మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Mar 26, 2020 , 22:35:41

అమెరికాలో అలజడి

అమెరికాలో అలజడి

కరోనా వైరస్‌ ఒకవైపు యూరప్‌లో కల్లోలం రేపుతూనే అమెరికా అంతటా విస్తరించి భారీగా ప్రాణాలను బలిగొంటున్నది. అభివృద్ధి చెందిన దేశాలే ఈ వైరస్‌ను కట్టడి చేయలేకపోతుండటం ఆశ్చర్యకరం. బుధవారం ఒక్కరోజే అమెరికాలో మూడు వందలకు మందికి పైగా మరణించడం దిగ్భ్రాంతికరం. దీంతో అమెరికాలో మృతుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. అమెరికా వ్యాప్తంగా ఈ వైరస్‌ సోకిన వారు దాదాపు 70 వేలు ఉన్నారు. ఈ వైరస్‌ బాధితుల సంఖ్య మూడు వారాలలో అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని ఒక వైద్యవేత్త అం చనా వేశారు. ప్రజలు ఎవరికి వారు దూరంగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే, మరణాల సంఖ్య భారీగా పెరుగువచ్చుననే ఆందోళన వ్యక్తమవుతున్నది. అదే జరిగితే వైరస్‌ సోకిన వారి సంఖ్యకు అనుగుణంగా వైద్య సదుపాయాలు కల్పించడం కూడా కష్టమవుతుంది. అమెరికాలో దాదాపు సగం కేసులు న్యూయార్క్‌లోనే ఉన్నాయి. ఇప్పటికే ముప్ఫై వేల రోగులు ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు మూడు వారాలలో పరిస్థితి ఎంతగా విషమిస్తుందో చెప్పలేం. ఆస్పత్రులలో ప్రస్తుతం నాలుగు వేల వెంటిలేటర్లు ఉండగా, మరో పది వేలు అతి కష్టంగా సమకూర్చుకోవచ్చు. కానీ కేసులు భారీగా పెరిగిపోతే ఇవి సరిపోకపోవచ్చు. ఇదేవిధంగా ఇతర పరికరాలు, వసతులు సమకూర్చుకోవడం సాధారణ విషయం కాదు. ఇతర రాష్ర్టాల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉన్నది.

అమెరికా సెనేట్‌ రెండు లక్షల ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన పథకాన్ని ఆమోదించింది. ఈ బిల్లు చట్టరూపం పొందాలంటే ప్రతినిధుల సభ ఆమోదిం పొంది దేశాధ్యక్షుడిని చేరవలసి ఉంది. ఇప్పటికే నిరుద్యోగం భారీ పెరిగినందువల్ల ఉపాధి కల్పనకు భారీ కేటాయింపులు చేయకతప్పదు. ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా చర్యలు తీసుకోవలసి వస్తున్నది. అమెరికాలో జాతి విద్వేషదాడులు ఒక సమస్యగా మారిం ది. శ్వేతజాతీయులు చైనా వారి పట్ల ఆగ్రహంగా ఉన్నారు. చైనా వారని భావించి ఆసియాకు చెం దిన ఇతర జాతులపై కూడా దాడులు సాగిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించి దేశాధ్యక్షుడు ట్రంప్‌ కరోనా వైరస్‌ వ్యాప్తికి ఆసియా వాసులకు సంబం ధం లేదని ప్రకటించారు. ఆర్థిక పరిస్థితులు దిగజారడానికి, సామాజిక వైషమ్యాలు పెరగడానికి సంబంధం ఉంటుంది. ఈ  పరిణామాలను, భారతీయులు అప్రమత్తులై గమనిస్తూ ఉండాలి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య దాదాపు ఐదు లక్షలుగా ఉంటే, మృతులు 22 వేలు దాటారు. అమెరికాతోపాటు కొన్ని యూరప్‌ దేశాలలో భారతీయుల సంఖ్య భారీగా ఉన్నది. వీరు ఏయే రూపాలలో సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఈ విషమ పరిస్థితిని ఎదుర్కొనడానికి ఏమేరకు సంసిద్దులై ఉన్నారనేది మన దేశం గమనిస్తూ ఉండాలి. ఆయా దేశాల రాయబార కార్యాలయాలు, ప్రవాసీ సంఘాలు చురుగ్గా సమన్వయంతో వ్యవహరించాలి. వైరస్‌ను ఎదుర్కొనడానికి ఇటలీ అనుసరించిన పద్ధతులను పరిశీలించాలని అమెరికా భావిస్తున్నది. చైనా, ఇటలీ, దక్షిణ కొరియా తదితర దేశాలు అనుసరించిన విధానాలను వాటి సాఫల్య వైఫల్యాలను మన దేశం కూడా అర్థం చేసుకోవాలి. మన దేశ సామాజిక పరిస్థితులకు అనుగుణమైన విధానాలను ఎంచుకోవచ్చు. ప్రత్యేకించి పరీక్షా పరికరాలు మొదలైన వాటికి లోటు రాకుండా చూసుకోవాలి. కరోనాతో పాటు సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనడానికి ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. ఈ గండం గట్టేవరకు ఇదే విధంగా సమాజమంతా ఒక్కటై నిలువాలి.


logo