గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Apr 03, 2020 , 06:33:17

సమిష్టి పోరాటం

సమిష్టి పోరాటం

కరోనాపై ప్రధాని మోదీ రెండు విధాలైన పోరాటానికి సమాయత్తమవుతున్నారు. ఒకటి దేశంలో ఈ వైరస్‌ను కట్టడి చేయడమైతే, రెండవది అంతర్జాతీయ సమాజాన్ని సమష్టి పోరాటానికి సమాయత్తం చేయడం. సమాంతరంగా సాగుతున్న ఈ రెండు ప్రయత్నాలూ పరస్పర పూరకాలు. అంతర్జాతీయంగా సమష్టి పోరాటమంటే, ఇతర దేశాలకు తోడ్పడటమే కాదు, మనకు కావలసిన సహాయాన్ని పొందడం కూడా. ప్రధాని ఇటీవల 130 దేశాలలోని మన రాయబార కార్యాలయాలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇతర దేశాల అనుభవాన్ని మనం ఏ విధంగా స్వీకరించగలమనేది తెలుసుకోవలసిందిగా కోరారు. ఇటలీలో కరోనా సోకినవారిలో మృతులు పదకొండు శాతం ఉంటే, జర్మనీ ఒక శాతం దగ్గరే నియంత్రించగలిగింది. కరోనాపై పోరులో చైనాది ఒక విధానమైతే, దక్షిణ కొరియాది మరొక తరహా వ్యూహం. ఏయే దేశాల నుంచి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, వైద్య పరికరాలను సమకూర్చుకోవచ్చుననేది రాయబార కార్యాలయాల ద్వారా మన దేశం చర్చిస్తున్నది. దక్షిణ కొరియా, జర్మనీ, చైనా అనుసరించిన అత్యాధునిక సాంకేతిక విధానాలు, ఉత్తమ ఆచరణలు ఎటువంటివి అనే విషయమై భారత్‌ ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నది. 


ఇటలీ ఇతర దేశాల సహాయాన్ని అర్థిస్తే, సాటి యూరప్‌దేశాలు పెద్దగా స్పందించకపోగా, వైద్య పరికరాల ఎగుమతిపై నిషేధాన్ని విధించుకున్నాయనే ఆరోపణ ఉన్నది.  ఇదే అవకాశంగా చైనా రంగంలోకి దిగి యూరప్‌ దేశాలకు వైద్య సిబ్బందిని, పరికరాలను తరలించింది. ఇది చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఆస్కారం కల్పించిందనే అభిప్రాయం వినబడుతున్నది. ఈ వివాదాలకు అతీతంగా భారత్‌ గుంభనంగా అంతర్జాతీయ సహకారానికి పాటుపడుతున్నది. సార్క్‌, జి20 దేశాల నాయకులతో ప్రధాని మోదీ జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌ ప్రాధాన్యం సంతరించుకున్నది. కరోనాపై పోరులో చైనా కొట్టుమిట్టాడుతున్నప్పుడు పదిహేను టన్నుల వైద్య సంబంధ సామాగ్రిని భారత్‌ తనవంతుగా అందించింది. ఇటీవలే నేపాల్‌, మాల్దీవులకు వైద్యులను పంపించింది. అఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, శ్రీలంక తదితర దేశాలకు వైద్య సామాగ్రిని సరఫరా చేస్తున్నది. ఇటలీ, ఇరాన్‌ అభ్యర్థనలను పరిశీలిస్తున్నది. మాస్క్‌లు, వైద్య పరికరాలు కావాలని భారత్‌ను ఇజ్రాయెల్‌ కోరుతున్నది. కరోనాను ప్రపంచ సమస్యగా గుర్తించడం ద్వారానే ఈ వ్యాధిని ఎదుర్కొనగలమనేది భారత్‌ అభిప్రాయం. 


మొదట తమ దేశంలో వ్యాపించిన కరోనాను కట్టడి చేసుకున్న చైనా ప్రభుత్వం ఆ తరువాత ఇతర దేశాలకు సహాయం అందిస్తూ తన ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. మోదీ ప్రభుత్వం కూడా మన దేశంలో కరోనాను ఎంతగా కట్టడి చేయగలిగితే, అంతగా ఇతర దేశాలకు తోడ్పడగలదు. చైనాకున్నంత శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయా అనే సందేహం కలుగవచ్చు. కానీ గతంలో అలీనోద్యమానికి నాయకత్వం వహించడానికీ, ప్రచ్ఛన్నయుద్ధం మూలంగా తలెత్తిన పలు సంక్షోభాలలో స్పష్టమైన వైఖరి తీసుకోవడానికి కారణం భారత్‌కున్న ధర్మబద్ధత, నైతిక బలమే. అమెరికా చైనాలతో పోలిస్తే, వర్ధమాన దేశమైన భారత్‌ ఆసియా- ఆఫ్రికా దేశాలకు సులభంగా దగ్గర కాగలదు. సార్క్‌ సమాజాలతో కూడా చైనా కన్నా భారత్‌కే సారూప్యమెక్కువ. అమెరికా, యూరప్‌ దేశాలు కోవిడ్‌ కోరల్లో చిక్కి అల్లాడిపోతున్నాయి. అమెరికా, చైనా కలహాలతో కాలం గడుపుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్ధమాన, పేద దేశాలు కరోనాను ఎదుర్కొనడానికి వీలుగా సూచనలు ఇస్తూ, ప్రపంచ దేశాల సహాయాన్ని కూడగట్టవలసిన నైతిక బాధ్యత భారత్‌పై ఉంది. చారిత్రకంగా భారత్‌ నిర్వహిస్తున్న పాత్రకు ఇదొక కొనసాగింపు.


logo