సోమవారం 25 మే 2020
Editorial - Mar 27, 2020 , 22:31:51

సత్యాగ్రహంతోనే కరోనా కట్టడి

సత్యాగ్రహంతోనే కరోనా కట్టడి

సంగీతానికి చింతకాయలు రాలుతాయా అని అంటారు. చింతకాయలు రాలడమే కాదు సింహాలు సైతం బెదురుతాయని, వశమవుతాయని నిరూపించిన సంగీతజ్ఞులు, గాయకులున్నారు. కొన్నేండ్ల కిందట హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్‌ మైదానంలో, ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ సంగీత మహా విద్వాంసుడు, ప్రపంచ ప్రసిద్ధ గాయకు డు ఓంకార్‌నాథ్‌ ఠాకూర్‌ చెప్పిన విషయాలను విన్నప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. ఆయన చెప్పింది నిజమేనా అన్న అనుమానం కలిగింది. కానీ, ఆ మహా పండితుడు, వాగ్గేయకారుడు చెప్పిందంతా నిజమనడంలో సందేహం లేదు. ఓ రోజు సాయంత్రం ఓంకార్‌నాథ్‌ ఠాకూర్‌, ఆయన అనుచరులు మధ్యప్రదేశ్‌లోని ఓ అరణ్యం నుంచి ప్రయాణిస్తున్నారు. హఠాత్తుగా బలమైన ఓసింహం వచ్చి నడిరోడ్డు మీద నిలిచింది. ముందుకు వెళ్లలేమని, ప్రాణహాని తప్పదని అనుచరులు భయపడ్డారు. 

ఠాకూర్‌జీ ఏ మాత్రం భయపడలేదు. ఆయన గంభీరమైన కంచుకంఠంతో, సహజ సిద్ధమైన మాధుర్యాన్ని, తన్మయపరిచే అపా ర, అమోఘ సంగీతశక్తిని ఒలికిస్తూ ఒక శ్లోకా న్ని ఆలాపించడం ప్రారంభించారు. హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయకు, ఆయన రచించి ఆలాపించిన ‘గగన్‌మస్త్‌ హోగయ’ అజరామ ర గీతానికి ప్రేరణ కలిగించిన శ్లోకం అది. ఓంకార్‌నాథ్‌ ఠాకూర్‌ శ్లోకాలాపన ముగియక ముందే, నడిదారిలో మృగరాజు వలె తిష్టవేసి న ఆ సింహం తోక ముడిచి చడీచప్పుడు లేకుండా అరణ్యంలోకి వెళ్లింది. ఠాకూర్‌జీ సంగీతశక్తి ప్రబలంగా తెలిసిన అనుచరులు సైతం అమితాశ్చర్యానికి గురైనారు. శ్లోకంలో అంతులేని బలం ఉంది; వశీకరణ శక్తి ఉంది. ఆ శ్లోకాన్ని మహత్తరంగా, మేఘగర్జన వలె ఆలాపించిన గాయకుడిలో ఎంత శక్తి ఉందన్నది ముఖ్యం.

మన ప్రాచీనతకు ప్రతీకలైన వేదాలు, ఉపనిషత్తులు, బహుళ శాస్ర్తాల్లో మానవాళి శ్రేయస్సుకు బహుముఖంగా దోహదపడగల అపార శక్తి ఉంది. కానీ, వేదాలను, ఉపనిషత్తులను, వివిధ శాస్ర్తాలను, వాటి పేరు చెప్పి కుటిల రాజకీయాలకు ఉపయోగించాలనుకుంటున్న మతోన్మాదులు మహర్షులు కాలేరు. శ్లోకాలు ఆలాపించిన వాళ్లందరు ఓంకార్‌నాథ్‌ ఠాకూర్‌ లు కాలేరు. మాక్స్‌ముల్లర్‌, ఐన్‌స్టీన్‌, బెట్రాండ్‌ రస్సెల్‌ వంటి మహా పండితులు, మహా మేధావులు మెచ్చినవి, గౌరవించినవి మన వేదాలు, ఉపనిషత్తు లు, శాస్ర్తాలు. ఈ ప్రాచీన విజ్ఞాన సంపదను ప్రయోజనకరంగా, మానవాళి మేలు కోసం ఉపయోగించగలిగినవారు మనకు ఈ రోజుల్లో ఎంద రున్నారన్నది పది ట్రిలియన్ల ప్రశ్న. శాస్ర్తాలకు న్యాయం చేయగలుగుతున్నామా లేదా అన్న ది మరో ప్రశ్న.

