శనివారం 30 మే 2020
Editorial - Apr 07, 2020 , 00:42:53

తల్లికోడి పిల్లల్ని కాపాడుకున్నట్టు!

తల్లికోడి పిల్లల్ని కాపాడుకున్నట్టు!

కరోనా యుద్ధ సమయంలో ఒక కథ యాదికొచ్చింది. రాజస్థాన్‌లోని రతన్‌పూర్‌ కోట. చాలా పెద్దది. కోటలో ఉన్న సైన్యం మాత్రం తక్కువే. ఓ రాత్రి పూట కోట పైకి హఠాత్తుగా శత్రువులు దాడి చేశారు. రాజు సైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధానికి దిగాడు. రాజు వెంట సైన్యాధ్యక్షుడున్నాడు. యుద్ధం మొదలైంది. సైన్యం ఏదని రాజు అడిగారు. మనకంటే ముందే వెళ్లి యుద్ధం చేస్తున్నారని సైన్యం పోరాటం గురించి గొప్పగా చెప్పాడు సైన్యాధ్యక్షుడు. రాజుకు ధైర్యం వచ్చింది. యుద్ధరంగంలో వీరవిహారం చేశాడు. తెల్లవారింది. శత్రుసైన్యం పారిపోయింది.

రాజు విజయగర్వంతో తిరిగివచ్చి మన సైన్యం ఎక్కడున్నారని అడిగాడు. వారు రాత్రికి రాత్రే యుద్ధం మొదలు కాకముందే భయంతో పారిపోయారని నిన్న అదే విష యం చెబితే ఈ రోజు ఈ విజయం వచ్చేదికా దని సైన్యాధ్యక్షుడు చెప్పాడు. ఎప్పుడో విన్న కథ ఇది. ఈ కరోనా సమయంలో గుర్తుకు వచ్చింది. కథ చిన్నదే కావచ్చు, కానీ ఇది చెప్పిన పాఠం ఎంతో పెద్దది. దీన్ని మనం ఇప్పటికి అన్వయించుకుంటే ఇందులో కోట మీద దాడిచేసిన శత్రువు కరోనా అయితే పోరాడే రాజు తెలంగాణ జనం. కష్టకాలంలో వాళ్లకు ధైర్యం నింపి సమయస్ఫూర్తితో ముం దుకు నడిపిన సర్వ సైన్యాధ్యక్షుడు కేసీఆర్‌.

రెండు నెలల కింద అనుకుంటాను ఒక వీడియో చూశాను. అందులో ఒక విలేకరి ఒక రైతును కరోనా వస్తే ఏం చేస్తావని అడుగుతున్నాడు. ఆ రైతు ఎంతో భరోసాగా మా కేసీఆర్‌ దాన్ని రానియ్యడు  అంటున్నాడు. అది ఆగది వైరస్‌ కదా అని విలేకరి అంటే రైతు భయపడకుండా కేసీఆర్‌ ఏదో ఒకటి చేస్తడు. ఏదో అడ్డం పెట్టి రాకుండా చేస్తడు అని ధీమాగా చెబుతున్నాడు. ఆ వీడియో చూస్తుంటే నవ్వుకుంటాం గానీ అమాయకమైన రైతు ముఖంలోని నమ్మకాన్ని అంతకుమించి ఒక భరోసా చూసినంక ఒక నాయకునిపై జనానికి ఉన్న నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపోతాం. అలా జనం నమ్మకాన్ని పొందడానికి  ఏ నాయకునికైనా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి, ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంటే కానీ సాధ్యం కాదు. ఇది ఒక్క రైతు నమ్మకం కాదు. ప్రపం చాన్ని వణికిస్తున్న కరోనాపై కేసీఆర్‌ వ్యూహం, చిత్తశుద్ధి అంతకుమించి ప్రజలను రక్షించుకోవాలనే ఒక ఆరాటం చూశాక యావత్‌ తెలంగాణ ప్రజలకు నమ్మకంగా మారింది. అంతకుముందు అవగాహన లేక భయంభయంగా ఉన్న జనానికి ఆయన మాటలు విన్నంక బతుకు మీద ఆశ పుట్టింది.

