శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Apr 03, 2020 , 23:02:14

ధైర్యమే పరమౌషధం

 ధైర్యమే పరమౌషధం

All war is a symptom of mans failure as a thinking animal. అంటే.. ‘యుద్ధం ఏదైనా కావచ్చు, అది బుద్ధిజీవిగా మనిషి వైఫల్యానికి నిదర్శనం..’ అని జాన్‌ స్టీన్‌ బెక్‌ అనే సుప్రసిద్ధ అమెరికన్‌ రచయిత అన్నాడు. చర్చలతో సమస్యను పరిష్కరించుకోగలిగే సామర్ధ్యం వున్న బుద్ధిజీవి అయిన మనిషి యుద్ధం దాకా తెచ్చుకోవడం అంటే.. తన బుద్ధిని ఉపయోగించడంలో విఫలం చెందినట్లే కదా.. అనేది ఆయన మాటల సారం. 

దేశాలు, మనుషుల నడుమ యుద్ధం గురిం చే ఆయన ఆ మాటలు అనవచ్చు. కానీ, కనిపించని శత్రువు ‘కరోనా’కు బెంబేలెత్తి చీకటి యుద్ధం చేస్తున్న మానవజాతి వైఫల్యానికి.. ఆ మాటను అన్వయిస్తే సరిగ్గా సరిపోతుంది.అన్నిజంతువుల్లాగా కాకుండా మనిషిగా మనం ప్రకృతిని అనుసరించి బతకడంలో వైఫ ల్యం చెందిన ఫలితమే.. కరోనా, దాని పర్యవసానాలు. భూమ్మీది ఏ జీవరాశికీ లేని విజ్ఞత అనే ప్రత్యేకత మనిషికి వుండటం వరమే. అయి తే ప్రకృతిని నాశనం చేయడంలో మనిషి తన విజ్ఞత కోల్పోతుండటం శాపంగా మారింది.  అన్ని జీవరాసులు తమ బతుకుకోసం ఒకే పోరాటం చేస్తే, మనిషికి తెలివి ఉంది కాబట్టి,  భౌతిక, నైతిక, సామాజిక.. అనే మూడు రకాల యుద్ధాలు చేయాల్సివుంటది. మొదటిది- తాను సంపూర్ణ ఆయుష్షును కాపాడుకునేందుకు తన శరీరంతో యుద్దం. రెండోది- సంఘజీవిగా తనను తాను కంట్రోల్‌లో పెట్టుకునేందుకు తన మనసు మీద తాను నిత్యం చేయాల్సిన యుద్దం. మూడోది- సమాజంలో ఒకరిగా ఉంటూనే అనివార్యంగా చేయాల్సిన బతుకు యుద్ధం. కానీ మనిషి మూడింటిలో ఓడిపోయి చేతులెత్తేస్తున్నపరిస్థితి దాపురించింది. అది ‘కరోనా’ సందర్భం లో మరోసారి బయటపడ్డది.అభధ్రతాభావ పరిస్థితుల్లో నిత్య భయంతో జీవిస్తున్న మానవునికి కరోనా ఓ యుద్ధభయాన్ని సృష్టిస్తున్నది. రోగం కంటే భయాన్నే ఎక్కువగా కరోనా సృష్టిస్తున్నదని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను మనం ఈ కోణంలోంచే అర్థం చేసుకోవాలె.

‘యుద్ధాన్నిగెలవాలంటే ముం దు యుద్ధ భయాన్ని సృష్టించాలె’ అనేది యుద్ధనీతి. ఆ నీతిని కరోనా వైరస్‌ విషయంలో కనిపిస్తు న్నది.కానీ కరోనా యుద్ధనీతిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తిప్పికొడుతున్నరు. కరోనా వైరస్‌ను ఓడించి,దానిపై మనిషి గెలవాలంటే.. అది మోసుకొచ్చే రోగం కన్నా ముందు అది సృష్టిస్తున్న  భయాన్ని ముందు గెలవాలె అనే తాత్విక విధానాన్ని కేసీఆర్‌ ముందుకు తీసుకుపోతున్నరు. ముందు యుద్ధ భయాన్ని గెలిస్తే సగం విజ యం వరించినట్టేనని నిరూపిస్తున్నరు. అదే సమయంలో ధైర్యం నింపడం ద్వారా సగం రోగం నయం చేయవచ్చని కూడా నిరూపిస్తున్నరు.

