బుధవారం 03 జూన్ 2020
Editorial - Mar 29, 2020 , 22:13:31

నీ దేహమే శత్రుస్థావరమైతే

నీ దేహమే శత్రుస్థావరమైతే

టీవీల్లో పెద్దాయన ఆదేశం కరోనాపై కవితలు రాయాలని..

టీవీల్లో పెద్దాయన ఆదేశం

కరోనాపై కవితలు రాయాలని..

దూరదృష్టికి సలాం-మంచి మాటకు గులాం!

సామాజిక సంక్షోభమే-కవుల జన్మక్షేత్రం

అక్షరాల హార్మ్యాలకు

వేదనలే పునాది.. ఆవేశమే నిర్మాణశక్తి!

కంటికి కనిపించని జీవి కూడా

ప్రపంచంపై యుద్ధం చేయగలుగుతున్నప్పుడు

కొమ్మకు వేలాడే గబ్బిలాలు

ముస్సోలినీ, హిట్లర్లను మించినప్పుడు

అక్షరం నేర్వని చేతులు కూడా

కవిత్వం రాయగలవు..!

తూర్పు దిశన పొడిమె అరుణరేఖ

నవోదయపు వెలుగులకు బదులు

మారణహోమపు చీకట్లను చిమ్మినపుడు

సెల్‌ఫోన్‌ టవర్ల శ్రుతిమించిన రేడిషేషన్‌కు

రాలుతున్న పిట్టల్లా విలవిలలాడుతూ...

ఐదారడుగుల మనుషులు.. నేలరాలుతున్నప్పుడు

స్పందించే ప్రతి హృదయ ప్రతిస్పందనలో

జనించదా కవిత్వం?

చూడు చూడు నిశితంగా..!

రవి అస్తమించని సామ్రాజ్యాధినేతలు మా తాతలని

జగతిని తమ పిడికిట్లో బంధించిన నేతలని

విర్రవీగిన రాజవంశపు వారసత్వం..

జర్మన్‌ విమానాల బాంబుల వర్షంలో సైతం

ప్రపంచ యుద్ధాలలో క్షేమంగా సేదదీర్చిన

రాజప్రసాదం..

నలభై వేల విద్యుద్దీపాలతో కాంతులు విరజిమ్మే

బకింగ్‌ హాం ప్యాలెస్‌.. కాంతి విహీనమైనపోగా

కనిపించని శత్రువుతో పోరాడేదెలాగో తెలియక

ప్రాణవాయువు వెదుక్కుంటూ.. ఆప్తులకు దూరంగా

రాజూ రాణీ తరలిపోయారెచటకో..!

‘హార్ట్‌ ఇమ్యూనిటీ’యే శ్రీరామరక్ష అని నమ్మి

‘కరోనా.. ఆవోనా..’ అంటూ స్వాగతించి

వైరస్‌పై పోరులో మా స్టయిలే వేరని చాటి

శత్రువును బరిలోనికి  రానిచ్చి

ముప్పేట ‘ఇమ్యూనిటీ’ దాడితో గెలుస్తామన్న

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

చారిత్రక తప్పిదంతో.. చతికిలపడ్డ తీరు..

వేల యుద్ధాల విజేతలపై

సూక్ష్మాతి సూక్ష్మజీవి విజయం..!

సామాన్యున్ని సైతం సహస్ర్తావధానిగా మలుస్తుంది

ఆలస్యమెందుకు? అందుకో కలం.. ..!

నాదిర్షా, గడాఫీ, సద్దాం, బిన్‌లాడెన్‌

ఎవరైతేనేం..?

మాట వినని దేశాధితనేలను

మట్టి కరిపిస్తామని

దేశోదయానికి పూర్వమే

యుద్ధరీతులు నేర్చి

సామ్రాజ్యవాదమే మా ‘వేద’ మంటూ

ఒక్కొక్క ఆదిమ జాతిని అంతం చేస్తూ

ఆఫ్ఘన్‌, ఇరాక్‌పై నిన్నటి యుద్ధాల దాకా 

పశ్చిమ దేశమే, ప్రపంచ దిశను శాసిస్తుందని

వందకు మించిన దేశాల్లో

లక్షల్లో సైన్యాన్ని దింపి

సంపద మాదే.. సంస్కృతి మాదే..

పాలన మాదే.. జ్ఞానం మాదేనంటూ..

ప్రపంచ దేశాలను గుప్పిట్లో పెట్టుకున్న

అగ్రరాజ్యం!

శాటిలైట్‌ రాకెట్‌ వేగాన్ని మించి

వూహాన్‌ నుండి దూసుకొస్తున్న 

గబ్బిలపు పెనుముప్పును

అంచనా వేయడంలో విఫలమైంది..!

ఏ అహంకారపు మేఘాల పొరలు

అడ్డు నిలిచాయో!

