గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Apr 07, 2020 , 23:19:21

కరోనాపై కలం కవాతు

కరోనాపై కలం కవాతు

విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు, యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నప్పుడు ప్రజాసమూహాలకు ధైర్యాన్ని ఆత్మస్థయిర్యాన్ని ఇచ్చే శక్తి సాహిత్యానికి ఉన్నది. కరోనా లాంటి భూతమొకటి జడలు విప్పుకొని దేశదేశాల మీద దాడిచేస్తున్న సందర్భంలో మృత్యుఘంటిక లు మోగిస్తున్నప్పుడు ప్రజలకు మనోధైర్యాన్ని కలుగజేసి ఆ రక్కసిపై పోరాడేందుకు కవులు, రచయితలు, కళాకారులు సాహిత్య సృష్టి చేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

కవిత్వం ఏమైనా కరోనాను చంపేస్తుందా? అని అడ్డగోలు ప్రశ్నలు వేసినవాళ్లు ఉండవచ్చు. కానీ ప్రతి ప్రజా ఉద్యమానికి నైతిక బలాన్నిచ్చి ముందుకు నడిపించి గెలిపించగల విస్తృతిని సాహిత్యం సృష్టిస్తుంది. దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమగెలుపు వరకూ సాహిత్యం నిర్వ హించిన పాత్ర తక్కువేం కాదు. తెలంగాణ సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్‌ ‘ధూం ధాం’ కళారూపాల ద్వారా ఉద్యమభేరి మోగించేవిధంగా సాహిత్యరంగాన్ని మలిచారు. మహా సంకల్పా లు నెరవేరేందుకు సాహిత్యం ఎంత పదునైన ఆయుధమో బాగా తెలిసిన వ్యక్తి కేసీఆర్‌. అందుకే కరోనా వల్ల ప్రపంచానికి జరిగే నష్టాన్ని తెలియజేస్తూ ప్రజలందరూ స్వీయ నియంత్రణతో ముందుకువచ్చేందు కు కలాలను పదునుపెట్టాలని కోరుతున్నారు.

కేసీఆర్‌ కవి కాబట్టే ఆయనకు సాహిత్యం లోతు  తెలుసు. మందులేని వైరస్‌కు మందు వ్యక్తి స్వీయనియంత్రణ, సామాజిక దూరం అయిన సమయంలో ప్రజలను మరింత చైతన్యవంతులను చేస్తూ వారిలో ధైర్యం నూరిపోసేందుకు కవులు రచయితలు కవిత లు, పాటలు రాయాలి. ఆ బాధ్యతను తెలుగు కవులు సమర్థంగా చేయగలరని కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆయన కవులారా, సాహితీవేత్తల్లారా కలాలతో కదలండని పిలుపునిచ్చారు.

వరదలు, విపత్తులు, సునామీలు, భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు దేశ చరిత్రలో తీవ్ర నష్టాన్ని కలుగజేశాయి. ప్రాణ నష్టాన్ని కలిగించి భయోత్పాతానికి గురిచేశాయి. 1769, 1770, 1773లలో వచ్చిన బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా కరువులు 10 మిలియన్ల మందిని మింగేశాయి. 1839లో వచ్చిన కోరింగ తుఫాను దేశాన్ని కదిలించిన 10 విపత్తులలో ఒకటి గా మిగిలింది. వేల మందిని బలితీసుకున్నది. 1896 లో వచ్చిన ప్లేగు వ్యాధితో భారత్‌, చైనాలో 12 మిలియన్లకు పైగా ప్రజలు చనిపోయారు. బొంబాయి, కలకత్తా వంటి ఓడరేవు నగరాల్లో మొదలైన ప్లేగువ్యాధి దేశంలోని గ్రామాల దాకా వ్యాపించింది. 2004లో హిందూ మహాసముద్రంలో లేచిన సునా మి 14 దేశాల్లో అల్లకల్లోలం సృష్టించి 2,30,0 00 మందిని బలి తీసుకున్నది. దేశాన్ని కుదిపివేసిన ప్రతి సందర్భంలో సాహిత్యం వచ్చింది.

ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా మృత్యు ఘోషతో భయపెడుతున్నది. ఈ సందర్భంలో ప్రజలందర్నీ కాపాడుకునేందుకు, కరోనా నుంచి విశ్వాన్ని బయటపడేసేందుకు ప్రజాసమూహాల సంకల్పాలకు మద్దతుగా కవిత్వం రాయవలసి ఉన్నది. మనకున్న సమస్త కళలు సాహిత్యం ప్రజల కోసం సృష్టించబడి అది ప్రజల కోసం ఉపయోగపడాలన్న దిశగా రచయితలు కదులాలి. ధైర్యానికి ప్రాణంపోయాలి. సమాజాన్ని కదిలించి నడిపించాలి. కాబట్టి ప్రతి రచయిత ఈ విషక్రిమిపై తన కలంతో యుద్ధం చేయాలి.

దివిసీమ ఉప్పెన సమయంలో నగ్నముని ‘కొయ్యగుర్రం’ ప్రభుత్వ నిష్క్రియా పర్వత్వాన్ని తెలియజేసింది. విఫలమైన నాటి ప్రభుత్వ విధానాలను ఎండగట్టింది. కరోనా లాంటి విపత్తు సమయంలో ఎంత చైతన్యవంతంగా ఆలోచించాలో చాటిచెపుతూ ‘చైతన్య అశ్వం’గా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఉరికిస్తున్నారు. పనిచేసే క్రియాకావ్యంగా కేసీఆర్‌ పని చేస్తున్నారు. ఈ కోణంలోనే కరోనాను తరిమికొట్టేందుకు కవుల ను, రచయితలను రాయమని కోరుతున్నారు.

గుజరాత్‌ లాతూర్‌లో భూకంపం వచ్చినప్పుడు నిరాశ్రయులైన వారికి అండగా సాహిత్యం వచ్చింది. సునామీలు ఉప్పొంగినప్పుడు ఎన్నో రాష్ర్టాలు అతలాకుతలమయ్యాయి. తుఫానుల తాకిడి సందర్భం గా ‘తలవంచిన వరికంకులుగా’ సంపాదకీయ సం ఘీభావ దండలుగా సతీష్‌చందర్‌ అక్షరాల రాతబడి చేశారు. సునామీల మీద ఎంతో సాహిత్యం వచ్చింది. కరోనా పేరుతో సూక్ష్మ క్రిమి సృష్టిస్తున్న సునామి ఇది.

ప్రజలకు మనోధైర్యం, మానసిక వికాసం కలిగించేందుకు సాహిత్యాన్ని ఆయుధంగా మార్చి ప్రజలకు ధైర్యం కలిగించాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినాఎలా గెలుచుకుంటూ పోయి గెలిచి వచ్చాడో, అదేవిధంగా కరోనా విషయంలోనూ మరో యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సాహిత్యసాంస్కృతికరంగాన్ని కూడా వైద్యంలా కేసీఆర్‌ అందిస్తున్నా డు. దూరదృష్టి దార్శనికత ఉన్న నాయకుడు కేసీఆర్‌ మనల్ని అందర్నీ నెల రోజులు జాగ్రత్తగా ఉండమని కోరుతున్నారు. ప్రతి ఒక్కరం స్వీయ నియంత్రణలోకి వెళ్లి  కలం కవాతులతో కరోనాపై గెలుద్దాం.


logo