‘తెలంగాణకు కరోనా వస్తే ఎట్ల మరి..’ అని ఓ పెద్దమనిషిని ఓ రిపోర్టర్‌  అడుగుతే..‘కేసీఆర్‌ వుండుగా.. అన్నాయినె సూసుకుంటడు.. ఒక వేల వచ్చినా ఎన్నికోట్లు ఖర్చు పెట్టయినా దాన్ని అడ్డుకుంటడు..’ అనే వీడియో ఒకటి కరోనా ఇంకా రాష్ర్టానికి రాక ముందు సోషల్‌ మీడియా లో వైరల్‌ అయింది. ఆ పెద్ద మనిషి విశ్వసించినట్టే.. నేడు తెలంగాణ ధైర్యానికి, భరోసాకు పర్యాయ పదంగా కేసీఆర్‌ మారారు. ఆ పెద్ద మనిషి వ్యక్తపరిచిన భరోసానే నేడు యావత్‌ తెలంగాణ సమాజం కనబరుస్తున్నది.

విపత్కర పరిస్థితుల్లో.. తన ప్రజలను కాపాడటానికి ఓ నాయకుడిగా తాను  చేసే ప్రయత్నాలన్నీ ఒక దిక్కున చేసుకుంటూనే, తనను నమ్ముకున్నవారు ఒక్కరుకూడా నష్టపోవద్దని తపన పడే మహానాయకుడు దృశ్యమానమైన సందర్భమిది. నాడు గోవర్ధనగిరినెత్తి రేపల్లె వాసుల్లో శ్రీకృష్ణుడు నింపిన భరోసా కావచ్చు, నేడు కరోనాను పారదోలడానికి ప్రజల్లో సీఎం కేసీఆర్‌ నింపిన భరోసా కావచ్చు.. ఈ రెండిట్లో కనిపిం చే సారూప్యం వున్నది. అది.. నాయకుడు పనిచేయడమే కాదు, ఆ పనిని తన ప్రజలకు పూసగుచ్చినట్టు విడమర్చి చెప్పడం.., తద్వారా ప్రజ ల్లో  భరోసా పెంచి సమాయత్త పరిచి వారిని కరోనాతో యుద్ధంలో స్వచ్ఛందంగా పాల్గొనేలా చేయడం అత్యసరం. కష్టకాలాన్ని దాటిందాకా ఓర్పు వహిస్తూ, పోరాట స్పూర్తిని ప్రదర్శించి విజయాన్ని సాధించే దిశగా ప్రజారాసులను నడిపించడమే.. అసలు సిసలు నాయకత్వ లక్షణం. కరోనాను పారదోలేందుకు కేసీఆర్‌ అదే లక్ష్యంతో ముందుకు పోతున్నరు.ఆపత్కాలంలో గత్తరబిత్తరై భయపడితే..మన శరీరంలోని రోగ నిరోధక శక్తి నశించి కరోనా వంటి వైరస్‌కు లొంగిపోయే ప్రమాదమున్నదట. భయం స్థానంలో ఒక ఉత్సాహం భరోసా నింపడం ద్వారా మన శరీరంలోని  రోగ నిరోధక శక్తి పెంచుతుందట. అది మందులాగా మారి, కరోనా వంటి ప్రాణాంతక వైరస్‌ లను తరిమికొడుతుందనే విషయం ఇఫ్పటికే శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించిన సత్యం. కరోనాకు మందు లేదు కానీ.. ధైర్యానికి మందు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాడున్నది. తెలంగాణకు మందులిచ్చే డాక్టర్లే కాదు ధైర్యాన్నిచ్చే డాక్టర్‌ సీఎం కెసీఆర్‌ వున్నడు. అయితే మన డాక్టర్లు చెప్పినట్టు విందాం. కరోనాను తరిమి కొడుదాం.

-రమేశ్‌ హజారి


logo