జనతా బంద్‌ రోజు నుంచి నేను ఇంట్లో కూచుండి  ఒక పని చేస్తున్నాను. చాలామంది గ్రామస్థులతో ఫోన్లో మాట్లాడుతున్నాను. వారికి తోచిన సహాయం చేస్తూ ఏ వార్త నిజ మో, ఏ వార్త అబద్ధమో చెబుతూ వాట్సప్‌ గ్రూప్‌లు రెండు పెట్టి సమాచారం ఇస్తూ ధైర్యం చెబుతున్నాను. వాళ్లంతా సిరిసిల్ల జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన మా బడి పిల్లల పేరెంట్స్‌. అందరూ రైతులు, కూలీలు, వలస కార్మికులే. అమాయకపు జనం  ఫోన్‌ చేసిన ప్రతిసారి కూలీ దొరుకకపోవడం గురించి, రాబోయే వరి పంట గురించి, పడిపోయిన చికె న్‌ ధర గురించి, నిత్యావస ర సరుకుల గురించి భయంభయంగా అడిగే వారు. చివరగా మనం బతుకుతమంటరా సార్‌ అనేవారు. నేను ఏదో  ధైర్యం చెప్పేవాన్ని. పొద్దున, మాపున ఫోన్‌ చేసేవాడిని. ఎంత చెప్పినా వారిలో ఇసుమం త ధైర్యాన్ని కూడా నింపలేకపోయాను. కానీ ఒక్కసారిగా వారిలో మార్పు వచ్చింది.

కేసీఆర్‌ మాటలు టీవీలో విన్నంక రైతులకు, కూలీలకు ఎంతో భరోసా వచ్చింది. ఇప్పుడు వారికి పంట మీద దిగులు లేదు. నిత్యావసర సరుకుల రంది లేదు. బతుకుదెరువు కోసం పోయిన బంధువుల గురించి రంది లేదు. అదీ ఒక నాయకుడు ప్రజలకు ఇవ్వాల్సిన ధైర్యం. ఇప్పుడు చేయాల్సింది, చేసేది ఒక్క యుద్ధమే కాదు. ప్రజలకు కొంత నమ్మకం కూడా ఇవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే చావు బతుకులు ఎవరి చేతుల్లో లేవు. ఎవరు, ఎలా, ఎప్పుడు చస్తారో తెలియదు. కానీ, చచ్చేవరకైనా పోరాట పఠిమను, స్ఫూర్తిని నింపడం, ముందు నడువడం, వ్యూహాలు రచించడం  నాయకుని లక్షణం. అదే పని కేసీఆర్‌ చేశారు. చేస్తున్నారు కూడా.

వలస కూలీల ఆకలి నుంచి వాట్సప్‌ గ్రూపు ల అసత్య ప్రచారం దాక, రైతులు పండించే పంటల నుంచి, పోషకాహార వంటలదాక అం దరినీ మోటివేట్‌ చేయడం, ఎడ్యుకేట్‌ చేయ డం, స్ఫూర్తినివ్వడం ఆయనొక్కడికే సాధ్యం. అందుకే అనిపిస్తుంది తెల్లచొక్కా వేసుకున్న ప్రతొక్కరు నాయకులు కాదు. కుల్లంకుల్లా మాట్లాడి ప్రజలను కూడగొట్టినవారే నాయకులని. ఇంతటి కష్టకాలంలో ఒక్కమాటతో రైతు ల పంట భయమే కాదు.. ప్రజల కరోనా భయాన్ని, వలస కూలీల ప్రాణ భయాన్ని  కూడా పోగొట్టిన కేసీఆర్‌కు నిజంగా హాట్సఫ్‌. ఇది కదా ఆపత్కాలంలో ఓ నాయకుడు చేయాల్సిన పని. అందుకే తను ఒక నాయకుడు మాత్రమే కాదు, మట్టిని, మొరాన్ని తవ్వి పిల్లలకు నాలుగు గింజలను ఏరిపోసి ఎక్కడినుంచి ఏ ఆపద వస్తుందో అని కావలి కాస్తూ  పిల్లలను  రెప్పల కింద దాచుకొ ని పిల్లుల నుంచి, గద్దల నుంచి కాపాడుకునే ఓ తల్లి కోడి.


logo