ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Mar 28, 2020 , 22:12:29

కరోనా రామాయణంలో వైరసాసుర ఘట్టం

కరోనా రామాయణంలో వైరసాసుర ఘట్టం

‘భవతీ భిక్షాందేహి’ అంటూ.. 

ఏ రావణుడూ కాలింగ్‌ బెల్లు నొక్కడు 

గీత దాటొద్దని 

ఏ లక్ష్మణుడూ వార్నింగ్‌ ఇవ్వడు

ప్రలోభాలకు గురి కావొద్దని 

ఏ రాముడూ నచ్చచెప్పడు 

మాయరూపంలోని ఏదో వస్తువు

సీత మనసు తొలిచేస్తూ ఉంటుంది

రా రమ్మని పిలుస్తూ ఉంటుంది..! 


రావణుడు అవకాశం కోసం 

కాచుకుని ఉంటాడు

ఏ గీతో దాటుకుని

ఆ సీత వచ్చేస్తుందని..

లక్ష్మణుడు చూసుకుంటాడని

రాముడు ధైర్యంగా బయటికి         అడుగు పెడతాడు 

సీత కోర్కె తీర్చేందుకు..!

హద్దు రేఖ గీయకున్నా

అన్నమాట అతిక్రమించరని

లక్ష్మణుడు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో నిద్రపోయాడు..


కరోనా రామాయణంలో

లక్ష్మణుడు గీత గీయడు

రాముడు బాణమేయడు

మారీచుడు ‘హా లక్ష్మణా!’ అంటూ అరవడు 

‘హల్లో రామా!’ అంటూ 

రాముడి చేతిసంచిలో వస్తువయ్యాడు మారీచుడు / తిరుగు ప్రయాణంలో 

గుమ్మం దగ్గరున్న రావణుడూ తోడయ్యాడు

మారీచ రావణులే 

జలుబూ జ్వరంగా మారారు

వైరసాసుర రూపమెత్తారు..!


ముందు రాముడు/ తర్వాత సీత

ఆ తర్వాత లక్ష్మణుడు 

వైరసాసుర ఆక్రమణలో తల్లడిల్లుతూ..


ఎత్తుకుపోవడం త్రేతాయుపు కథ

శరీరాన్నే ఆక్రమించడం

రాక్షసుల కలికాలపు యుద్ధ వ్యూహం


సీన్‌ కట్‌ చేస్తే-

నిద్ర నుండి మెలకువొచ్చిన రాముడు 

క్వారంటైనే జీవనసూత్రమని 

సీతకు ఉద్బోధిస్తున్నాడు

పద్నాలుగేళ్ల వనవాసం ముందు

ఇరవై ఒక్క రోజుల క్వారంటైన్‌ కాలమెంత అని ప్రశ్నిస్తున్నాడు.. 

వైరసాసుర సంహారానికి 

వానరులవసరం లేదంటున్నాడు

‘వాష్‌ మంత్రం’ మేలంటున్నాడు... 


ఆ మాటలను రికార్డు చేస్తూ

సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంలో/ లక్ష్మణుడిప్పుడు బిజీ...


రాముడి ఇంటి బయట

వైరసాసురుల నిరీక్షణ

ఇంకా కొనసాుతూనే ఉంది.. ..!

- డాక్టర్‌ ఆర్‌. సూర్య ప్రకాశ్‌రావు, 94410 46839


logo