శుక్రవారం 05 జూన్ 2020
Editorial - Mar 28, 2020 , 22:21:11

సామాజిక దూర-బంధం

సామాజిక దూర-బంధం

ఈ సంక్షోభ సమయంలో పాత పగ లు మరిచిపోదాం. మళ్లీ మాటలు కలుపుకుందాం. ఉన్నదంతా మనింట్లోనే ఉండాలన్న ధోరణి మరిచి, తలాయింత, తలాకొంత అని పంచుకుందాం. సోషల్‌ మీడియాను, సమయాన్ని, డేటాను కాలక్షేపానికి, వదంతుల వ్యాప్తికి వృథా చేయకుండా తోటి మనిషికి సాయపడేందుకు ఉపయోగిద్దాం. అందుకు మంత్రి కేటీఆర్‌ను ఆదర్శంగా తీసుకొందాం. అభాగ్యులకు ఆపన్న హస్తం అందించే వేదికగా అవాస్తవాలను చీల్చి చెండాడే వాస్తవ కరవాలంగా సోషల్‌ మీడియాను వాడుకొందాం. ఆర్తులను ఆదుకోవడం, అబద్ధాలను మట్టుపెట్టడం ప్రభుత్వం పనే కాదు; అది మనందరి కర్తవ్యం కూడా. ఈ అచేతనావస్థలో చైతన్యం తెచ్చేది మనిషే!

‘సార్‌.. మా అబ్బాయి కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ పోయాడు. రెండ్రోజుల క్రితం హాస్టల్‌ క్లోజ్‌ చేశారు. ఇప్పుడెక్కడ ఉన్నాడో తెలియడం లేదు’ అని రాష్ట్రం వెలుపలి నుం చి ట్వీట్‌ చేస్తారొకరు. ‘చదువుకునేందుకు ఇటలీ వచ్చి ఇక్కడనే చిక్కుకుపోయినం. ఎట్లాగైనా మమ్మల్ని హైదరాబాద్‌ తీసుకుపోండి’ అని ఏడుస్తూ సందేశం పంపిస్తారు ఇంకొకరు. ‘మా రాష్ట్రం వాళ్లు మీ రాష్ట్రంలో ఉండిపోయారు. ప్లీజ్‌ హెల్ప్‌' అని పొరుగు రాష్ట్రం మంత్రి ఒకరు అభ్యర్థిస్తారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ సెల్‌ఫోనే ఒక ఇన్ఫర్మేషన్‌ జంక్షన్‌. సోషల్‌మీడియా ఆయనకొక సామాజిక కేంద్రం. కొత్త బంధుత్వాల కూడలి. నవీన మానవ సంబంధాల వేదిక. సమస్యలను తీర్చే పరిష్కార ఆయుధం. ఒకవైపు రీ ట్వీట్లతో కేటీఆర్‌ బదులిస్తుండగానే, ఆయన కింద పనిచేసే యంత్రాంగం,  అసహాయులను గుర్తించి ఆదుకునే పనిలోకి దిగుతుంది.

దూరం- బంధం నిజానికి విరోధాభాసాలు. బంధం ఉంటే దూరం కారు. దూరమై తే బంధం ఉండదు. చాలామంది, తమకు సన్నిహితులుగా భావించేవారితోనే, కలిస్తే విడువరు.. విడిస్తే తలువరు’ పద్ధతిలో యాం త్రికమైన బంధాలను కొనసాగిస్తుంటారు. ఇదెలాగూ టెక్నాలజీ శకం కనుక మానసిక బంధా ల కన్నా యాంత్రిక సంబంధాలే ఎక్కువ అని సమర్థించుకోవచ్చు. కానీ మనిషి సోషల్‌ యానిమల్‌. అంటే సంఘజీవి! నేటికాలపు తెనిగింపులో అయితే సామాజిక జంతువు’! అనివార్యంగా సామాజిక దూరం పాటించాల్సిన కరోనా యుగంలో, సామాజిక సంబంధాలను పునర్నిర్వచించుకోవడం, మనం సామాజిక స్పృహతో నిర్వర్తించాల్సిన సామాజిక బాధ్యత! మనం బయటకు వెళ్లకపోతే ప్రపంచం మునిగిపోతుంది... మనం అవసరానికి మించి డబ్బు సంపాదించకపోతే అంతర్జాతీయ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది... మన పిల్లల్ని రెసిడెన్షియల్‌ కాలేజీలో చేర్చకపోతే విద్యారంగం వట్టిపోతుంది.. రోజూ ధాబాలో బిర్యానీ తినకున్నా, బార్లో మందు తాగకున్నా సూర్యోదయం ఆగిపోతుంది... అనుకుంటూ, ఇంతకాలం ఊపిరి సైతం తీసుకోకుండా, పెళ్లాంతో సైతం మాట్లాడకుండా, తిండి తినకుండా, నిద్రపోకుండా ఉరుకులు పరుగుల బిజీ జీవితం గడిపిన మనం, మన ఆగమంతా అర్థం లేని భ్రమే అని తేల్చినందుకు కరోనాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆఫ్టరాల్‌  నువ్వు న్నా లేకున్నా, తిరిగినా తిరగకున్నా భూగోళ మేమీ కళ్లుతిరిగి పడిపోదని చెప్పినందుకు  కరోనాని వినువీధి వినేలా అభినందించాలి. ప్రపంచం మనమీద కాదు; మనిషే ప్రపంచం మీద ఆధారపడి ఉన్నాడన్న నిష్టుర సత్యాన్ని నిటారుగా నిలబెట్టి మరీ చాటిచెప్పిన కరోనా తో, ముప్ఫై అడుగుల దూరం నుంచే కరచాల నం చేయాలి. సంపాదన సంగతి తర్వాత, బతికుంటే బలుసాకు తినొచ్చని ఎవడింట్లో వాడు నక్కేలా చేసి, మన అర్భకత్వాన్ని అట్లా స్‌ మీద వేలాడదీసిన కరోనాకు చప్పట్లు కొట్టి మరీ విశ్వవ్యాప్త ధన్యవాదాలు వినిపించాలి. చిరు జీవి అయితేనేం? మొత్తం జగత్తునే బిగ్‌బాస్‌ హౌస్‌గా, కోట్లమందిని అందులో బందీలుగా మార్చి, క్షణం క్షణం టాస్కులిచ్చి మరీ టాలెంటును పరీక్షిస్తున్నది కరోనా కణం! మనిషీ... గెలుస్తావా? ఓడుతావా?

