ఆదివారం 07 జూన్ 2020
Editorial - Apr 04, 2020 , 23:13:44

లాక్‌ డౌన్‌ వేళ.. షట్‌ సూత్రావళి

లాక్‌ డౌన్‌ వేళ.. షట్‌ సూత్రావళి

కోవిడ్‌ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సకాండకు యావత్‌ ప్రపంచం స్తంభించింది. మానవాళి చిగురుటాకులా వణుకుతున్నది. ప్రపంచ యుద్ధాల సమయంలో కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన భయ భుజంగం ఇప్పడు దాదాపు అన్ని దేశాల్లో అన్ని కుటుంబాలను చుట్టుముట్టి బంధించి బుసలు కొడుతున్నది. ఇది అంతర్జాతీయ విషాదం. ఇప్పుడు ప్రతి మనిషీ ఒక విశ్వమానవుడు. ఇంతటి గడ్డుకాలంలో ప్రతి వ్యక్తి ఎంతో బాధ్యతతో మెలగాలి. లేకపోతే కోవిడ్‌ సృష్టించిన దానికన్నా ఎక్కువ భయంకరమైన విపత్తును సమీప భవిష్యత్తులో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అసాధారణ విపత్కర కాలంలో ప్రశాంతతను, శాంతి సామరస్యాలను కాపాడుకునేందుకు, వసుధైక కుటుంబ భావనను పరిరక్షించుకునేందుకు, ఐకమత్యాన్ని చాటుకునేందుకు మనం నడుం కట్టాలి.

ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా వ్యక్తిగత బాధ్యత, క్రమశిక్షణను పాటిస్తూ, సామాజిక కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిం చాలి. అందుకు మనం కొన్ని సూత్రాలను అనివార్యంగా పాటించాలి. అవి..

1) మతానికి అతీతంగా మెలగాలి:

వైరస్‌ వల్ల ఎవరెప్పుడు ఆసుపత్రి పాలవుతారో, ప్రాణాలకేమి ముప్పువస్తుందో తెలియని విషమ పరిస్థితుల్లో మతం ఒక చర్చకు, రచ్చకు దారితీయడం దురదృష్టకరం. మార్చి రెండో వారంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారికి కోవిడ్‌ సోకడం, అక్కడికి వచ్చిన పలువురు విదేశీయులు దేశంలోని వివిధ రాష్ర్టాల్లో పర్యటించి వ్యాధి వ్యాప్తికి కారణం కావడంతో ఈ వ్యవహారం మతం రంగు పులుముకుంది. కొందరు మతపరమైన ఉద్వేగాలను రెచ్చగొట్టడానికి మీడియాలో నానా రాద్ధాంతం చేస్తున్నారు. కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక  మతం తరఫున వకాల్తా పుచ్చుకుని ఈ అంశాన్ని బూతద్దంలో చూపుతుండగా, మరికొందరు ఒక వర్గంలో ప్రాబల్యం పెంచుకోవాలన్న ఉబలాటంతో  ప్రతివాదనలకు దిగి ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు.

ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారు కూడా పిడివాదనలు చేయకుండా, ప్రభుత్వ యంత్రాంగానికి బేషరతుగా సహకరించాలి. ఒకవేళ ఈ వ్యవహారంలో ఎవరైనా దోషులని తేలితే, వారిని మతనేపథ్యంతో నిమిత్తం లేకుండా చర్యలు తీసుకోవలసిందే. ఇదే తప్పు ఇతర మతస్తులు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో వారికీ అదే శిక్ష పడేలా నిష్పక్షపాతంగా చూడాలి. అటువంటి చట్టబద్ధ చర్యలను, న్యాయస్థానాల తీర్పును అన్ని మతాల వారూ గౌరవించవలసిందే. 

ఆయా మతాలలోని కొందరు వ్యక్తుల వల్లనే సమస్య జఠిలమవుతోంది. ఈ విపత్తు నుంచి మరొక ఉత్పాతాన్ని తలమీదకు తెచ్చుకోకుండా ఇప్పటికే తలనొప్పిగా ఉన్న మత విభేదాలను రెచ్చగొట్టడం తక్షణమే ఆపాలి. కరోనా సృష్టించిన బీభత్సం నుంచి కలివిడిగా కోలుకొని జయకేతనం ఎగరవేయడం మాత్రమే ఏకసూత్ర కార్యక్రమం కావాలి.  ఈ తరుణంలో వివిధ మతావలంబకులు అందరూ దేశభక్తితో చేయాల్సింది- సంయమనం పాటించడం.

