బుధవారం 03 జూన్ 2020
Editorial - Mar 31, 2020 , 22:42:30

‘కరోనా కాలాన్ని’ జయిద్దాం!

‘కరోనా కాలాన్ని’ జయిద్దాం!

మనిషి చరిత్రలో ఎన్నడూ లేనంత అగ్నిపరీక్షను ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు. వివేకవంతులు మాత్రమే ఈ ఆపత్కాలం నుంచి గట్టెక్కగలుగుతారు. ఈ అతి చిన్న సూక్ష్మరోగాణువు (వైరస్‌) బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలిగితే అదే మనకు పెద్ద విజయం. ఎందుకంటే, ‘కొవిడ్‌-19’ ఎంత సూక్ష్మ మో ‘అంత మాయలమారి’గానూ అర్థమవుతున్నది. సాధారణంగానే వ్యాధికారక క్రిములు మరీ ముఖ్యంగా ఈ తరహా కొత్త మొండి వైరస్‌ల ఉత్పాదకశక్తి వేగం అసాధారణం. మానవ భౌతికబలం దానిముందు దిగదుడుపే అవుతుంది.

ఎన్నో వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కొన్న శాస్త్రవేత్తలకు ఇంకా దీని పోకడలు, లక్షణాలు పూర్తిగా అర్థం కావడం లేదు. అందుకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు స్వీయ సంరక్షణ చర్యలు తప్ప మానవాళికి మరో మార్గం లేదు. ఎల్లవేళలా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రోగ నిరోధకశక్తిని కలిగి ఉండటం. వైరస్‌ పోయేవరకు జన సమూహాలకు దూరం కావడం. కరోనా వైరస్‌ ఒకరకంగా మనిషిని దొంగదెబ్బ తీస్తున్నది. కంటికి కనపడకుండా మనుషులను కబళి స్తూ, శ్వాస-జీర్ణాది శరీర వ్యవస్థలన్నింటినీ కుప్పకూలుస్తూ ప్రాణాలను హరిస్తున్నది. మనం దాని ఎత్తుజిత్తులకు చిక్కకూడదు. ఎం తగా దానిని ఒంటరిని చేస్తే అంత మంచిది.

అమృతం వంటి సముద్రాన్ని నాశనం చేయడానికి ఒక్క విషపు చుక్క చాలు. ఉప్పు కొంచెం ఎక్కువైనా నోట్లోకి ముద్ద దిగదు. సమాజంలో చెడు కన్నా మంచివారే ఎక్కువ. అయినా సరే, తక్కువ శాతంలో ఉన్న చెడు ఎక్కువ శాతంగా ఉన్న మంచిని కబళిస్తుంది. మనం నిలబడవలసింది మంచి వైపా, చెడువైపా? అంటే, మంచి కోసమే అందరికన్నా ముందుండాలి. బ్రిటన్‌కు చెందిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌' క్రూయిజ్‌ షిప్‌ అనుభవం ఇక్కడ గమనార్హం. 3,711 మంది ప్రయాణికులు, సిబ్బందితో కూడిన ఈ భారీ ఓడలో ఒక్క ప్యాసింజర్‌ (80 ఏండ్ల వృద్ధుడు)కే కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఫలితం గా, అందులోని కనీసం 712 మం దికి పైగా వ్యాధి సోకగా (వారిలో 138 మంది భారతీయులు ఉన్న ట్టు అంచనా), కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.

ఈ కొద్దిరోజుల పాటు ఏది కళంకితమో, ఎవరు వైరస్‌ బాధితులో తెలియని కాలుష్యకారక వాతావరణాలకు దూరంగా, ఎవరికి వాళ్లం ఇండ్లలోనే ఉంటూ, ‘పచ్చడి మెతుకులు తింటూ’ అయినా బతికేద్దాం.

మార్చి 22వ తేదీ ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగా దేశంలోని, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా గల ప్రజలంతా చూపిన సంఘీభా వం అందరి ప్రశంసలనూ అందుకొన్నది. పూర్తిగా కర్ఫ్యూలో పాల్గొనడమే కాకుండా నాటి సాయంత్రం 5 గంటల కల్లా అనేకమం ది ఇండ్ల బాల్కనీలు, ముంగిళ్లలోకి వచ్చి వైద్యులు వంటివారి సేవలకు ‘కృతజ్ఞత’గా రకరకాలుగా చప్పుళ్లు చేశారు. ఇదే స్ఫూర్తిని మార్చి 31 వరకు కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కానీ, ఆశ్చర్యంగా ఆ మర్నాటి (మార్చి 23వ తేదీ) లాక్‌డౌన్‌ (కర్ఫ్యూ)లో అదంతగా కనిపించలేదని కేంద్ర, రాష్ట్ర పాలకులు ఆవేదన చెందారు. కానీ, పల్లె ప్రజలు మాత్రం గొప్ప స్ఫూర్తిని కనబరిచారు.