నాగరికత పేరుతో విచ్చలవిడిగా వీరంగం వేస్తున్న మనిషి ప్రవర్తన మారాలని చేసిన హెచ్చరికలా కనిపిస్తోంది కరోనా! షేర్‌ మార్కె ట్లు, రియల్‌ ఎస్టేట్‌ ధరల్లాగే ప్రకృతి కూడా ఒక కరెక్షన్‌ కోరుకుంటున్నదని చాటిచెప్పింది  కరోనా! మనిషి కంటికి మనిషి... రూపాయి లా, డాలర్లా, వ్యాపార వస్తువుగా మాత్రమే కనిపించిన నిన్నటి వినియోగ యుగంలో, మానవ సంబంధాలంటే ఏమిటో మరోసారి గుర్తుచేసింది కరోనా! ఆధునిక మానవ జాతి చరిత్రను కరోనాకు ముందు-కరోనా తర్వాత’ అని అధ్యాయ విభజన చేసుకోవాల్సిన అగత్యమిది. సార్వభౌముడు-సామాన్యుడు, ధనికు డు-నిరుపేద,పెద్దవాడు-చిన్నవాడు అందరూ ఒకటే ఇప్పుడు! కమ్యూనిజం కనుమరుగైతేనేం! ఇది కరోనా కమ్యూనిజం. ఇప్పుడు నీకు నువ్వే నిక్కచ్చిగా ఒక ప్రశ్న వేసుకో! అన్న నో, తమ్ముడో, అక్కో, చెల్లో ఇప్పుడెవరైనా నీ ఇంటికొస్తే అనుమానంగా చూడకుండా ఆదరించగలవా? అసలు రమ్మని మనస్ఫూర్తిగా పిలవగలవా? నీ భార్యకు పులకరం వచ్చి గాఠ్ఠిగా ఒక తుమ్ము తుమ్మితే, జడుసుకోకుం డా ఆప్యాయంగా పలకరించగలవా? పక్కరూములో ఒంటరిగా పండుకోబెట్టనని మాట ఇవ్వగలవా? దగ్గరివాడెవడైనా దగ్గుకుంటూ చనిపోయాడని తెలిస్తే అంత్యక్రియలకు వెళ్లి పాడె పట్టగలవా? ముమ్మారు దింపుడు కళ్లం ఆశలు దించగలవా? నటించడం ఇక అనవస రం. నీకు నువ్వే నిజాయతీగా జవాబు చెప్పు కో? చేయగలవా? లేదా?

