సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Apr 03, 2020 , 23:04:13

ప్రేమ కన్నా బాధ్యత గొప్పది

ప్రేమ కన్నా బాధ్యత గొప్పది

కరోనా గండం నుంచి బయటపడటానికి మనకు ఉన్న పెద్ద సానుకూలత ఏందంటే.. మనం సమస్యను ముందుగానే పసిగట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పౌర సహకారం ఉంటే కచ్చితంగా కరోనాను తరిమేయొచ్చు. కరోనానే కాదు, ఇంకేదైనా దరిచేరొద్దు అంటే ఇల్లు, ఇల్లుతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. వీటిని మనం ముందస్తుగానే చేసుకున్నాం.

ప్రపంచం దృష్టిలో తెలంగాణ ఒక చైతన్య నేల. పోరాట చరిత్ర ఉన్న రాష్ట్రం. మనకు సోయి ఎక్కువ అనుకుంటారు అందరూ. నిజమే దీనినెవరూ కాదనలేరు. రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయడమే కాదు.. ఇంట్లో నుంచి కదలకుండా యుద్ధం చేస్తామని నిరూపించుకోవాల్సిన సమయమిది. ఇప్పుడు మన చౌరస్తాల్లో కరోనా వచ్చి కాచుకొని కూర్చున్నది. ఎంత బాధ్యతగా దానికి దూరంగా ఉంటే అంత మంచిది. 

బాధ్యత గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో అర్థం చేసుకోవాలి. సృష్టిలో ప్రతి జీవికీ బాధ్యత ఉన్నట్లే.. ప్రతి పౌరుడికీ తనదై న బాధ్యత ఉంటుంది. బాధ్యత అనేది కనీస మనిషి లక్షణం. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఒక్క కాగితం ముక్క కూడా లేకుండా ఊడ్చేసి ఆ చెత్తను పక్కింటి గోడ ఆవతల పడేస్తే అది బాధ్యత అవుతుందా? సమాజానికి ఇది ఏం నష్టం చేయదా? సమాజం బాధ్యతేమోగానీ ఇంటి బాధ్యత కూడా మర్చిపోతున్నారు జనా లు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో జరిగిన ఓ దారుణమే దీనికి నిదర్శనం. కరోనా సోకి ఉండొచ్చనే అనుమానంతో ఓ సెక్యూరిటీ గార్డ్‌ ను కట్టుకున్న భార్య.. కన్న కొడుకు ఇంటి నుంచి వెలేశారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అతడు బిక్కుబిక్కుమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వాస్తవానికి అతనికి ఏ కరోనా వైరసూ సోకలేదు. సరే.. వాళ్లనుకున్నట్లే సోకిందే అనుకుందాం. అయినంత మాత్రాన ఇంట్లో నుంచి తరిమేస్తారా? కట్టుకున్నందుకు భార్య, కన్నందుకు కొడుకు ఇచ్చే సత్కారమిదేనా? 

నిజంగా వారికి బాధ్యతనేదే ఉంటే ఇలా చేసేవాళ్లా? పోలీసులకో.. ఇతర అధికారులకో సమాచారం అందించేవాళ్లు. అనారోగ్యానికి గురైన తమకుటుంబ సభ్యుడి ప్రాణాలు కాపా డుకోవడానికి ప్రయత్నించేవాళ్లు. కానీ అలా జరగలేదు. వాళ్ల అనుమానమే నిజమై అతడికి వైరస్‌ సోకి ఉంటే ఆయన పరిస్థితి ఏంటి? బయటవాళ్ల పరిస్థితి ఏంటి? కరోనా విషయం లో ఇలా బాధ్యతారహితంగా ఉండటం వల్లే పరిస్థితి ఆందోళనకరంగా మారిపోతున్నది. వైరస్‌ రోజురోజుకూ తీవ్రమవుతుంది. లాక్‌డౌన్‌ను పాటించి ఎవరూ ఇండ్లలోంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఎంతగా చెబు తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. అది ఎవరికి నష్టం? వాళ్లొక్కరికే నష్టమైతే ఎవ రి ఖర్మ వారు అనుభవిస్తారు అనుకుంటాం. కానీ దానివల్ల అందరికీ నష్టమే. విచిత్రంగా ఒకతను మొన్నొకనాడు.. ఆశీర్వాద్‌ ఆటా కోసం శ్రీనగర్‌ కాలనీ నుంచి చింతల్‌బస్తీ వచ్చాడు! ఇదెంత బాధ్యతారాహిత్యం? ‘అయ్యా.. నువ్వు ఇంట్లో నుంచి బయటకు రాకు. కడుపు నింపుకోవడానికి ఆశీర్వాద్‌ ఆటా అయితే ఏముంది? ఇంకోటి అయితే ఏముంది?’ అని ఇంకొకరు మొట్టికాయలేసి చెప్పాలా? 

