బుధవారం 03 జూన్ 2020
Editorial - Mar 29, 2020 , 22:17:27

కరోనాపై కలం పోరు

కరోనాపై కలం పోరు

  • ఒకే రోజు వంద పద్యాలతో కరోనాపై కలం పోరు

సమాజం కష్టకాలంలో ఉన్నప్పుడు కవులు ఎక్కడైనా ఏం చేస్తారు? ప్రజల మధ్యన నిలిచి కలా న్ని చేతబట్టి ప్రజల కోసం రాస్తారు. సరిగ్గా ఇప్పుడు ‘కరోనా’ కష్టకాలంలో సిద్దిపేట జిల్లాకు చెందిన భూమిపుత్రుడు బండికాడి అంజయ్యగౌడ్‌ కరోనాపై తన కలాన్ని కరవాలంగా సం ధించి ఒక్కరోజులోనే వంద పద్యాలు రాసి తనదైన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. కల్లు గీసిన చేతులతోనే కలం పట్టిన అంజయ్యగౌడ్‌ అలవోకగా పద్యాలు రాస్తాడు. ఆరో తరగతిలోనే చదువు మానేసినా, పది శతకాలు రాయటమే 

కాదు, అష్టావధానాలు చేస్తున్న అరుదైన  పండితుడు మన అంజయ్య. కరోనా వైరస్‌తో వణికిపోతున్న ప్రపంచానికి మార్గం చూపుతూ పద్యాలు రాసిన సహజ కవి అంజయ్యగౌడ్‌ తక్షణ స్పందన, సాహితీ ప్రస్థానం.. ఆయన మాటల్లోనే...

ప్రపంచాన్ని ఇవ్వాళ ‘కరోనా’ భూతం ఆవహించిం ది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టక నిర్లక్ష్యం వహించటం వల్ల చాలా దేశాలు మూల్యం చెల్లిస్తున్నయి. మన పాలకులు రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ లాక్‌డౌన్‌ ప్రకటించిండ్రు. ప్రజలంతా ఇండ్లల్లోనే ఉంటూ సామాజిక దూరాన్ని పాటించి కరోనాను కట్టడి చేయాలని పిలుపునిచ్చిండ్రు. ఈ సందర్భంగా నా వంతు బాధ్యతగా కరోనా వైరస్‌ భూతాన్ని దునుమాడుతూ ఒక్కరోజులోనే వంద పద్యాలు రాసిన. అందులో కరోనా పుట్టుక నేపథ్యాన్ని చెబుతూ..

‘తిక్కల చైనా వారలు / మెక్కిరి క్రిమికీటకముల మేలంచును నీ

వక్కడ జన్మించియు మము / త్రొక్కుట న్యాయమ్ముకాదు తొలగు కరోనా..’

‘జిద్దేలను మాతోడను / వద్దిక పోపొమ్ము మమ్ము వదలియు నిపుడే

రాద్ధాంతము జేయక నీ / ప్రొద్దే చైనా పురముకు లుబ్ద కరోనా..’ 

అంటూ రాసిన. అలాగే ఈ జాతి చైతన్యం, ఐకమత్యం ముందు కరోనా నీ పప్పులు ఉడకవని అంటూ..

‘ఇంకేమీ జేసెదరని / సంకటములు గలుగజేయ సాహసివై మా

వంకను జేరిన నీకును /జంకదు మా భారతీయ జనము కరోనా..’ 

అంటూ భరతజాతి కరోనాకు వెరువబోదని తేల్చిచెప్పిన. అలాగే..

‘ఔషధమే లేదంచు త / మాషను జూపంగబోక మానుము నికనీ

వేషము మాపంగను మా /  కాషాయమే చాలుచాలు కనవే కరోనా..’

‘అందరమొకటై నేడి / బందును పాటించి నీదు ప్రాణము దీయన్‌

ముందుకు వచ్చితిమిక మ / మ్మందక బరుగిడుటె దారి మహిని కరోనా..’ 

అంటూ.. కరోనా నిన్ను తన్ని తరుముతామని ప్రకటించిన. అలాగే మా ప్రభుత్వం, పాలకులు తీసుకుంటున్న చర్యలతో మేమంతా సుఖంగా బయట పడుతామనే భరోసానిస్తూ..

‘జనజీవనమాసించిన

ఘనుడగు మా ముఖ్యమంత్రి కార్యోన్ముఖుడై

నిను నెదిరించెడి పనిగా

జనతా కర్ఫ్యూవిధించే చావు కరోనా..’ అంటూ రాసిన. అలాగే..

‘మాముఖ్యమంత్రి సతతము

ప్రాముఖ్యత నిడుచు ప్రజల రక్షించుటకై 

వేమరు శ్రమియించుచు తా

నీ మరణము కోరుచుండె నిజము కరోనా..’ 

అని ప్రజారక్షకుడిగా సీఎం చేస్తున్న కృషిని చెబుతూ వంద పద్యాలు రాసి కరోనా రక్కసిని చెండాడిన. ప్రజలందరూ జాగరూకతతో కరోనా కోరలు విరువాలని పిలుపునిస్తున్నా.