2) వైద్య సిబ్బందిపై దాడులు తగదు:

మొన్నీ మధ్యనే... వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి చేస్తున్న సేవకుగానూ చప్పట్లతో ఆనందం వెలిబుచ్చాం. ఇంతలో దాడులకు దిగుతున్నాం. హైదరాబాద్‌ లో, మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో ఇలాంటి దాడులు జరిగాయి. ఇవి వైద్య సిబ్బందిలో అభద్రతను సృష్టించి, సేవలకు అంతరాయం కలిగించాయి. వైరస్‌ సోకే అవకాశం ఉన్నా, వైద్యులు, సిబ్బంది మరో ఆలోచన లేకుండా ఎంతో కష్టపడి సేవలు అందిస్తున్నారు. అంతా ఇళ్లకు పరిమితమై కుటుంబాలతో గడుపుతుంటే వీరు ప్రమాద పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారికి సమాజమంతా రుణపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు వైద్యులు, నర్సులు కోవిడ్‌ వల్ల ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళ లాంటి వీరిపై దాడులు చేయడం, వారు అద్దెకుంటున్న ఇళ్ళు ఖాళీ చేయాలని పట్టుబట్టడం, వారిని అంటరానివారిగా చూడడం అమానుషం.

3) కుటుంబాల వెలి ఆగాలి:

చదువుకోని వారితో పాటు చదువుకున్న వాళ్ళూ విచిత్రంగా ప్రవర్తించే సమయమిది. కరోనా సోకగానే సదరు వ్యక్తి కుటుంబాన్ని సాంఘికంగా వెలి వేయడం జరుగుతోంది. వైరస్‌ సోకి ఆసుపత్రి పాలైన కుటుంబ సభ్యుడి పరిస్థితి ఏమిటోనన్న తీవ్ర మనోవేదనతో ఉన్న కుటుంబానికి ఇది పెద్ద విఘాతంలా మారింది. సింగపూర్‌ లాంటి దేశాల్లోనూ కోవిడ్‌ వైరస్‌ సోకినవారి పిల్లలను తోటి విద్యార్థులు అవహేళన చేసి అవమానించినట్లు వార్తలు వచ్చాయి.

సోషల్‌ డిస్టెన్స్‌ అంటే మనిషికి మనిషికి మధ్య క్రిమి సోకని దూరంలో ఉండాలన్న ముందుజాగ్రత్త చర్యేగానీ తోటివారిని సంఘ బహిష్కరణ చేయాలని కాదు. కోవిడ్‌ బాధితులున్న కుటుంబాలకు సానుభూతితో అండగా ఉండాల్సిన సమయమిది. ఇది విధివశాత్తూ సోకుతున్న వ్యాధే తప్ప వ్యక్తుల స్వయంకృతాపరాధం వల్ల వస్తున్నది కాదు. 

విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వ అధికారులకు తమ రాక గురించి తెలియజేయకపోవడం, స్వీయ గృహ నిర్బంధంలో ఉండకపోవడం తప్పుపట్టాల్సిన అంశాలు గానీ, తెలియక ఎవర్నో తాకడం వల్ల వైరస్‌ సోకిన వ్యక్తిని, అతని కుటుంబ సభ్యులను పురుగులను చూసినట్లు చూసి వారి మానసిక స్థైర్యం, గుండె నిబ్బరం దెబ్బతీయకూడదు.

వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధిస్తే... దాన్ని పాటించకుండా ఉల్లంఘించాలనుకోవడం ప్రమాదకరం.  రోడ్ల మీదకు విచ్చలవిడిగా వెళ్ళడం వెర్రితనం కాక ఏమిటి? ఇలాంటి ఆకతాయిలను ప్రతిసారి పోలీసులు ఆపలేరు. కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్‌ ముఖ్యులు, కాలనీ ప్రముఖులు, గ్రామ పెద్దలు ఇలాంటివారిపై ఒక కన్నేసి ఉంచాలి. లాక్‌ డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించే వారికి బుద్ధిచెప్పాల్సిన బాధ్యత వీరితో పాటు ఆ ఆకతాయిల మిత్రులపైనా ఉంది. ఎక్కడివారిని అక్కడే ఆపడం ఒక్కటే ఇప్పుడు మనందరి కర్తవ్యం. 

