సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Apr 04, 2020 , T00:05

వైద్యుడిని కాపాడుకుందాం!

వైద్యుడిని కాపాడుకుందాం!

కరోనాపై పోరాటం మొదలైన ప్రారంభ దశలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్యుల ప్రాధాన్యాన్ని గుర్తించారు. మన వైద్యులను కాపాడుకోవాలని, వారు లేకపోతే సమాజానికి భద్రత ఉండదని జనతా కర్ఫ్యూ కన్నా ముందే ప్రజలకు చెప్పారు. ముఖ్యమంత్రి ఇంతగా వివరించి చెప్పినా కూడా వైద్యులపై దాడులు జరగడం బాధాకరం. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఈ దాడి జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి దోషులపై చర్య తీసుకుంటామని ప్రకటించడం వల్ల వైద్యులకు భరోసా లభించింది. సాధారణ పరిస్థితులలోనైతే వైద్యులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపేవారే. కానీ ప్రస్తుత విషమ పరిస్థితులను గుర్తించి సంయమనంతో వ్యవహరించడం వారి విజ్ఞతకు నిదర్శనం. ‘దేశంలో నెలకొన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితి దృష్ట్యా మేం తీవ్ర చర్యలకు పాల్పడటం లేదు. పరిస్థితి చేయి దాటక ముందే ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం’ అంటూ వైద్య సంఘం పేర్కొన్నది. ప్రాణాలను కాపాడే వైద్యులను దేవుడితో సమానంగా భావించే సమాజం మనది. ఇప్పుడు వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు చికిత్స చేస్తున్నారనేది గుర్తించాలి. 

కోవిడ్‌- 19 రోగులకు ఆస్పత్రులలో చికిత్స ఇవ్వడమే కాకుండా, సమాజంలో ఎవరెవరికి వ్యాపించిందో గుర్తించడానికి ఇంటింటికీ వెళ్ళి పరీక్షలు చేయవలసిన విపత్కర పరిస్థితి ఏర్పడ్డది. విదేశాల నుంచి వచ్చేవారి వల్లే కాకుండా,  మన దేశంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా కూడా కరోనా వైరస్‌ ప్రబలుతున్నది. వ్యాధి సోకిన వారికి చికిత్స చేయడమే కాకుండా, వారి కుటుంబాలను నిరంతర పర్యవేక్షణలో పెట్టవలసి  వస్తున్నది. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో వైద్య సిబ్బందిపై జరిగిన దాడి అత్యంత దారుణమైంది. ఇండోర్‌లోని ఒక ప్రాంతంలో ఇద్దరికి కోవిడ్‌ -19 సోకింది. 54 కుటుంబాలను ఏకాంతంలో పెట్టవలసి వచ్చింది. ఈ ప్రాంతానికి వెళ్ళి ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నప్పుడు స్థానికులు వైద్య బృందంపై రాళ్ళు రువ్వి గాయపరచడం, వెంటబడి తరమడం దిగ్భ్రాంతికరం. సమీపంలో ఉన్న పోలీసులు వారిని కాపాడకపోతే వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉండేది. ప్రజల ప్రాణ రక్షణ కోసం సాగించే వైద్య పరీక్షలకు కూడా పోలీసుల భద్రత అవసరమా? ఇది ఆయా సామాజికవర్గాల కోణంలో ఆలోచించవలసిన విషయం కాదు. ఇటువంటి సమస్యలను అధికారయంత్రాంగం, రాజకీయ నాయకత్వం ముందుకు వచ్చి పరిష్కరించవలసి ఉంటుంది. 

బ్రిటన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశంలోనే వైద్యులు తగిన రక్షణ దుస్తులు లేక ఇబ్బంది పడుతున్నారు. అయినా ఈ కారణం చూపి విధులు మానుకోవడం లేదు. మన దేశంలోనూ అదే పరిస్థితి. యుద్ధ ప్రాతిపదికన వైద్యులకు భద్రతకు అవసరమయ్యే వస్తువులను తయారు చేయడానికి ప్రభుత్వపరమైన ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి తగినన్ని వ్యక్తిగత రక్షణ దుస్తులు లేకున్నా వైద్యులు చికిత్స సాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇల్లు ఖాళీ చేయాలంటూ వైద్యులపై ఇరుగుపొరుగు వారు ఒత్తిడి తెస్తున్నారు. ఇటువంటి వృత్తిపర ఇబ్బందులు, సామాజిక ఒత్తిడుల మధ్య వైద్యులు విధిని నిర్వర్తించవలసి వస్తున్నది. వారి సేవలకు ప్రజలు తగిన గుర్తింపు ఇవ్వాలే కానీ ఇబ్బందులు పెట్టడం తగదు. ప్రభుత్వం భద్రత కల్పించవలసిన పరిస్థితి తలెత్తనే కూడదు. వైద్యులను గౌరవించడం, కాపాడుకోవడం సమాజ బాధ్యత.


logo