గతేడాది 2019 ఏప్రిల్‌ 6న తెలుగుసీమ అంతటా వికారినామ సంవత్సర ఉగాది రోజు పంచాంగ పఠనం జరిగింది. విశేషించి హైదరాబాద్‌లో ప్రముఖంగా ఐదారు చోట్ల పేరొందిన పండితులు, సిద్ధాంతులు, పంచాంగకర్తలు పంచాంగ పఠనం చేసి అంతా బాగుందన్నారు. వారు భవిష్యత్తును పూల పాన్పుగా చిత్రించినప్పటికీ, సామాన్యులు మాత్రం ‘వికారి’ పేరు వినగానే భయపడ్డారు. భవిష్యత్తు ‘సకారి’గా, సంతోష ప్రదంగా ఉంటుందని సామాన్య జనకోటి భావించలేదు. దేశ ప్రజల, తెలుగు రాష్ర్టాల ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాల కు ప్రమాదకరంగా ఒక మహమ్మారి కరోనా వైరస్‌ ముంచుకొస్తుందని ప్రముఖ పంచాంగకర్తలు, పంచాంగ పఠనం చేసిన పండితులు సూచనప్రాయంగానైనా ఆ రోజు చెప్పలేదు.  పంచాంగకర్తలకు తెలిసినా చెప్పలేదనుకోవా లా?! ఏడాది గడువకముందే వికారినామ సంవత్సరం ఎంతటి భయానకమైనదో, మన ఆరోగ్యానికి, ప్రాణాలకు ఎంతటి ముప్పును కలిగిస్తున్నదో స్పష్టమైంది. పంచాంగ రచనకు, భవిష్యత్‌ జోస్యాలకు ప్రాతిపదిక అయిన, మూలమైన ఖగోళశాస్త్రంలో లోపం లేదు, శాస్ర్తాలు సమగ్రమైనవి అయినా కాకపోయినా వాటిలో లోపం లేదు. శాస్ర్తాలను నిర్వచించి, వివరించి, అన్వయించి భాష్యం చెప్పేవారిలో నే ఏవైనా లోపాలున్నాయనుకోవాలె. ముప్రీ తి కోసం, ఎవరికో సం తృప్తి కల్గించడానికి శాస్ర్తానికి వివరణలు ఇచ్చే పండితులు, సిద్ధాంతులు, పంచాంగకర్తలు, భాష్యకారులు ఎవరి కీ న్యాయం చేయడం లేదనాలె. శాస్ర్తానికి మసి పూసి మారేడుకాయ చేయడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. వికారి సంవత్సరంలో ఒక విదేశీ మహమ్మారి విజృంభించి, వ్యాపిం చి దేశంలో కోట్లాదిమంది (సామాన్యులు, అసామాన్యులు అన్న తారతమ్యం, విచక్షణ లేకుండా) ప్రాణాలకు ప్రమాదకారి అవుతుందని 2019 ఏప్రిల్‌ 6 పంచాంగ పఠనంలోనే హెచ్చరించి ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర దేశాల ప్రభుత్వాలు ముందే జాగరూక త వహించగలిగేవి.