ఇంకా మన వాళ్లు లాక్‌ డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుమీదికి వచ్చి.., అలా రావటానికి చెబుతున్న కారణాలు బేతాళ కథలను మరిపిస్తున్నాయి. పొద్దుగాల కూరగాయలు అన్నీ కొన్నాను కానీ, కొత్తి మీర కొన లేదు కాబట్టి కొత్తి మీర కోసం పోతున్నా అని ఓ పిట్ట కథ ఒకటి చెప్పుకొచ్చాడు. ఇది.. ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కినవ్‌ అంటే దూడ గడ్డికోసమన్నట్లు’ లేదూ...! ఇదే కాదు.. ‘హెల్మెట్‌ పెట్టుకో’ అని వేరేవాళ్లే చెప్పాలి. ‘తాగి వాహనం నడపకు’ అని వేరేవాళ్లే చెప్పాలి. ఆఖరికి మన చేతులు కడుక్కోమని కూడా వేరేవాళ్లే చెప్పాలి. హెల్మెట్‌ పెట్టుకోకపోతే తలకాయ పగిలేది మనదా? పోలీస్‌దా? తాగి బండి నడిపితే నష్టం జరిగేది మన కుటుంబానికా? పోలీసాఫీసర్‌ కుటుంబానికా? విచక్షణ కోల్పోయి, బాధ్యత మరిచి మనం వ్యవహరిస్తే ముప్పు మనకే. కరోనా మహమ్మారి మనం అనుకున్నంత సాదాసీదా ది కాదు. అత్యంత ప్రమాదకరమైనది. 

అమెరికా లాంటి దేశాలనే వణికిస్తుందంటే అదెంతటి మహమ్మారో అర్థం చేసుకోవాలి. మనకు ఉన్న ఆయుధం ఇంట్లో నుంచి వెళ్లకపోవడం. కానీ ఎవరు వింటున్నారు? అంతా షట్‌డౌన్‌లోనే ఉన్నాయని తెలిసినా బయటకు వస్తున్నారు. గుంపులుగా పోగవుతున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లు స్వచ్ఛందంగా అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పినా పట్టించుకోవడం లేదు. పరీక్షలు చేయించుకోమన్నా వినిపించుకోవడం లేదు. డాక్టర్లపై దాడి చేయడం.. పోలీసులపై ఉమ్మివేయడం.. కావాలని దగ్గడం.. తుమ్మ డం.. ఇదేనా కరోనాను తరిమికొట్టే తరీఖా?  ఆషామాషీ వైరస్‌ కాదని తెలిసి కూడా ఇలా వ్యవహరించడం బాధ్యత అనిపించుకోదు. ఇక్కడ మతాలు, కులాలు కాదు. ప్రాణాలు ముఖ్యం. మన ఒక్కరి ప్రాణాలే కాదు, సమాజం మొత్తం ప్రాణాలు ముఖ్యం. మనం పోరాడుతున్నది మతంతో కులంతో కాదు, వైరస్‌ తో. హిందు, ముస్లిం, క్రిష్టియన్‌ ఎవరైనా వైరస్‌కు ఒక్కటే. మనల్ని నిర్వీర్యం చేయడం. మన ద్వారా వేలాది మందికి వ్యాపించడమే దాని పని. 

