బుధవారం 03 జూన్ 2020
Editorial - Mar 27, 2020 , 22:34:37

కథానాయకులు

కథానాయకులు

కరోనా వైరస్‌పై పోరాటం విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహాత్మకంగా, దశలవారీగా వ్యవహరిస్తున్న తీరు సత్ఫలితాలనిస్తున్నది. విదేశాలలో కరోనా వైరస్‌ సృష్టిస్తున్న భయానక పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి ఇందుకు మనం కూడా సమాయత్తం కాకతప్పదని ముందుగానే గ్రహించారు. ప్రజలను భయాందోళనల కు గురిచేయకుండా ఒక పద్ధతి ప్రకారం వారిని మానసికంగా సిద్ధం చేశారు. ముప్పు తీవ్రతను ప్రజలకు వివరిస్తూ, ముందు జాగ్రత్తలు చెబుతూనే మరోవైపు అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో రంగంలోకి దింపారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో భాగస్వాములు కావాలంటూ బుధవారం ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు జిల్లాల్లో తిరుగాలని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ఉండి అధికారుల మధ్య సమన్వయం సాధించాలని కేసీఆర్‌ సూచించారు. దీంతో రాజధాని హైదరాబాద్‌ మొదలుకొని గ్రామస్థాయి వరకు కరోనా కట్టడి కార్యక్రమం ప్రజా ఉద్యమరూపం సంతరించుకున్నది. పల్లెల్లోని ప్రజలు కూడా స్వచ్ఛందంగా పరస్పర దూరం పాటించడమే కాకుండా, ఏకాంతవాసానికి ఏర్పాట్లు చేసుకోవడం ఆశ్చర్యకరం. 

అధికార బృందంతో పోలిస్తే ప్రజాప్రతినిధులకు సమాజంతో ఎక్కువ సంబంధాలుంటాయి. ప్రజలతో కరకుగా కాకుండా సౌమ్యంగా వ్యవహరించి మెప్పిస్తారు. అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఆయా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించగలరు. అందుకే కేసీఆర్‌ పిలుపు మేరకు మంత్రులు జిల్లా ల్లో తిరుగుతూ భిన్న శాఖలకు మధ్య, ప్రజలకూ అధికారగణానికి మధ్య సమన్వ యం సాధిస్తున్నారు. ఈ సందర్భంగా పురపాలక మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో అవిశ్రాంతంగా పరిశ్రమిస్తున్న తీరు గమనార్హం. స్పందించే మనస్తతం ఉన్న సున్ని త మనస్కులకే ఎవరైనా చెప్పుకుంటారు. కేటీఆర్‌కున్న ఈ గుర్తింపు మూలంగా ఎక్కడో విదేశాలలో, ఇతర రాష్ర్టాలలో ఉన్న సామాన్యులు ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేయడం, ఆయన స్పందించడం సహజంగా మారింది. లాక్‌డౌన్‌ మూలంగా అక్కడక్కడా చిక్కుకుపోయిన వారిని ఆదుకోవడానికి ఆదేశాలు జారీ చేస్తూనే, స్వయం గా హైదరాబాద్‌లో క్షేత్రస్థాయిలో కేటీఆర్‌ పర్యవేక్షణ జరిపారు. గుడిసెలో ఆకలితో అలమటిస్తున్న దినసరి కూలీ, సొంత గ్రామానికి కాలినడకన సాగిపోతున్న పేద కుటుంబం-ఇటువంటి వారెవరు దృష్టికి వచ్చినా, నిర్లక్ష్యం చేయకుండా ఆదుకుం టూ ఇతర నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

కరోనా ఎంతగా చెలరేగిపోయినా సరే, తట్టుకునేవిధంగా వైద్యులను, వసతుల ను కేసీఆర్‌ సమకూర్చి పెడుతున్నారు. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ముఖ్యమం త్రి రైతుల అవసరాల గురించి గుర్తుచేసి భరోసా ఇవ్వడం విశేషం. పొలాలకు నీటి కొరత ఉండదనీ, విద్యుత్‌ సరఫరా యథావిధిగా సాగుతుందంటూ ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి, రైతులు ఊరు దాటకుండానే ధాన్యాన్ని అమ్ముకొని, సొమ్ము బ్యాంకులో పడేవిధంగా ఏర్పాట్లు చేశారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలనే మహత్తర లక్ష్యంతో కేసీఆర్‌ ఏర్పాటు చేసిన రైతు సమితులు ఈ కష్టకాలంలోనూ కీలకపాత్ర పోషించబోతున్నాయి. తెలంగాణ సాధన కోసం తాను ఆమరణ దీక్ష పట్టినప్పుడు, గ్రామగ్రామాన ప్రజలే కథానాయకులు కావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ దీక్షకు చలించిపోయిన ప్రజ లు ఉద్వేగంతో ఎక్కడికక్కడ ఉద్యమబాట పట్టారు. మళ్ళా ఇప్పుడు అదే కేసీఆర్‌ ప్రజల ప్రాణ రక్షణ కోసం ఎక్కడి ప్రజలు అక్కడే కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా ప్రజలు అదే రీతిలో స్పందించాలి. మానవ మనుగడను కాపాడుకునే విశ్వవ్యాప్త యజ్ఞంలో భాగస్వాములు కావాలి.


logo