శుక్రవారం 05 జూన్ 2020
Editorial - Mar 30, 2020 , 23:01:15

ఇదీ తెలంగాణ సంస్కృతి

ఇదీ తెలంగాణ సంస్కృతి

కరోనా మహమ్మారి మన దేశంలో విస్తరించకుండా కట్టడి చేస్తున్న క్రమంలో, వలస కార్మికుల పరిస్థితి ప్రధాన సమస్యగా తలెత్తడం విచారకరం. నగరాల నుంచి పల్లెలకు భారీ ఎత్తున వలస సాగుతున్నందున, ఏయే చర్యలు తీసుకుంటున్నారో మంగళవారం నాడు వెల్లడించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించవలసి వచ్చింది. కార్మికుల వలస కరోనా కన్నా పెద్దదిగా మారిందని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యను పట్టించుకుంటున్నందున, తాము ఆదేశాలిచ్చి మరింత అయోమయం సృష్టించదలుకోలేదని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశ విభజన కాలం నాడు సరిహద్దుకు ఇరువైపులా సాగిన వలసలు ఇప్పటి తరానికి తెలువదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వలసలు సాగడం ఇదే తొలిసారి. ఈ వలసల సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అందువల్ల ఇది మన దేశ ప్రతిష్ఠకు చెందిన అంశంగా కూడా మారింది. 

దేశంలోని ప్రధాన నగరాలన్నిటి నుంచి పల్లెలకు వలసలు సాగుతున్నాయి. రాజధాని ఢిల్లీ నుంచి లక్షలాది మంది సొంత గ్రామాలకు ప్రయాణం కావడంతో జనసమ్మర్దం ఆందోళనకర స్థాయికి చేరుకున్నది. ఢిల్లీలో రైళ్ళ కోసం ఎదురుచూస్తున్న వారు మైళ్ళ పొడుగునా బారులు తీరారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ర్టాలు తమ కార్మికుల కోసం వందలాది బస్సులు ఏర్పాటుచేశారు. మార్గమధ్యలో చిక్కుకుపోయిన వారిని గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు మంచిదే అయినా ఈ సందర్భంగా మరో సమస్య తలెత్తుతున్నది. కరోనా వ్యాపించకుండా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. కానీ కార్మికుల వలస వల్ల అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేయాలని, ఎక్కడున్న వారు అక్కడే ఉండేవిధంగా కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయవలసివచ్చింది. దీంతో వలస కార్మికుల కోసం ఢిల్లీతోపాటు ఆయా రాష్ర్టాలు పెద్ద ఎత్తున సహాయ శిబిరాలను ఏర్పాటుచేస్తున్నాయి. కరోనా విపత్తు తీవ్రతను గుర్తించి అన్ని రాష్ర్టాలు అప్రమత్తంగా ఉండటం అవసరం.

ఇతర రాష్ర్టాల సంగతి ఎట్లా ఉన్నా, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రజలకు, వలస కార్మికులకు ఏ ఇబ్బందులు కలుగడం లేదు. హైదరాబాద్‌ నగరంలోని వలస కార్మికులకు పని కల్పించకున్నా కూలీ చెల్లించడం ఆపవద్దని యజమానులకు ముందే ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్ళలో ఉంటున్న ఏపీకి చెందిన విద్యార్థులు ఇతరవర్గాల వారికి భోజన సదుపాయాలు ఏర్పాటుచేశారు. బీహార్‌ తదితర ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీలు ఏయే జిల్లాలో ఎంతమంది ఉన్నారో కచ్చితమైన లెక్కలు సేకరించడాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ సమర్థత వెల్లడవుతున్నది. ఏ రాష్ట్రం వారైనా ఇక్కడ ఉన్నవాళ్ళంతా తమ బిడ్డలేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వలసవచ్చిన కుటుంబంలోని ప్రతి ఒక్క రికి ఐదు వందల రూపాయలు ఇవ్వడంతో పాటు, వారు సొంతంగా వండుకుంటే ఆహార వస్తువులు ఇస్తామని, లేదా వండి పెట్టే ఏర్పాట్లు కూడా చేశామని చెప్పడం ముఖ్యమంత్రి ఔదార్యాన్ని ప్రతిబింబిస్తున్నది. వలస కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మరే రాష్ట్రమూ చర్యలు తీసుకోలేదనేది స్పష్టం. చాలా రాష్ర్టాలలో వలస కార్మికులు అవమానకర, దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నా రు. కానీ తెలంగాణకు వచ్చిన కార్మికులు మన రాష్ట్ర వికాసం కోసం సాగుతున్న కృషిలో భాగస్వాములని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పడం ఉత్తమ సంస్కారాన్ని వెల్లడిస్తున్నది. కరోనా వంటి విపత్తులు ఎన్ని వచ్చిపోయినా అందరినీ ఆదరించే తెలంగాణ సంస్కృతి మాత్రం నిలిచే ఉంటుంది.


logo