సోమవారం 25 మే 2020
Editorial - Mar 31, 2020 , 22:44:19

పరీక్షా సమయం

పరీక్షా సమయం

‘వైద్యో రక్షతి రక్షితః’ అన్నది ఆర్యోక్తి. వైద్యులను, వైద్యరంగాన్ని సంరక్షించుకు న్నప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కరోనా వైరస్‌ కోరలకు ప్రపంచ మంతా అతలాకుతలమవుతున్న వేళ.. వైద్యరంగం పెనుసవాళ్లను ఎదుర్కొంటు న్నది. కరోనా బారినుంచి ప్రజలను కాపాడేందుకు వైద్య సిబ్బంది ముందువరుస లో నిలిచి అహరహం శ్రమిస్తున్నారు. వారికి తగు రక్షణ పరికరాలు, వైద్య సదుపాయాలు అందుబాటులో లేని దుస్థితి ఆధునిక వైద్యరంగానికి పరీక్షా సమయంగా మారింది. వైరస్‌ బారినుంచి రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు రక్షణ కల్పించే బ్యాక్టీరియా నిరోధకాలైన రక్షణ కవచాలు, నాణ్యమైన చేతి తొడుగులు, మాస్కులు చాలినంతగా అందుబాటులో లేకపోవటం విషాదం. కరోనా విస్తరణను అడ్డుకోవటం కోసం దేశదేశాల్లో విధించిన సామాజిక దిగ్బంధనలు, లాక్‌డౌన్‌లు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వస్తు రవాణా 60 శాతం దాకా నిలిచిపోయింది. మునుముందు మరింత దుర్భర పరిస్థితులు ఎదురయ్యేట్లు కనిపిస్తున్నది. 


అమెరికా, యూరప్‌ దేశాల్లో వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందిందనే భావన నిన్నమొన్నటి దాకా ఉండింది. కానీ ఇప్పుడు కరోనా తాకిడితో అక్కడి వైద్యరంగం డొల్లతనం బట్టబయలవుతున్నది. అమెరికాలో కరోనా బాధితులుగా వచ్చిన వృద్ధు లకు వెంటిలేటర్లు, దవాఖాన పడకలు కూడా అందుబాటులో లేవని స్వయంగా దేశాధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారంటే దీనత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఉపయోగిస్తున్న 95 శాతం సర్జికల్‌ మాస్కులు, 70 శాతం వెంటిలేటర్లు  చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుత లాక్‌డౌన్‌లతో వీటి కొరత మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. ఈ దేశం, ఆ దేశం అనే తేడా లేకుండా వైద్య ఉత్పాదనలు, మాస్కులు, చేతి తొడుగులు, గౌన్లకు తీవ్రంగా కొరత ఉన్నది. రానున్న రోజుల్లో కరోనా రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఈ కొరతను అధిగమించటం అంతుబట్టని విషయంగా మారింది. నెలరోజుల క్రితమే, కోవిడ్‌-19 చైనాలో తొలిసారి వెలుగుచూసిన తొలి రోజుల్లోనే దేశాలన్నీ వైద్య పరికరాలను, ఉత్పత్తిని 40 శాతం పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అయినా ఈ సూచనను ఎవరూ చెవికెక్కించుకోలేదు.


మన దేశంలో కరోనా వైరస్‌ రెండో దశలోనే ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. అయినా ఇప్పటికే బాధితుల సంఖ్య వేలల్లోకి చేరుకున్నది. తక్షణ అవసరాల కోస మే 7.25 లక్షల వైరస్‌ను నిలువరించే దుస్తులు, 60 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు, మూడంచెల మాస్కులు కోటి దాకా అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో సుమారుగా ఐదు లక్షల మంది వైద్య సిబ్బంది వైరస్‌పై పోరాడే విధినిర్వహణలో ఉన్నారు. డబ్ల్యూహెచ్‌వో నిబంధన ప్రకారం.. వైద్య సిబ్బంది రోజుకు మూడుసార్లు రక్షణ తొడుగులు మార్చుకోవాలి. ఈ లెక్కన భారత్‌కు రోజు కు 15 లక్షల చొప్పున మాస్కులు, రక్షణ గౌన్లు, చేతి గ్లౌస్‌లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో దేశ వైద్య అవసరాలను తీర్చేందుకు ఇస్రో, డీఆర్‌డీఓ ముందుకురావటం ముదావహం. ఈ సంస్థల దన్నుతో దేశానికి అవసరమైన వైద్య రక్షణపరికరాల కొరత కొంత తీరుతుందనటంలో సందేహం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కరోనా కట్టడికి చేపడుతున్న ముం దస్తు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అన్నింటికి మిన్నగా సీఎం కేసీఆర్‌ చేపడుతున్న చర్యలు ప్రశంసలందుకోవటం గమనార్హం. అన్ని విషయాల్లో కేసీఆర్‌ పనితీరును మెచ్చుకుంటూ ‘ఇదీ నాయకత్వమంటే’ అని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంటే, కేసీఆర్‌ నుంచి ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు నేర్చుకోవాలని సీనియర్‌ కాలమిస్ట్‌, మైసూర్‌ ఎంపీ ప్రతాప్‌ సింహ కొనియాడిన తీరు తెలంగాణకే గర్వకారణం.


logo