ఎవర్నో కలవాలనే ఆశ.. ఇంకెవర్నో చూడాలనే ప్రేమ. ఇష్టమైనది తినాలనే కోరిక. ఏదో సందేశమివ్వాలనే ఆలోచన చాలా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడిపై వస్తువు పై ఉన్న ప్రేమ కంటే బాధ్యత గొప్పది. అసలు దేశమే లాక్‌డౌన్‌ అయితే.. రోడ్లే బంద్‌ ఉంటే పొయ్యేదెక్కడ? చేసేదేమిటి? గ్రహించాలి. అంతా సద్దుమనిగిందనుకున్న సమయం లో నిజాముద్దీన్‌ మర్కజ్‌ తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు వెళ్లొచ్చిన వారికి ఒక్కొక్కరిగా కరోనా పాజిటివ్‌ వస్తుండటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దానికి తోడు వారు వైద్యులకు,పోలీసులకు సహకరించకపోవడం మరిం త ఆందోళన కలిగించే విషయం. బాధ్యతగా ఉండాల్సిన సమయంలో ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే మనం కరోనాతో జరుగుతున్న యుద్ధంలో ఎలా గెలుస్తామో ఆలోచించుకోవాలి. ఆత్మ విమర్శ చేసుకోవాలి. 

కరోనా గండం నుంచి బయటపడటానికి మనకు ఉన్న పెద్ద సానుకూలత ఏందంటే.. మనం సమస్యను ముందుగానే పసిగట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పౌర సహకారం ఉం టే కచ్చితంగా కరోనాను తరిమేయొచ్చు. కరోనానే కాదు, ఇంకేదైనా దరిచేరొద్దు అంటే ఇల్లు, ఇల్లుతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. వీటిని మనం ముందస్తుగానే చేసుకున్నాం. తెలంగాణలో ఎక్కడైనా చూడండీ.. మురుగు, మరుగు పెద్దగా కనిపించవు. ఎందుకంటే మనం ‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’ చేపట్టి పారిశుద్ధ్యాన్ని సాధించాం. ముందు చూపు అంటే ఇదే కదా? తెలంగాణ సమాజానికి సోయి ఎక్కువ అనడానికి ఈ ప్రగతి కార్యక్రమాలే ఒక ఉదాహరణ. అంతేకాదు మనకు ఇగురం కూడా ఎక్కువే. ఎందుకంటున్నారా? కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఇప్పుడు రోడ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి కదా? ఇదే సరైన సమయం అనుకొని రోడ్లు కూడా మరమ్మతు చేసుకుంటున్న ఇగురం గల్ల సమాజం మనది. మనకు ఇన్ని అనుకూలతలున్నాయి కాబ ట్టి బాధ్యత అనే మరో అనుకూలతను జోడిస్తే కరోనాను కంట్రోల్‌ చేయొచ్చు. వైరస్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రెండు వారాలు సీరియస్‌గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపులుగా పోగవ్వద్దు.అత్యవసరం కాకపోతే బయ టికే రావద్దు. ప్రార్థనలు, పూజల పేరిట ప్రజలను పోగేసి వైరస్‌ పాలుచేయొద్దు.మసీదు లు.. ఆలయాలు.. చర్చిల దగ్గర వినిపించే భక్తి సందేశాలకు బదులు ‘కరోనా సందేశాలు’ వినిపిస్తే ఎంతో మేలు. మరచిన బాధ్యతను గుర్తుచేసి సామాజిక దూరానికి దగ్గర చేయాలి. ఇదే కరోనాను కట్టడి చేసే తారక మంత్రం.logo