బుధవారం 03 జూన్ 2020
Editorial - Mar 28, 2020 , 22:14:24

అష్టగ్రహ కూటమి

అష్టగ్రహ కూటమి

యాజ్ఞవల్క్యుడు బ్రహ్మర్షి. అతణ్ని ఒకరోజు ఆర్తభాగుడనే విద్వాంసుడు ‘జీవున్ని శరీరంలో బంధించే గ్రహాలు, అతి గ్రహాలేవో చెప్పమని’ అడిగాడు. యాజ్ఞవల్క్యుడు చెప్పినదాని ప్రకారం అవి మనం అనుకొనే ఖగోళ సంబంధమైన గ్రహాలు కావు. ఇక్కడ గ్రహించడమంటే పట్టుకోవడం. అట్లా గ్రహించినదాన్నే ‘గ్రహం’ అంటారు. మానవ శరీరంలో కూడా ఒక ‘అష్టగ్రహ కూటమి’ ఒకటుంటుంది. వాటినే తెలుసుకోవాలని అనుకొంటాడు ఆ విద్వాంసుడు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు చెప్పి న వివరాలు ఇలా వున్నాయి.

శరీరంలో ముక్కు ఒక గ్రహం. అది మన శరీరంలోని జీవుణ్ణి పట్టుకొని ఉంది. జ్ఞానేంద్రియాలలో ఒకటైన ముక్కుకు విషయం గంధం. అది జీవుణ్ణి మరింత గట్టిగా పట్టుకుంది. కనుక, అది అతిగ్రహమైంది. నాలుక ఒక గ్రహం. అది శరీరధారియైన జీవుణ్ణి పట్టుకొని ఉంది. నాలుకకు విషయమైన రసం జీవుణ్ణి మరింత గట్టిగా పట్టుకుంది. కనుక అది అతిగ్రహమైంది. ఇదే పద్ధతిలో కన్ను ఒక గ్రహం. అది శరీరధారి అయిన జీవుణ్ణి పట్టుకొని ఉంది. దానికి విషయం రూపం. అది జీవుణ్ణి మరింత గట్టిగా పట్టుకొని ఉంది. అందుకే, అదీ ఒక అతిగ్రహమైంది. అలాగే, చర్మం ఒక గ్రహం. అది కూడా శరీరంలో జీవుణ్ణి పట్టుకొని ఉంది. చర్మానికి విషయం స్పర్శ. అది జీవుణ్ణి మరింత గట్టిగా పట్టుకొని ఉంది. అందువల్ల దాన్నీ అతిగ్రహం అని పిలుస్తారు.

చెవి కూడా ఒక గ్రహం. అది శరీరంలో ఉండి జీవు ణ్ణి పట్టుకొని ఉంది. దానికి శబ్దం విషయం. అది జీవుణ్ణి మరింత గట్టిగా పట్టుకొని ఉంది. అందువ ల్ల అది అతిగ్రహమైంది. మనస్సు కూడా ఒక గ్రహం. అది శరీరంలో అంతటా ఉండి జీవుణ్ణి పట్టుకొన్నది. మనస్సుకు విషయం మననం (ఆలోచించడం). అదీ జీవుణ్ణి మరింత గట్టిగా పట్టుకొని ఉంది. కనుక, అది అతిగ్రహంగా పిలువబడుతున్నది. చెయ్యి ఒక గ్రహం. అది శరీరంలో జీవు ణ్ణి పట్టుకొని ఉంది. దానికి విషయం కర్మ. కర్మ చేయకుండా ఏ మనిషీ ఉండడు. కనుక, జీవుణ్ణి అది మరింత గట్టిగా పట్టుకొని ఉండటం వల్ల ఇదీ అతిగ్రహమైంది.

ఇదే ప్రకారం వాక్కు కూడా ఒక గ్రహం. అది శరీరంలో జీవుణ్ణి పట్టుకొని ఉంది. వాక్కుకు విషయం నామం. ఇదీ జీవుణ్ణి మరింతగా గట్టిగా పట్టుకొని అతిగ్రహమైంది. ఈ విధంగా ముక్కు, నాలుక, కన్ను, చర్మం, చెవి.. అనే ఈ అయిదు జ్ఙానేంద్రియాలతోపాటు మనస్సు, చెయ్యి, వాక్కు అనే త్రికరణాలూ మన శరీరంలోని జీవుణ్ణి గ్రహించి (బంధించి) ఉన్నాయి. కనుక, ఈ ఎనిమిదీ (అష్ట) గ్రహాలయ్యాయి. వీటినే తత్తవేత్తలు మానవ శరీరంలోని ‘అష్టగ్రహ కూటమి’గా అభివర్ణిస్తారు.

మన శరీరంలోనే ఇలా గ్రహాలుండటం వల్ల జీవుడు అవి చెప్పినట్లు వింటూ వుంటాడు. వాటికి సంబంధించిన విషయాలలో (అతిగ్రహాలతో) మునిగి తేలుతున్నాడు. జీవుడు ఈ గ్రహాలను నిరంతరం సేవిస్తున్నాడు. వాటి బంధనాల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ, బ్రహ్మజ్ఞాని అయిన మనిషి మాత్రం గ్రహాలనుంచి, అతిగ్రహాలనుంచి బయటపడి, అనంతానందమైన మోక్షం వైపు సాగిపోతాడు.

-ఆచార్య మసన చెన్నప్ప


logo