‘కోరలు చాస్తున్న కరోనా వైరస్‌ను మనద రి చేరనీయకుండా ఎదుర్కొనే పద్ధతి ఇలాగే నా?’ అన్న ఆందోళనతో నాటి పరిస్థితి అనేకమందికి ఇటలీ, స్పెయిన్‌ దేశాల భయానక దుస్థితిని కండ్ల ముందుంచింది. ‘ఈ భీకర అంటువ్యాధి హద్దులు దాటితే అదుపు చేయ డం ఎవరివల్లా కాదన్నది’ కఠిన సత్యం. దేశంలోని అనేక ప్రాంతాలతో సహా రాష్ట్రంలోని హైదరాబాద్‌ రోడ్లపై మార్చి 23 మధ్యాహ్నం కనిపించిన ‘ట్రాఫిక్‌' కేంద్ర, రాష్ట్ర పాలకుల్లో ఎంతటి తీవ్ర ఆందోళనను కలిగించిందో చెప్పడానికి వెంటనే ప్రభుత్వాల పెద్దలు చేసిన ఘాటైన హెచ్చరికలే నిదర్శనం. మెల్లమెల్లగా ప్రజలు కర్ఫ్యూకు అలవాటు పడుతున్నారు. కానీ, ఇంతలోనే తాజా ఢిల్లీ దారుణఘటన ఎంత దురదృష్టకరమో అంత తీవ్ర హెచ్చరిక కూడా.

ఎందుకీ పరిస్థితి ఏర్పడినట్టు? ‘ఇది మొదటి దశను దాటి రెండో దశలోకి వస్తున్నదని, మూడో దశకు చేరుకుంటే చేయి దాటిపోవడం ఖాయమన్న’ పాలకుల భయాందోళనలను బాధ్యత గల పౌరులుగా అందరూ అర్థం చేసుకోకపోవడం వల్లే! ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో, అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా పేరుగాంచిన భారతీయులుగా, అనూహ్య దీక్ష, పోరాట పటిమతో స్వరాష్ర్టాన్ని సాధించి న తెలంగాణ బిడ్డలుగా, వివేకవంతులైన హైదరాబాద్‌ నగరవాసులుగా మనం, మనతోపా టు దేశంలోని ఆయా రాష్ర్టాల ప్రజలంతా కరో నా రక్కసిని దూరం పెట్టడానికి స్వీయ నియంత్రణలు పాటించవలసిందే. ఏ మాత్రం బేపర్వా (నిర్లక్ష్యం)ను ప్రదర్శించినా అది దేశానికే తీవ్ర నష్టదాయకం.

చిన్న జీవి నుంచి సమస్త సృష్టివరకూ దేని ప్రత్యేకత దానిది. కాలచక్రం వలె జీవచక్ర మూ ఒకదానిపై ఒకటి ఆధారపడేవే. అత్యాశ, ఆర్భాటాలు, అహంకారాలకు పోతే మనుషు ల పొట్టలు, జీవితాలతోపాటు భూమి, ఆకాశ మూ ఎంతకని భరిస్తాయి? పేట్రేగిపోతున్న మనిషి వికృతత్వానికి ‘కరోనా’ వైరస్‌ పుట్టుక ఒక హెచ్చరిక. దీని పుణ్యమాని మనిషి ఏం కోల్పోతున్నాడో, ఇప్పటికే చాలామందికి తెలిసివచ్చింది. ‘దగ్గరవాల్సిన వాటికి దూరమవు తూ, దూరం పెట్టాల్సిన వాటిని తలకెత్తుకొం టూ’ సాగిస్తున్న పర్యవసానాలు ఊరికే ఎలా ఉంటాయి? ఎప్పటికప్పుడు కొత్త వైరస్‌లు పుడుతూనే ఉన్నవి. సూపర్‌ బగ్స్‌లా సూపర్‌ వైరస్‌లన్నమాట. అలాంటిదే ఈ ‘కొవిడ్‌19’. మున్ముందు ఇంకెన్ని ఉత్పాతాలను చూస్తామో.

ఇప్పటికిప్పుడు మన దగ్గరున్న ఏకైక ఆయుధం స్వీయ నియంత్రణతో ‘సామాజిక దూరం’ పాటించడమే. ‘సామాజిక దూరం’, శుచీ శుభ్రత, పోషక విలువలు, రోగ నిరోధకశక్తి వంటి వాటి నుంచి కట్టుబాట్లు, క్రమశిక్ష ణ, మంచీ-చెడు విశ్లేషణ వంటి విచక్షణాయు త బాధ్యతలు మానవ సమాజోద్ధరణకు ఎం త అవసరమో ఇప్పటికైనా తెలుసుకొందాం. మకుటం లేని మానవజాతి ఒక అతిసూక్ష్మరోగాణువుల బారిన పడిందన్న అపఖ్యాతి రాకుండా చూద్దాం. ఈ కొద్దిరోజుల పాటు ఏది కళంకితమో, ఎవరు వైరస్‌ బాధితులో తెలియని కాలుష్యకారక వాతావరణాలకు దూరంగా, ఎవరికి వాళ్లం ఇండ్లలోనే ఉంటూ, ‘పచ్చడి మెతుకులు తింటూ’ అయినా బతికేద్దాం. కన్నబిడ్డల వంటి ప్రజలను బాధ్యత తెలిసిన మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కాపాడుకోవడానికే శ్రమిస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాతై నా ఉత్తమ పౌరులుగా మనల్ని మనం నిరూపించుకొందాం. ‘మన పాలకులు చెప్పేది మన కోసమే’ అని తెలుసుకొందాం.


logo