బుధవారం 03 జూన్ 2020
Editorial - Mar 28, 2020 , 22:16:19

మాయావిని మసి చేసేదెలా?

మాయావిని మసి చేసేదెలా?

కరోనా వైరస్‌ గురించి మొదటినుంచి అవగాహనతో వ్యవహరిస్తున్నది తెలంగాణ రాష్ట్రమే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమస్యను లోతుగా అధ్యయనం చేయడమే గాక నిర్దిష్టమైన పరిష్కార మార్గాలను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వైరస్‌ తెలంగాణలో అడుగుపెట్టిన వెంటనే ముఖ్యమంత్రి విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గాంధీ దవాఖానాను కరోనా ప్రత్యేక వైద్య సదుపాయాలకు కేటాయించారు. అలాగే ఛాతీ వ్యాధుల దవాఖానా, ఇతర దవాఖానాల్లో కూడా కావలసిన వసతులు కల్పించాలని పురమాయించారు. 

వూహాన్‌ నగరంతో పాటు హుబై ప్రావిన్స్‌లో వ్యాధి తీవ్రత పెరిగి దాదాపు ఐదారు వందల మందిదాకా దవాఖానా పాలై  అనేకమంది మరణించిన తర్వాత చైనా మేలుకున్నది. కానీ తెలంగాణ చాలా మొదటగా వైరస్‌ తీవ్రతను అర్థం చేసుకోవడమే కాకుండా ప్రజలకు అవగాహన కలిగించే చర్యలు చేపట్టింది. సమస్యను శాసనసభలో ఒకటికి రెండు సార్లు చర్చించి, తీసుకోబోతున్న చర్యలను వివరించింది. దీనికోసం మార్చ్‌ 14న ముఖ్యమంత్రి స్వయంగా ఉన్నతస్థాయి  సమావేశం నిర్వహించి పరిస్థితి సమీక్షించారు. వూహాన్‌లో చేసిన విధంగా జన సంచారాన్ని నియంత్రిం చి కట్టడి చేయాలని భావించారు. అన్నిరకాల విద్యా సంస్థలను మూసివేశారు. జనం గుమిగూడే ప్రదేశాలను నియంత్రించారు. సభలు, సమావేశాలు, బహిరంగసభలు, ఊరేగింపు లు రద్దు చేశారు. బార్లు, పబ్బులు, పార్కులు ప్రాంతాలనూ మూసివేశారు. ఇది బయటికి నిషేధం లాగో, నియంత్రణ లాగో ఉన్నప్పటి కీ ప్రజలకు వ్యాధి తీవ్రతపైన అవగాహన కలిగించడం, వారిని దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధం చేయడం దీని ఉద్దేశం. ఇది ఊహించని స్థాయిలో విజయవంతమైంది. మరోవైపు ఈ సమయాన్ని ప్రభుత్వాన్ని సమాయత్తం చేయడానికి వాడుకున్నారు. విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే వారి మీద నిఘా పెట్టా రు. ప్రత్యేక నిధితో పాటు, వార్డులు, మంచా లు, వెంటిలేటర్లు ఇలా సమస్తం సిద్ధం చేశా రు. వైద్యులు, ఇతర సిబ్బందిని సన్నద్ధం చేశా రు. చైనాతో పాటు తూర్పు ఆసియా దేశాలు ఇదే వ్యూహంతో వైరస్‌ను నిలువరిస్తూ వచ్చాయి.

రెండో దశలో - కరోనా సోకినవారిని గుర్తించడం, వారిని కట్టడి చేయడం, జనంలో కలువకుండా నిలువరించడం ప్రాథమికమైనది.  సమస్య విదేశీ ప్రయాణికుల నుంచే వస్తున్నందున విమాన రాకపోకలు తక్షణమే నిలిపివేయాలని కేం ద్రాన్ని కోరడంతో పాటు, సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టులన్నీ ప్రభుత్వం మూసివేసింది. అలాగే మార్చి 1వ తేదీ తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. వ్యాధి ప్రబలకుం డా, స్థానికులకు సోకి రెండో దశకు చేరకుండా కట్టడి చేయాలని భావించింది. నిజానికి ఇది అత్యంత కీలకం. మార్చి 19న మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ అనేక అంశాల ను ప్రజలకు పూసగుచ్చినట్టు వివరించారు. ‘మిమ్మల్ని కాపాడటానికి మీ బిడ్డగా నేనున్నా ను’ అని హామీ ఇచ్చారు. ఆ రోజు ఆయన పిల్లల కోసం తల్లడిల్లే  తండ్రిగా, తల్లిదండ్రులకు తపించిపోతున్న కొడుకుగా, ఆపదలో అండగా నిలబడే అన్నగా అంతకుమించి, మొక్కకపోయినా వరాలిచ్చే దేవుడిగా కనిపించారు. నిరంతరం పరిస్థితిని సమీక్షించడం, తరచుగా మీడియాతో మాట్లాడటం, చేతులె త్తి దండంపెట్టి మరీ పరిస్థితి తీవ్రతను, గంభీరతను వివరించడం, నేనున్నాననే భరోసా కల్పించడం ప్రజలకు ధైర్యాన్నిచ్చాయి. మరోవైపు ప్రజల్ని రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సన్నద్ధం చేశాయి.