శతాబ్దాల పాపాలకు మూల్యం చెల్లిస్తూ

స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ సాక్ష్యంగా

వందలాది శవాలతో వణికిపోతున్న

ప్రపంచ వాణిజ్య రాజధాని,

తనకెదురే లేదన్న విశ్వవిజేత బలాన్నీ, బలగాన్నీ

సూక్ష్మదర్శినికందని జీవి.. మట్టి కరిపిస్తున్న తీరు..

సాహిత్యం తెలియని వాడిని కూడా కాళిదాసు వలె

మహాకవిగా మారుస్తుంది..!

మరో ప్రపంచయుద్ధం / జలయుద్ధమనుకున్నాం

అణుయుద్ధ మనుకున్నాం.. కానీ

జల తుంపరలే సకలశస్ర్తాలకన్న

శక్తివంతమనుకోలేదు..!

అనుబంధపు ఆలింగన స్పర్శలే

అణబాంబులకన్న ప్రమాదమనుకోలేదు..!

గవాక్షాలే రక్షణ రేఖలవుతాయని

ఏనాడైనా అనుకున్నామా..?

కరచాలనాలే కాటికి సాగనంపే

యమదూతలని కలగన్నామా..?

ఏ నేత మొదలుపెడుతాడోనని

ఎదురుచూస్తుంటే...

నియంతలకే చెమటలు పట్టిస్తూ

ఈ అప్రకటిత యుద్ధం చేస్తూ

వేలాది ప్రాణాలను కబళిస్తున్న

కనిపించని శత్రువెవరు?

దేశంలోనికి రానిచ్చిందెవరు?

దేహమే శత్రుస్థావ రమైతే

మనిషికిక దిక్కెవరు?

నానోగ్రాములో వెయ్యవవంతులేని

అత్యల్ప జీవికి,

మహాబలుడైన మానవుడు

లోకువైనాడా?

దశాబ్దాల నిర్లక్ష్యానికి..

దేహం చెల్లిస్తున్న మూల్యం!

బాత్రూంలలో బండలపై వున్న శ్రద్ధ

ఏనాడైనా గుండెల పనితీరుపై చూపినామా?

కణజాలపు విధ్వంసాన్ని నివారించే 

రోగనిరోధక వ్యవస్థను

పట్టించుకోని పాపమిది!

పోషకాహార విలువలు విస్మరించి

జిహ్వచాపల్యపు మత్తులో..

బంక ఫుడ్డు (మైదా), జంకుఫుడ్డూ తింటున్నాం..

గద్దల్ని, గబ్బిలాలనూ అరిగించుకుంటున్నాం..

జవసత్వాలిచ్చిన మట్టికి

మరణశాసనం రాసినాం..

కృత్రిమ రసాయన జీవనశైలితో 

సనాతన జీవన విలువలకు

శతకోటి సంవత్సరాల త్యాగాల మహాజ్ఞాన సంపదకు

తిలోదకాలిచ్చిన వైనం!

క్షమాగుణం-కవి స్వంతం

కవి మానవతావాది-కవి సంఘజీవి

కవిత్వం సమాజహితం-భవిష్యద్దర్శనం..!

‘కరోనా ఫోబియా’ మానవాళిని పట్టిపీడిస్తుంటే

‘సెల్ఫ్‌ క్వారంటైన్‌'లో చేతులు ముడుచుకు కూర్చోవద్దు..

కలంతో కదనానికి సిద్ధం కావాలి

సోషల్‌ మీడియాతో ‘సోయి’ తెప్పించాలి

కవిత్వమే ‘ఫోబియా’ను జయించే

అసలు సిసలైన అస్త్రం!

మనిషి దేహమే యుద్ధభూమిగా మారినప్పుడు

హెచ్చరికలే లేకుండా శత్రుమూక

హృదయాంతరాలల్లోని కోట్ల కణాలపై

నిశ్శబ్ద సమరాన్ని సాగిస్తుంటే

విటమిన్లు, మినరల్స్‌, ఫైటో న్యూట్రియంట్స్‌ ప్రోటీన్లే

విష్ణు చక్రాలు, రామ బాణాలు..!

వైరస్‌ కణకణాన్ని రణక్షేత్రంగా మార్చినప్పుడు

రోగ నిరోధక శక్తిని పెంచే హార్మోన్లే రక్షణ కవచాలు

‘బయోవార్‌'ను గెలిచే శక్తి ‘న్యూరాన్ల’కే స్వంతం

భావజాలం కూడా మెదడు కణజాలపు జీవశక్తే!

కాళన్న యాది...

‘ఒక్క సిరా చుక్క-లక్ష మెదళ్ళకు కదలిక..’

అసలు వ్యాక్సిన్‌ కనుగొనే దాకా.. కరోనాపై..

అక్షరమే ఆయుధం....

- వి.ప్రకాశ్‌, 9000950400


logo