ఇక నా జీవన సాహితీ ప్రస్థానం విషయానికి వస్తే.. 

బుద్దెరిగినప్పటి నుంచీ గట్కముద్దలు, చింతపండు తొక్కుతోనే కడుపు నింపుకున్న బతుకు నాది. నేటి సిద్దిపేట జిల్లా, తోగుట మండలంలోని వెంకటరావుపేట మా ఊరు. నాయన పేరు నర్సయ్య, అమ్మ బాగ మ్మ. నాయిన కల్లు గీత కార్మికుడు. నాకో తమ్ముడు, ఇద్దరు చెల్లెండ్లు. అయ్యొక్కడి కల్లుగీతతో వచ్చే ఆదా యం, ఏనాడూ మేమందరం కడుపార తిన్నది లేదు. ఏదైనా పండుగొచ్చిన నాడే ఇంట్లో తెల్లన్నం వండేది. అదే మాకు పండుగ పరమాన్నం. మా నాయనొక్కడు చేస్తే కుటుంబం గడువటం కష్టంగా మారింది. నేను కూడా ఓ చెయ్యేస్తే తప్ప.., పూట గడువని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మాఊర్లోనే ఆరో తరగతి చదు వుతున్న నేను, చదువుకు పుల్‌స్టాప్‌ పెట్టి బతు కు పోరాంటంల దుంకిన. బహుశా 1976-77 అనుకుంటా..బడి మానేసి కూలినాలి బాట పట్టిన. అప్పుడే నేటి సిరిసిల్ల ప్రాం తానికి 13వ ఏట ఈదుల(ఈత చెట్లకు)కు లొట్లు గట్టే పనికి గీత కార్మికునిగా పనిలో కుదిరిన.నెలకు నూటా పది రూపా యల జీతం వచ్చేది. 

‘పారిన గంజికి శిబ్బి తొర్ర తోడైనట్లు’గా నా సంపాదన నా చెల్లెండ్ల కు, తమ్మునికి కడుపు నింపింది. పెద్దోళ్లు ఈదులకు కల్లు గీసుకుంటూ పోతే, వారి వెనుక నేను ఈదులకు లొట్లు (చిన్న పాటి కుండ) కట్టుకుంట పోయేటో న్ని. అప్పుడు ఆ ఈత వనంలో గీత కార్మికులుగా పనిచేసేటోల్లు ఈదులపై కల్లు గీస్తూ పెద్దగా రాగం తీస్తూ యక్షగాన పాటలు పాడేటోళ్లు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆ ప్రాంతమంతా యక్షగాన పాటలతో ప్రతిధ్వనించేది. ఒకరు ఒక రాగమందుకుంటే, దానికి మరొకతను పోటీ రాగమందుకునేటోడు. ఆ గీత కార్మికులపాటలే నాలో సాహిత్య జవసత్వాలు నిం పినయి. ఆ పాటల రాగం, ఎత్తు పల్లాలు, ధార నన్ను కూడా ఓ పాటగాన్ని చేసినయి. విన్న పాటలన్నీ తిరిగి అదే రాగంతో పాడుకునేటోన్ని. వాటి నే  చేస్తున్న పనుల్లో అన్వయించి కొత్త పాటలు పాడుకునేది.ఆ పాటలపై ఏర్పడిన అనురాగమే నన్ను ఆ తర్వాతి కాలంలో పాటగాన్ని, రాతగాన్ని చేసినయి.

సిరిసిల్ల నుంచి మా ఊరికొచ్చి నేను కూడా గీత పని నేర్చుకొని ‘టీఎఫ్‌టీ’ లైసెన్స్‌ తీసుకున్న. దాంతో నాకు కల్లు గీసి అమ్ముకునే హక్కు వచ్చిందన్న మాట. మా ఊర్లో వీధి బాగోతాలు బాగా ఆడేవాళ్లు. పాటల పై నాకున్న ఆసక్తి, రాగధార విని మా ఊరోళ్లు బాగోతంలో వేషాలు ఇచ్చిండ్రు. అలా నా పన్నెండవ ఏట నే రామాయణంలో అంగదుని పాత్ర వేసిన. ఆ తర్వా త కాలంలో ఎక్కువగా స్త్రీ పాత్రలు వేసేవాన్ని.  ‘కీచక వధ’లో ద్రౌపది పాత్ర నాకు ఎంతో పేరు తెచ్చింది. యక్షగానంపై ఉన్న ప్రేమతోనే నేను మొదట ‘వేంకటేశ్వర కళ్యాణా’న్ని ‘తెలంగాణ యక్షగానం’గా రాసిన. 1995 నాటికి నేను కల్లుగీత కార్మికుని నుంచి ‘ముని మ్‌' (సూపర్‌వైజర్‌) అయిన.కొంత ఆర్థికంగా కుదు ట పడుతుండగానే 1998లో కల్లు కంపౌండ్‌లు బందయినై. దీంతో బతుకుదెరువు కోసం వలసబాట పట్టి బొంబాయి పోయిన. అక్కడ ఓ సారా దుకాణంల గుమస్తాగా చేరిన.ఆ ఉద్యోగంలనైతే చేరిన గని, ఆ సారా కొట్టుకొచ్చే మనుషులు, వారి జీవిత సంఘర్షణలు నన్ను అతలాకుతలం చేసేవి. 