మూడో దశలో- మార్చి 22న పరిస్థితులు సమీక్షించిన తర్వాత ఎవరూ ఊహించని రీతిలో ప్రభు త్వం పూర్తిస్థాయి కట్టడిని (లాక్‌ డౌ న్‌) ప్రకటించింది. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా  ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించారు. ఇది తెలంగాణలో సంపూర్ణంగా విజయవంతమైం ది. అదేరోజున కేసీఆర్‌ తెలంగాణ ‘లాక్‌డౌన్‌' ప్రకటించారు. ఇలా కట్టడి చేయడం వల్ల ఎదురయ్యే కష్టాలను కూడా ఊహించగలిగారు. పేదలందరికీ కావాల్సిన బియ్యం ఉచితంగా ఇవ్వడంతో పాటు, నెలకు రూ.1500 ఆర్థికసాయం కూడా ప్రకటించారు. రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌ ఏర్పా ట్లు, గర్భిణులకు కావాల్సిన వైద్య సదుపాయాలూ ఇలా అనేక అం శాల పట్ల జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా విజృంభించిన కరీంనగర్‌ పట్టణంలో ఇం టింటా తిరిగి వేలాది మందికి పరీక్షలు చేశా రు. అదేవిధంగా ఇళ్లల్లోకి కూరగాయలు, సరుకులు పంచారు. హైదరాబాద్‌ను కూడా పూర్తి గా అష్టదిగ్బంధం చేయాల్సి రావచ్చు.

ఇవన్నీ అర్థం చేసుకోకుండా మనం కట్టడి ని ఉల్లంఘిస్తామంటే చైనాలో అవలంబించిన నాలుగోదశ తప్పదు. అదే గృహ నిర్బంధం. చివరిదశలో చైనా కూడా సైన్యాన్ని పిలిపించిం ది. ‘స్వచ్ఛందంగా సమాన దూరాన్ని పాటిచం డి..’ అని చెప్పడం వెనుక ఆ మాయావిని కట్టడి చేసే ఆలోచన ఉన్నది. మనిషికీ మనిషికీ తుంపర తాకనంత దూరం ఉంటే చాలు మనిషితో దాని బంధం తెగిపోతుంది, వ్యాప్తి ఆగిపోతుంది. అందుకే ఆ గొలుసు తెగగొట్టాలని అం టున్నారు. అలా కాకుండా మనం ఎప్పటిలాగే ఉంటే అది  దావానలమై వ్యాపిస్తుంది. ఇప్పటి కే ప్రపంచంలో అగ్రరాజ్యాలన్నిటినీ మసి చేస్తున్న ఈ మాయరోగానికి మనమేమీ అతీతు లం కాదు. అందుకే కేసీఆర్‌ కొంత కటువుగా ఉంటున్నారు. ఆ మృత్యువును మోసుకొచ్చేది బలాదూర్‌గా బయట తిరిగేవాళ్లే, కాబట్టి వాళ్ల ను నిలువరించాలి.

గృహ నిర్బంధంతో రెండో ప్రయోజనం వైరస్‌ను మోసుకు తిరుగుతున్న వాళ్లను వెతి కిపట్టడం, చైనా ఇల్లిల్లూ గాలించి రోగుల్ని లాక్కొ చ్చి మరీ వైద్యం చేసింది. ప్రజలను కనీసం కిటికీలు కూడా తెరవకుండా నియం త్రించింది. వైద్యసేవలతో పాటు, ఆహార సరఫరా వంటి వాటి కోసం వలంటీర్లను నియమించుకున్నది. ఈ ఆలోచన కూడా కేసీఆర్‌ చూచాయగా మనతో పంచుకొని ఉన్నారు. తెలంగాణలో పది లక్షల మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్లందరూ ఎక్కడికక్కడ కథానాయకులు కావాలని ఆయన ఇప్పటికే చెప్పారు. రేపు వాళ్లంతా స్వచ్ఛంద సేవకులు గా మారవచ్చు. చైనా కమ్యూనిస్టు దేశం కాబ ట్టి ఇంత విస్తృతమైన పరిపాలనావ్యవస్థ, రాజకీయ, నాయకత్వ వికేంద్రీకరణ ఉండ దు. నిజానికి మనకు అదొక బలం. ఈ బల మే మనల్ని రేపు నిలబెడుతుంది. 

కరోనా విషయంలో చాలా దేశాల్లో ప్రభు త్వం చేతులెత్తేసింది. అమెరికా అధ్యక్షుడు, ఇటలీ అధినేతలు ఏం చేశారో చూశాం. అక్క డ ఏమవుతున్న దో గమనిస్తున్నాం. నిజానికి మనం నిశ్చింతగా ఉండవచ్చు. ముఖ్యమం త్రి గారు పదేపదే ప్రాధేయపడి చెబుతున్నది కూడా అదే! ‘మీకు నేనున్నా, మీరు మీ ఇళ్ళల్లోనే ఉండం డి, స్వీయ నియంత్రణ పాటించండి’ అంటున్నారు. మనం చేయవలసింది అదే. మహా నేత ఉన్నాడు. నిశ్చింతగా ఉం డండి, నియంత్రణ పాటించండి. కరోనా మాయావి కంటపడకుండా ఉండండి. అంతే దానికదే కనిపించకుండాపోతుంది.

(వ్యాసకర్త: సామాజిక, రాజకీయ పరిశోధకులు)


logo