4) సమాచార వ్యాప్తిలో అప్రమత్తత

ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్న మాట అక్షరసత్యం. సిరాతో కాకపోయినా మనం మన మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో టైపు చేసే ప్రతి అక్షరానికి ఎంతో శక్తి ఉందని గ్రహించాలి. ఒక సందేశం దాని గ్రహీతలను ఆలోచింపజేసి ప్రజాభిప్రాయంగా రూపుదిద్దుకుంటుంది. వాట్సప్‌ గ్రూపుల్లో మెసేజిలు, ఫేస్‌ బుక్‌ పోస్టులు, ట్విట్టర్‌ ట్వీట్లు, బ్లాగు రచనలు కొన్ని శక్తిమంతమైన ఉద్యమాలకు ఊపిరిలూదాయి. అరబ్‌ స్ప్రింగ్‌ రూపంలో వెల్లువెత్తిన సమాచార ఉద్ధృతికి ప్రభుత్వాలు కూలిపోయాయి. సత్యనిష్ఠ, నిష్పాక్షికత లేని సమాచారం సృష్టించే గందరగోళం, ఆందోళన అంతాయింతా కాదు. చదువుకున్న వాళ్ళు సంక్షోభ సమయంలో బాధ్యత మరిచి తప్పుడు వార్తలు సృష్టించడం, వాటిని వినోదం కోసం ప్రసారం చేయడంమంచిది కాదు. 

5) బాధ్యతారాహిత్యాన్ని అడ్డుకోండి:

వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధిస్తే... దాన్ని పాటించకుండా ఉల్లంఘించాలనుకోవడం ప్రమాదకరం.  రోడ్ల మీదకు విచ్చలవిడిగా వెళ్ళడం వెర్రితనం కాక ఏమిటి? ఇలాంటి ఆకతాయిలను ప్రతిసారి పోలీసులు ఆపలేరు. కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్‌ ముఖ్యులు, కాలనీ ప్రముఖులు, గ్రామ పెద్దలు ఇలాంటివారిపై ఒక కన్నేసి ఉంచాలి. లాక్‌ డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించే వారికి బుద్ధిచెప్పాల్సిన బాధ్యత వీరితో పాటు ఆ ఆకతాయిల మిత్రులపైనా ఉంది. ఎక్కడివారిని అక్కడే ఆపడం ఒక్కటే ఇప్పుడు మనందరి కర్తవ్యం. వాడెవడో రోడ్డు మీదకు పోతుంటే మనదేమి పోయిందని అనుకోకండి. వాడు వెళ్లి కోవిడ్‌ ను పూసుకుని వచ్చి రేపు మీకో, మీ కుటుంబసభ్యులకో అంటిస్తాడు. సంఘనీతితో మనమంతా ప్రభుత్వాధినేతలు, అధికారులకు పరిపూర్ణ సహకారం అందించాలి. ఉత్తమ పౌరులుగా మనం నిరూపించుకోవడానికి ఇంతకన్నా మంచి తరుణం దొరకదు.

6) ప్రేమ పూర్వక సంభాషణ ముఖ్యం:

కమ్యూనికేషన్‌ ప్రక్రియలో ’ఇంటర్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌' అంటే.. ఇద్దరు వ్యక్తుల మధ్య భావప్రసారం ఇప్పుడు తక్షణావసరం. మన కుటుంబ సభ్యులో, పరిచయస్థులో కోవిడ్‌ బాధితులై క్షోభిస్తున్న దైన్య పరిస్థితి నేడుంది. అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్య అందరినీ భయపెడుతున్నది. ఈ ఆందోళన చాలామంది మానసిక ఆరోగ్యాన్ని తెలీకుండానే దెబ్బతీస్తున్నది. అందుకే ప్రతి వ్యక్తీ ఇతరులలో భయాన్ని పెంచకుండా సకారాత్మక (పాజిటివ్‌) ధోరణితో ప్రేమ పూర్వకంగా మాట్లాడాలి.  మన ఇళ్లల్లోని వృద్ధులు, పిల్లలతో ప్రేమానురాగాలతో మెలగాలి. వైద్య సిబ్బంది, పోలీసులు, ఇంట్లో చెత్త తీసుకుపోవడానికి వచ్చే మునిసిపల్‌ సిబ్బంది, పాలూ, కూరలూ సరఫరా చేస్తున్న వారు, సమాచార సేకరణ కోసం పనిచేస్తున్న మీడియా సిబ్బంది తదితరుల పట్ల సానుభూతితో మెలిగి మద్దతు తెలియజేయడం మరవకండి.

‘పరుల కోసం పాటు పడని...

నరుని బతుకూ దేనికని’ అన్న సినారె మాట గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనందరి మతం ఒక్కటే.. అదే మానవత్వం! 

(రచయిత సీనియర్‌ జర్నలిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో బోధకుడు, ప్రజా సంబంధాల విభాగ అధిపతి)


logo