ఆ సంఘర్షణలోం చే నేను పాటలల్లుకుపోయిన. అలా పాడుకున్న పద్యా లనే రాసుకున్న. ఆ పద్యాలను గురువర్యులు జీఎం రామశర్మగారికి చూయించిన. ఆయన పద్యాలను చూసి.. ‘అంజయ్యా గొప్పోనివయ్యా.. గొప్ప కంద పద్యాలు రాసినవయ్యా’ అని మెచ్చుకున్నరు. ‘నీలో గొప్ప పండితులకు లేని ధారశక్తి ఉం ద’ని చెప్తూ.. చిన్న చిన్న వ్యాకరణ దోషాలున్నాయని చెప్పి, ‘వాటిని నివారించుకుంటే నీకు తిరుగులేద’ ని ప్రోత్సహించారు. వ్యాకరణం, ఛందస్సుచదువమన్నారు. నిజా నికి అప్పటిదాకా నేను రాసినవి కందపద్యాలని నాకూ తెలువ దు. నాకున్న యక్షగాన ఒరవ డి, ధారతో రాసుకుంటూ పోయిన. రామ శర్మగారి సూచ న మేరకు విజయవాడ, రోహి ణీ పబ్లిషర్స్‌ నుంచి ‘సులక్షణ సారం’ గ్రంథాన్ని తెప్పించుకొని చదివిన. అప్పటినుంచి ఛందస్సు, వ్యాకరణ శాస్త్రంపై పట్టుసాధించి పద్యాలు రాస్తున్న. 

ఆ తర్వాతకాలంలో ‘ఆటవెలది’లో రేణుకాదేవి శతకం, ‘సీస పద్యం’లో చంద్రమౌళీశ్వర శతకం, ఉత్పలమాల, చంపకమాలలో ‘వేంకటేశ్వర శతకం’.. ఇలా పది శతకాలు రాసిన. ఏడుపాయల వనదుర్గ శతకం ‘ఏక ప్రాస’లో రాసిన. 

తెలుగు సాహిత్యంలో ‘ఉదాహరణము’ అనే పద్య ప్రక్రియను ప్రారంభించిన పాల్కుర్కి సోమన స్ఫూర్తి ని పునికిపుచ్చుకొని.. ‘ఆంజనేయ ఉదాహరణము’, ‘శ్రీకృష్ణదేవరాయ ఉదాహరణము’ రాసిన. ఇప్పటిదా కా తెలుగు సాహిత్యంలో ‘ఉదాహరణము’లు 150 దాకా ఉంటే అందులో నేను రాసినవి రెండున్నయ్‌. 16 పుస్తకాలు ప్రచురించిన. రెండు అచ్చులో ఉన్నవి. 

నా రచనలు చూస్తే అవన్నీ భక్తి, పురాణేతిహాసాలు అనిపిస్తుంది. సామాజిక జీవనం ఉండదనే అపోహ కలుగుతుంది. వాటిలోనూ నేను సామాజికాంశాలను మర్చిపోలేదు. సామాజిక సమస్యలను, మౌఢ్య పోకడలను నిరసిస్తూ ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న. ఉదాహరణకు.. 


సీ. ‘అంగారకునిపైన అడుగిడె మనుజుండు

మూఢభక్తిని వీడలేడు జగతి

చంద్రలోకంపైన చరణములు మోపినా

పశుబలి వీడరీ పాపినరులు..’ అని రాసుకున్న.  అలాగే..

శా. గయ్యాలైన కులాంగన ధరణిలో 

కాపట్యులౌ పుత్రులున్‌

నెయ్యంబెరుగని బంధువర్గము 

హితుల్‌ నీచాత్ములౌ మిత్రులున్‌

కుయ్యాలించని తల్లిదండ్రులు 

ధరణ్‌ క్రూరాత్ములౌ సోదరుల్‌

అయ్యా పాము విషంబుకంటే 

గణమయ్యా రాజరాజేశ్వరా..’ అని ‘రాజరాజేశ్వర శతకం’లో రాసిన.

‘మానవ సేవే మాధవసేవ’ అని నమ్ముత. నేను పద్యకవినే అయినా.. పల్లెనూ, మనిషినీ మర్చి పోలే దు. నా పాట, పద్యం వారి కోసమే. పద్యానికి పట్టం గట్టి ప్రజా కాంక్షలను గానం చేస్తున్న. ఏ కష్టం వచ్చి నా ప్రజలకు నేనున్నానని చెబుతూ.. నా వంతు కర్త వ్యాన్ని నిర్వర్తిస్తున్నా...

- ఎస్‌.మల్లారెడ్డి, 80966 77255


logo