సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Apr 03, 2020 , 23:01:04

లోకాన్ని బతికిద్దాం..

లోకాన్ని బతికిద్దాం..

ఇప్పుడొక ఏకాంత యుద్ధం చేయాలి

నిన్ను నువ్వే ఆయుధం చేసుకొని

నీ యుద్ధం నువ్వే గెలవాలి..!

సామాజిక మానసిక దూరం లేని

సమీప దూరాల సందర్భాలను

సంతోషంగా స్వీకరించాలి

నువ్వూ నేను గీసుకున్న మత దూరాలు

కుళ్ళుకంపు కుల కళేబరాలను మోసుకుంటూనే కదా

ఈ దారిగుండా పయనమై వచ్చింది..!

ఇన్నాళ్ళు  అబద్ధ సమూహాల సంఘర్షణల్లోనే కదా

హృదయాలను దాచేసుకొని ఒకరికొకరం ఎదురు పడింది..!

ఈ మాత్రం ఎడం పాటిస్తే తప్ప బోధపడలేదు

మనలను ఒకే దారానికి అల్లేది మృత్యువు మాత్రమేనని..!

నీ దైవాలు నా దైవాలు పారిపోగా మిగిలిన

మన దైన్యపు మొఖాలకు ఫ్రేము కట్టి

గోడకు తగిలించుకుందాం..

కంటికి కనిపించని వైరస్‌ 

కబళిస్తె తప్ప తెలియలేదు

కాలం రేఖల మీద 

నువ్వూ నేను మాత్రమే సత్యమని..!

మనం బతుకుదాం భయాలు లేని

ఒంటరి నిర్బంధాల్లోంచైనా సరే

ఈ లోకాన్నీ బతికిద్దాం.. 

పరస్పర అనుమానాల్లేని ఎడంగానైనా సరే..!

చెమన్‌, 9440385563


logo