సంగీత విశారదుడు ఓంకార్‌నాథ్‌ ఠాకూర్‌ ఒక శ్లోకం ఆలాపనతో ఓ క్రూర మృగాన్ని వశపరచుకోగలిగినప్పుడు దేశమంతటా తామర తంపరగా ఉన్న స్వాములు, యోగులు, బాబా లు (వీరు వేదాలను, ఉపనిషత్తులను, వివిధ శాస్ర్తాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని ఆపోశనం పట్టిన తపోధనులని కోట్లాది సామాన్యులు, అమాయక చక్రవర్తులు గాఢం గా విశ్వసిస్తారు) కరోనా వైరస్‌ మహమ్మారిని నియంత్రించలేరా అని ప్రశ్నించడంలో తప్పు లేదు. వరుసగా ఆరేండ్ల నుంచి ప్రతి క్వార్టరు కాలంలో అభివృద్ధి రేటు తగ్గి, అన్నిరంగాల్లో     ఉత్పత్తులు, ఎగుమతులు క్షీణించి, నిరుద్యో గం వికృతరూపం ధరించి ఆర్థికమాంద్యం భయంకర స్వరూపం ధరించిన క్లిష్ట పరిస్థితి లో కరోనా కాటు గోరుచుట్టుపై రోకటిపోటయింది. ఇప్పటికే రూ. లక్షల కోట్ల విలువైన నష్టం సంభవించింది. రేపోమాపో కరోనా కనుమరుగైనా ఈ నష్టం, అది కలిగించే విపరీ త భారం మిగిలే ఉంటాయి. ఈ ఆర్థిక భారా న్ని సామాన్యులే మోయక తప్పదు. నాలుగు నెలల కిందట కరోనా వైరస్‌ సంక్రమణం, వ్యాప్తి మొదలైనా (వూహాన్‌ నగరంలో) చైనా ప్రభుత్వం ఈ ప్రమాదం గురించి తెలియజేయలేదని, ఆ విషయాన్ని దాచిపెట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేతులు కాలిన తర్వాత మండిపడుతున్నాడు. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం, అక్కడి అప్రజాస్వామిక వ్యవస్థ అన్ని విషయాలను బయటి ప్రపంచానికి వెల్లడిస్తుందనుకోవడం పొరపాటు. ఐరన్‌ కర్టెన్‌ వెనుక ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం కష్టం. అమెరికా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ, చైనాలో ని అమెరికా రాయబారి కార్యాలయం, డబ్ల్యూహెచ్‌వో, అక్కడి భారత రాయబారి కార్యాలయం కరోనా పుట్టుకను పసిగకట్టడం లో విఫలమైనాయి. భారత ప్రభుత్వం తన సరిహద్దులకు ఆవల చైనాలో ఒక మహమ్మారి చేస్తున్న కరాళ నృత్యాన్ని గమనించలేకపోయింది. చైనాతో ఈ మధ్య ఆర్థిక, పారిశ్రామి కరంగాల్లో సన్నిహిత సంబంధాలు ఏర్పడిన, పెద్ద సంఖ్యలో చైనీయుల రాకను నిరోధించలేకపోయిన ఇటలీ, ఇరాన్‌ కరోనా ఆకలికి బల వుతున్నాయి. 

కీలెరిగి వాత పెట్టడం కేసీఆర్‌ ప్రత్యేక పద్ధ తి. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పద్నాలు గేండ్ల మహోజ్వల ఉద్యమంలో కేసీఆర్‌ తనదై న పద్ధతితో పలు జయప్రద ప్రయోగాలు జరిపారు. లక్ష్యాన్ని సాధించిన ప్రయోగాలివి. గత ఆరేండ్ల సుపరిపాలనలో కూడా కొన్ని సందర్భాల్లో ఆ మహా నాయకుడు కేసీఆర్‌ ఈ ప్రయోగాలు జరుపవలసి వచ్చింది. సకల ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా విష క్రిమి కరో నా వైరస్‌ను వెంటనే అదుపు చేయడానికి ఈ పద్ధతిపై ఆధారపడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఇదొక విధంగా గాంధీజీ అనుసరించిన Passive Resistance సత్యాగ్రహం. కరోనాను శాశ్వతంగా అరికట్టడంలో ఈ సత్యాగ్రహ విధానం నిశ్చయంగా విజయం సాధించవచ్చు. కశ్మీరు లో 2019, ఆగస్టు 5 నుంచి లక్షలాది ప్రజలు, ముఖ్యంగా వేలాది రాజకీయ కార్యకర్తలు, నాయకులు కనీసం సెల్‌ఫోన్‌ సదుపాయమై నా లేని గృహ నిర్బంధాలకు, లాక్‌డౌన్‌కు గురవుతున్నారు. కశ్మీర్‌ నిర్బంధాలు, ఆంక్షలతో పోల్చినప్పుడు ఇక్కడి లాక్‌డౌన్‌ కఠినం కాదు. కరోనా వైరస్‌ వూహా న్‌ (చైనా) దాటి ప్రపంచమంతటా సంక్రమిస్తున్నది. కరోనా కఠిన అనుభవాలతో ఈ దేశం పాఠాలు నేర్చుకొని భవిష్యత్‌ భద్రత కోసం జాగరూకత వహించా లె. Blessing in Disguise అంటారు పెద్ద లు. కొవిడ్‌-19 విషపు రోగం. దీనికి చేదు మందులు వేయక తప్పదు.

-దేవులపల్లి ప్రభాకరరావు


logo