ఇప్పుడు నీకు నీ వాళ్లు లేరు. నాకు నా వాళ్లు లేరు. ఎవరికెవరు ఈ లోకంలో? నా వరకు నాకైతే... ఇంట్లో ఉన్నా మనసు దేని కోసమో పరితపిస్తోంది. ఎవరినీ కలవలేక, కనీసం చేతిలో చెయ్యైనా కలపలేక, మానవాళి అంతా సూతకం (సుష్టి) పాటిస్తున్నట్టు అనిపిస్తున్నది. పలు దేశాల్లో ప్రాణాలు విడుస్తున్న నా లక్షలాది విశ్వమానవ సహోదరుల  ఆత్మశాంతి కోసం 40 రోజుల నిర్బంధ అశౌచమేమో ఇది! నీ ఇంట్లో ఉన్న నలుగురే నీకు కాకుండా పోతున్న సమయంలో, భౌతిక కాయాలను చెత్త రిక్షాల్లో తరలిస్తున్న తరుణంలో... మనిషి మనిషిని ఆత్మ బంధువుగా భావించడమొక్కటే అసలు బం ధం. పాటించాలన్నది సామాజిక దూరమే కదా! మానసికమైన ఎడబాటు కాదు గదా!  కరోనాకు కరుణ లేదని వాపోతున్న మనిషీ, నువ్వెప్పుడో మరిచిపోయిన మానవత్వాన్ని మనసు మూలల్లోంచి మళ్లీ వెతికి వెలికి తీయ్‌! నువ్వు ఇంట్లో దాక్కున్నావు సరే! నీలో దాక్కున్న మనిషితనాన్ని బయటకు తియ్‌.

‘ఫేస్‌బుక్‌లోకి వచ్చి దశాబ్దం దాటింది. ఈ పదేండ్లలో ఈ వేదికమీద ఎన్నో వాదవివాదా లు జరిగాయి. కొందరిని అన్‌ఫ్రెండ్‌ చేశాను. తీవ్రమైన అభిప్రాయ భేదాల వల్లనో,  అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారనో కొందరిని బ్లాక్‌ కూడా చేశాను. కానీ కరోనా నా ఆలోచ నా విధానాన్ని మార్చింది. ప్రకృతి పట్ల, సాటి మనిషి పట్ల మరింత బాధ్యతగా మెలగాలని తెలియజెప్పింది. రాగద్వేషాలకు, విమర్శ- ప్రతి విమర్శకు, ఇజాలు, ఈగోలకు  ఇది సమ యం కాదు. ప్రతి వ్యక్తీ సాటి మనిషి పట్ల దయతో మెలగాలి. మన కుటుంబసభ్యుల పట్ల మరి కొంచెం ప్రేమ చూపించాలి. ఆపద లో ఉన్నవారికి సాయం అందించాలి. అందు కే నేనూ మారడం మొదలుపెట్టిన. గత పదేం డ్లుగా ఫేస్‌బుక్‌లో వివిధ కారణాలతో, క్షణికావేశంతో బ్లాక్‌ చేసిన వారందరినీ అన్‌బ్లాక్‌ చేశాను’

ఇది సోషల్‌ మీడియా నిపుణుడు దిలీప్‌ కొణ తం పెట్టిన పోస్టు. ఎంత గొప్ప పశ్చాత్తా పం. ఎంతటి మనఃపూర్వక  పరివర్తన. ఎంత ఔచిత్యమైన ప్రాయశ్చిత్తం! ఇంకా ఆయన అంటా రు... ‘ఇప్పుడున్న పరిస్థితిలో అందరూ నా వాళ్లే! నేను కేవలం ఒక మామూలు మనిషిని!’ ఎం తటి వాస్తవికత? ఎంతటి నిర్మో హత?దిలీప్‌ చెప్పుకొన్నారు. చెప్పకుండా ఆచరిస్తున్నవా ళ్లు ఇంకెందరో! అన్నార్తులకు సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నవారిని చూస్తే ఆశ్చర్యం కలిగిం ది. మామూలు రోజుల్లో మతం, ఇజం, ప్రమాణాలు, తదితర రకరకాల అభిప్రాయ భేదాలతో వాదించుకునే విభిన్నరకాల వ్యక్తులంతా, ఒకే గదిలో మూడడుగుల దూరంతో,  చాలా దగ్గరైన మనసులతో మాట లు పంచుకున్నారు. వారి చర్చంతా ఒకే ప్రశ్న చుట్టూ తిరిగింది. అర్తుల చేతికి బుక్కెడంత అన్నం ముద్దను ఎలా అందివ్వగలం? ఆ స్వచ్ఛంద సైనికులు మనకు ఏమవుతారు? 67 ఏండ్ల వయసులో ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా జరుపుతున్న నిర్విరామ సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచ న, అధికారుల మేధో మథనమంతా  ఒకే ప్రశ్న చుట్టూ తిరిగింది. ఎవరెవరి కి ఎలా సాయపడగలం? కేసీఆర్‌ మనకు ఏమవుతారు? ప్రాణాలకు ప్రమాదమని తెలిసీ చికి త్స చేస్తున్న వైద్యుడు మనకేమవుతాడు? నీవాళ్లు నీ దగ్గరికి రావడానికే భయపడుతున్నప్పుడు నిరంతరం సేవలందిస్తున్న నర్సు నీకేమవుతుంది? నీ ప్రాణా న్ని కాపాడేందుకు తన ప్రాణాన్ని నడిరోడ్డు లో ఎండకు ఎర గా వేసిన కలెక్టరు గారు నీకేమవుతారు? నిన్ను రక్షించేందుకు తాను అరక్షితం గా రోడ్డుపై నిలిచిన పోలీసన్న నీకేమవుతాడు? విశాల మహా భాగ్యనగరం మొత్తాన్నీ, అంగు ళం అంగుళ మూ క్రిమిసంహారక మందుతో తడిపి శుభ్రం చేస్తున్న సఫాయి తమ్ముడు నీకేమవుతాడు?

