మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Mar 30, 2020 , 22:55:43

ఖబడ్దార్‌!!

ఖబడ్దార్‌!!

నా దేశ మహావృక్షానికి

వేళ్ళు మన పల్లెటూళ్ళు..

వూళ్ళకు వూళ్ళు కత్తులు దూసి...

కరోనాకు కంచెలు పాతి

వీర సైనికుల్లా తొడగొడుతుంటే..

ఊరి బయటా, లోపలా

కాపలా కాస్తుంటే.. ఏమి దృశ్యం...!

ఇదే కదా పోరాట స్ఫూర్తంటే!

ఓ పట్నం వాసీ..

కాలు నిలకడలేని

తిరుగుబోతు పిపాసీ

‘కరోనా’ను నగరమంతా

వెదజల్లే ‘హక్కు’ ఎవడిచ్చాడురా నీకు?

కుదించుకుపోయిందా నీ 

అక్షర జ్ఞానం?!

గది గోడలే ఇంటి

‘కోట గడి’లుగా

వ్యూహమే బలమైన

ఆయుధంగా

నీ గుమ్మం చూస్తేనే

‘కరోనా’ గడగడలాడేలా

నిలువరించలేవా!?

ఈ నిశ్శబ్దం ఓ ‘యుద్ధం’

ఉబుసుపోక మాటలుండవే..

యుద్ధనీతి తప్ప!

రోడ్లు కూడా ఉగ్రంగా

మండుతున్నయ్‌!

రయ్యిరయ్యిన వస్తే.. మంటల్లో

తగలడిపోతావ్‌..!

సైనికుడిలా సమరం

సాగిస్తావో...

వినాశకుడిలా దొంగదెబ్బ తీస్తావో

తేల్చుకో..!!

అంతా నీ ‘ఇష్టం’ కాదు

కాలం కాపాలా కాసి..

నిన్నేరి పారేస్తుంది.. 

ఖబడ్దార్‌!!


మీ మంచికేనోయ్‌!

అంతా మీ మంచికేనోయ్‌!

కావాలంటే నా చుట్టూ అల్లుకున్న 

ప్రోటీన్‌ రింగ్‌ మీదొట్టు

నేనేం చేశానని? నన్నాడిపోసుకుంటున్నారు!

ఏమి కోల్పోయారో మీకే తెలియకుండా!

ఆధునిక టెక్నాలజీ మాయలో పడి

అనుబంధాలను వీడి,

పాత రోతను అసహ్యించుకొని

కొత్త వింతను, చెత్త పుంతలు తొక్కుతూ..

పల్లెలను మరచి, పట్టణాలను వలచి

ప్రేమానుబంధాలను తుడిచి

పాశ్చాత్య నాగరికతల వెంట నడచి

నమస్కారాలను నాశనం చేసి,

శుచి శుభ్రత మరిచి, మీరంతా చిందేస్తుంటే?

దేవుడు పంపిన కాలున్ని

క్రమశిక్షణలో పెట్టడానికి వచ్చిన శని దేవున్ని

మీరంతా భ..భయంగా పిలుచుకునే కరోనాని.

చెడు ఉంటేనే కదా మంచికి విలువ!

ఇకనైనా మారండిరా మానవాధముల్లారా!

శుభ్రత పాటిస్తే? పతా లేకుండా పరారవుతా.

మందు కనిపెడితే? తోక ముడుచుకుంటా?

తస్మాత్‌ జాగ్రత్త,

ఇట్లు.. మీ ప్రియమైన శత్రువు కరోనా!


logo