సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Apr 02, 2020 , T00:15

పొంచి ఉన్న నిరుద్యోగం

పొంచి ఉన్న నిరుద్యోగం

ప్రపంచాన్నంతటినీ కారుమేఘంగా కమ్మేసిన కరోనా వైరస్‌ సకల జీవనరంగాలనూ ధ్వంసం చేస్తున్నది. మనుషుల ప్రాణాలను తోడేయటమే కాదు, ఉద్యోగ, ఉపాధి కల్పనలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దేశదేశాల్లో అమలవుతున్న ‘లాక్‌డౌన్‌'లతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉత్పత్తిరంగం ఆసాంతం స్తంభించిపోయే దుస్థితి తలెత్తింది. పేరుగాంచిన పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు మొదలు చిన్న, మధ్యతరహా కంపెనీలన్నీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం తలెత్తుతున్నది. ప్రపంచదేశాలన్నీ ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న తరుణంలో కరోనా కాటు ‘గోటిచుట్టపై రోకటి పోటు లా’ మారింది. దీంతో కంపెనీలు నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగుల సంఖ్య ను భారీగా తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉన్నపళంగా లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయే సందర్భం సామాజిక జీవనంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. 

రెండువందలకు పైగా దేశాలు కోవిడ్‌-19 వైరస్‌తో వణికిపోతూ ప్రజల ప్రాణా లు నిలపడమే తక్షణ కర్తవ్యంగా తంటాలు పడుతున్నాయి. ఈ తరుణంలో ఉపా ధి కల్పన, నిరుద్యోగం అనేవి అర్థంలేని ప్రశ్నలుగా మిగిలాయి. అభివృద్ధి చెందిన యూరప్‌ దేశాలతో పాటు అమెరికా కూడా దీనికి అతీతం కాదు. అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న అమెరికా కూడా కరోనాతో కష్టాల్లో పడింది. కోవిడ్‌ ఉధృతితో తాజాగా మేరిలాండ్‌, వర్జీనియా, అరిజోనా, టెన్నెసీ రాష్ర్టాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అమెరికాలో ఉన్న యాభై రాష్ర్టాల్లో 32 పూర్తి లాక్‌డౌన్‌లో ఉన్నాయి. దీంతో అమెరికాలోని ప్రతి నలుగురిలో ముగ్గురు లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. ఇప్పటికే 2.45 కోట్ల మంది ఇంటికే పరిమితమయ్యారు. ఇదిలాగే కొనసాగితే.., అమెరికాలో 4.7 కోట్ల మంది నిరుద్యోగులవుతారని ‘ఫెడరల్‌ రిజర్వ్‌' అధ్యయన సంస్థ వేసిన అంచనా గగుర్పాటు కలిగిస్తున్నది. ఈ సంక్షోభం, అది అక్కడికే పరిమితమైపోయేది కాదు. దేశదేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

విద్య, ఉపాధి అవకాశాల కోసం భారతీయులు పాశ్చాత్య దేశాల బాట పట్టడం పరిపాటి. ఇందులో అమెరికాదే అగ్రస్థానం. సాధారణ, అసంఘటితరంగం మొద లు కార్పొరేట్‌ వృత్తి నిపుణుల దాకా అమెరికా అభివృద్ధిలో భారతీయుల భాగస్వామ్యం ఉన్నది. ‘అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే’ (ఏసీఎస్‌) ప్రకారం, ఆ దేశంలో భారతీయుల సంఖ్య 2010లో 17.8 లక్షలు ఉంటే, 2018 నాటికి అది 26.5 లక్షలకు చేరుకున్నది. గత ఎనిమిదేండ్లలో 9 లక్షలు పెరిగారు!  అమెరికాలో కరో నా సంక్షోభ ప్రభావం ఆసియా వాసులపై, ముఖ్యంగా భారతీయులపై ఎక్కువగా ఉంటుందనటంలో ఆశ్చర్యం లేదు. తక్షణంగా లక్ష ఉద్యోగాలు పోతాయని చెబుతున్నారు. మున్ముందు అది మరింత పెరిగే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. ఈ స్థితిలో హెచ్‌-1బీ వీసాతో పనిచేస్తున్న వారు ప్రమాదంలో పడిపోతారు. ఉద్యోగం కోల్పోయిన పక్షంలో అమెరికాలో ఉండగలిగే కాలపరిమితిని 60-180 రోజులకు పెంచాలని ఇండియన్లు కోరుతున్నారు. దీనికోసం 20 వేల సంతకాలను సేకరించారు. ఏదైనా సమస్యపై వైట్‌హౌజ్‌ నుంచి స్పందన రావాలంటే లక్ష సంతకాలుండాలి. మరో 80 వేల సంతకాల కోసం ఉద్యమం చేపట్టిన వారంతా అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంక్షోభ, నిరుద్యోగ సమస్య అమెరికాదో, భారత్‌దో కాదు. అన్నిదేశాలూ ఈ సుడిగుండంలో చిక్కుకునే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఈ తరుణంలో ప్రభుత్వాలు ముందుచూపు తో వ్యవహరించాలి. ప్రాణాలు నిలుపుకొంటూ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న దేశాలు నిరుద్యోగ రక్కసి, సామాజిక అశాంతి ప్రబలకుండా జాగరూకత వహించాలి, సంరక్షించుకోవాలి. 


logo