లోని సూఫీ మతస్థులు కొందరు తమ ఆచారాలను అనుసరించి చేస్తున్న ప్రార్థనకు సంబంధించిన వీడియో అని తేలింది. 

కంటికి కనిపించే ప్రతి దృశ్యం వెనుక ఓ నేపథ్యం, చరిత్ర ఉంటుంద న్న వాస్తవాన్ని తెలుసుకోకుండా తొందరపాటుగా విషాన్ని వెదజల్లారు. ఇస్లాంకు చెందిన షియా బోహ్రాలు ఒకే కంచంలో కలిసి తింటా రు. భగవంతుడిచ్చిన ఏ ఒక్క మెతుకూ వృథా గా వదిలేయకూడదని వాళ్ల ఆచారం బోధిస్తుం ది. 2018 జూలై కంటే ముందునాటి అటువం టి వీడియోను ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెట్టి కరోనాను వ్యాప్తి చేయిస్తున్నారనే ద్వేషం వెదజల్లారు. ఎంత అసమంజసం. 2019 డిసెంబర్‌లో నిజాముద్దీన్‌లో ప్రార్థన సమయంలో చేతులు కడుక్కొంటున్న వీడియోను ఇప్పుడు మళ్లీ వైరల్‌ చేసి వైరస్‌ వ్యాప్తికి కారణమంటూ విద్వేషాలను బలంగా నాటగలిగా రు. ఇలాంటివే మరికొన్ని వీడియోలపైన పనికట్టుకొని దుష్ప్రచారం చేశారు.

సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఎవరికైనా ఏ అంశంపైనైనా స్వేచ్ఛగా వ్యాఖ్యానించే అవకాశం లభించింది. కానీ చాలామటుకు వ్యాఖ్యల్లో వాస్తవాల రూఢీ, విచక్షణ లోపించడంతో అవి కాస్తా ద్వేష వ్యాఖ్యలుగా మారుతున్నాయి. 

పైన చెప్పిన వీడియోల మూలాలను శోధిం చి అవి అబద్ధమని నిగ్గుతేల్చిన నిజ నిర్ధారణ వేదిక ‘తెలంగాణ ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్‌' నిర్వాహ కులు అభినందనీయులు.  ఈ సమయం లో https://factcheck.telangana.gov. in వాళ్లు చేస్తున్న కృషి అసామాన్యం. ఎవ్వరికైనా సరే ఏ వీడియోనైనా అనుమానాస్పదం గా తోస్తే వెంటనే ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించండి. ఏది రియలో.. ఏది వైరలో.. తెలుసుకోండి. చైనాలోని వూహాన్‌లో జన్మించిన కరోనా వైరస్‌ విమానమెక్కి జనవరి 30న కేర ళకు చేరుకున్నది. మిగిలిన అన్నిచోట్లకూ సరిహద్దులు దాటే వైరస్‌ ప్రవేశించింది అంతే తప్ప  ఏ గుడిలోనో, ఏ గురుద్వారాలోనో, ఏ మసీదులోనో, ఏ చర్చిలోనో, ఏ జైన మందిరంలో నో పుట్టలేదు. 

చనిపోయిన తర్వాత కానీ వాళ్లకు వైరస్‌ సోకిందని తెలుసుకోలేకపోయాం. ఉద్దేశపూర్వకంగా వైరస్‌ వ్యాప్తి చెందించాలనుకునేవాళ్లు తమ కుటుంబసభ్యులకు అంటిస్తారా? అదెలా సాధ్యమవుతుందని తార్కికంగా ఆలోచిస్తే చాలా విషయాలు బోధపడుతాయి. మనకు తెలియని విషయాన్ని శోధించి, సాధించి తెలుసుకోవాలి. అంతే తప్పా దేనినైనా మూర్ఖంగా నమ్మడం తగదు. మీరు విన్న వార్తలు, మీరు చూసి న వీడియోలు నిజమని తేలితేనే మరొకరికి చెప్పడం శ్రేయస్కరం. హేతుబద్ధంగా ఆలోచించడం ఆరోగ్యదాయకం. అంతవరకు వదంతులు,  అబద్ధాలు వ్యాప్తి చెందకుండా సంయమనం పాటిస్తే ఈ కష్టకాలంలో అంతకుమించిన సాయమేమీ అవసరం లేదు. ఎందుకంటే కరోనా వైరస్‌ తెచ్చే నష్టాల నుంచి శ్రమించి బయటపడవ చ్చు. కానీ ఈ అబద్ధాలు రాజేసే విద్వేషపు మంటలను చల్లార్చడం సులువైన విషయం కాదు. ద్వేషించడం కూడా ఓ వైరస్‌ అని మరిచిపోవద్దు.


logo