‘సార్‌.. మా అబ్బాయి కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ పోయాడు. రెండ్రోజుల క్రితం హాస్టల్‌ క్లోజ్‌ చేశారు. ఇప్పుడెక్కడ ఉన్నాడో తెలియడం లేదు’ అని రాష్ట్రం వెలుపలి నుం చి ట్వీట్‌ చేస్తారొకరు. ‘చదువుకునేందుకు ఇటలీ వచ్చి ఇక్కడనే చిక్కుకుపోయినం. ఎట్లాగైనా మమ్మల్ని హైదరాబాద్‌ తీసుకుపోండి’ అని ఏడుస్తూ సందేశం పంపిస్తారు ఇంకొకరు. ‘మా రాష్ట్రం వాళ్లు మీ రాష్ట్రంలో ఉండిపోయారు. ప్లీజ్‌ హెల్ప్‌' అని పొరుగు రాష్ట్రం మంత్రి ఒకరు అభ్యర్థిస్తారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ సెల్‌ఫోనే ఒక ఇన్ఫర్మేషన్‌ జం క్షన్‌. సోషల్‌ మీడియా ఆయనకొక సామాజిక కేంద్రం. కొత్త బంధుత్వాల కూడలి. నవీన మానవ సంబంధాల వేదిక. సమస్యలను తీర్చే పరిష్కార ఆయుధం. ఒకవైపు రీ ట్వీట్ల తో కేటీఆర్‌ బదులిస్తుండగానే, ఆయన కింద పనిచేసే యంత్రాంగం, అసహాయులను గుర్తించి ఆదుకునే పనిలోకి దిగుతుంది. సోష ల్‌మీడియా యాంటీ సోషల్‌గా ముద్రపడిన పరిస్థితిలో కేటీఆర్‌ దాన్ని వాడుకుంటున్న తీరు అద్భుతం. కేటీఆర్‌కు ట్వీట్‌ పెడితే సాయం అందినట్టేనన్నది అభాగ్యుల విశ్వా సం. కనీస పరిచయం లేని కేటీఆర్‌ వారికి ఏమవుతారు? దేశ ప్రధాని మొదలుకొని దవాఖానాలో నేల తుడిచే వార్డు బాయ్‌దాకా మనకేమవుతారు? వారితో మనకున్నదేమి టి.. ఆత్మ బంధం తప్ప. మనిషితనం తప్ప!  ఈ సంక్షోభ సమయంలో పాత పగలు మరి చిపోదాం. మళ్లీ మాటలు కలుపుకొందాం. ఉన్నదంతా మనింట్లోనే ఉండాలన్న ధోరణి మరిచి, తలాయింత, తలాకొంత అని పంచుకుందాం. సోషల్‌ మీడియాను, సమయాన్ని, డేటాను కాలక్షేపానికి, వదంతుల వ్యాప్తికి వృథా చేయకుండా తోటి మనిషికి సాయపడేందుకు ఉపయోగిద్దాం. అందు కు మంత్రి కేటీఆర్‌ను ఆదర్శంగా తీసుకొందాం. అభాగ్యులకు ఆప న్నహస్తం అందించే వేదికగా అవా స్తవాలను చీల్చి చెండాడే వాస్తవ కరవాలంగా సోషల్‌ మీడియాను వాడుకొందాం. ఆర్తులను ఆదుకోవడం, అబద్ధాలను మట్టుపెట్టడం ప్రభుత్వం పనేకాదు; అది మనందరి కర్తవ్యం కూడా. ఈ అచేతనావస్థలో చైత న్యం తెచ్చేది మనిషే! ఎవరికి ఏం కావాలో గుర్తిద్దాం. మనమేం చేయగలమో చేద్దాం. ఎందుకంటే మనం మనుషులమని కరోనా గుర్తుచేసింది కదా! కొంచెం దూరంగా ఉన్నప్పుడే అనుబంధాలు బతికి బయటపడతా యి. ఇప్పుడు దూరంగా ఉండటమూ అవసరమే. సాటి మనిషి పట్ల అనుబంధం చూపడమూ అవసరమే! 

- కృ.తి.


logo